Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 2:33 pm Editor : Admin

గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం మే 6

జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగదారుల గుర్తింపునకు నూతన మెడికల్ టెస్ట్ కిట్లు

ఇప్పటి నుండీ డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి సేవనంపై జిల్లావ్యాప్తంగా పోలీసుల టెస్ట్ లు

గంజాయి రహిత జిల్లా కోసం అనంతపురం పోలీసుల కీలక అడుగు… సహకరించాలని ప్రజలకు పిలుపు

జిల్లా పోలీసుల చేతుల్లో ప్రస్తుతం అందుబాటులో వెయ్యి మెడికల్ టెస్ట్ కిట్లు… మరో 10 వేల కిట్లు కోసం ఆర్డర్ పెట్టిన అనంత పోలీస్

— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు

జిల్లా వ్యాప్తంగా ఇకనుండీ డ్రంకన్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు ఉపయోగిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు పేర్కొన్నారు.

గంజాయి అనర్థాలపై ఇది వరకు విద్యాసంస్థలు, కాలనీలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో చైతన్యం తీసుకు రావడం జరిగిందన్నారు.

అంతేకాకుండా… గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేయడం జరిగిందన్నారు.

ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో నూతన సాంకేతికతతో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక మెడికల్ టెస్ట్ కిట్లను ప్రవేశపెట్టామని, వీటి ద్వారా పాజిటివ్‌గా వచ్చిన వారి నుంచి సరఫరా మార్గాలపై కీలక సమాచారం సేకరిస్తామని తెలిపారు.

అలాగే, గంజాయి వినియోగదారుల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్ మరియు పునరావాస చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు.

గంజాయి సేవించే అనుమానాస్పద వ్యక్తులు, విద్యా సంస్థలలో గంజాయి వినియోగం గురించి తగిన సమాచారం ఆధారంగా గంజాయి టెస్టులు చేసే విధానమును ప్రవేశ పెట్టనున్నామన్నారు.

పదే పదే టెస్టుల్లో పాజిటివ్‌గా వస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు.

సమాజంలో ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి గంజాయి రహిత అనంతపురం జిల్లాను సాధించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

📞గంజాయి సంబంధిత సమాచారం ఉంటే వెంటనే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 మరియు 112 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం సబ్-డివిజన్ డీఎస్పీ రవిబాబు గారు , ఈగల్ నోడల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జైపాల్ రెడ్డి గారు, ఈగల్ సెల్ అనంతపురం ఎస్సై హనుమంతు మరియు సిబ్బంది పాల్గొన్నారు.