Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 6:09 am Editor : Admin

మరింత బలంగా తిరిగి వస్తాం.!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మరింత బలంగా తిరిగొస్తాం!

ప్రజా విశ్వాసాన్ని చూరగొంటాం

ఈ తీర్పు అంతిమం కాదు !

పినరయి విజయన్‌

వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌‌డిఎఫ్‌)కు, ఈ తీర్పు అంతిమం కాదని, అయితే నిరంతర రాజకీయ కార్యకలాపాలకు ఇదొక కొత్త ఆరంభమని మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్‌ ‌వ్యాఖ్యానించారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తొలిసారిగా స్పందించారు. మరింత బలంగా తిరిగి వస్తామని, కేరళం ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొంటామని ఈ సందర్భంగా మేం హామీనిస్తున్నామంటూ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

యుడిఎఫ్‌‌కు అభినందనలు…

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మేం గౌరవంగా అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన యుడిఎఫ్‌‌కు మా అభినందనలు తెలియచేస్తున్నాం. ఎల్‌‌డిఎఫ్‌‌కు సంబంధించినంతవరకు, ఎన్నికల ఫలితాలు మొత్తంగా ఊహించనివి. అన్ని రకాలుగా ప్రతికూల ప్రచారం, దాడులు జరిగినప్పటికీ, ఎల్‌‌డిఎఫ్‌‌కు ప్రజలు అందించిన తోడ్పాటు, మద్దతుకు మేం ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మేం ఆశించిన వరుసగా మూడోసారి విజయం చేజారినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు ఎల్‌‌డిఎఫ్‌‌వైపు దృఢంగా నిలుచున్నారన్న వాస్తవం మాకు అత్యధికంగా విశ్వాసాన్ని కలగచేస్తోంది.

ప్రజా విశ్వాసాన్ని మరింత బలంగా తిరిగి పొందడానికి, మరింత బలమైన శక్తి సామర్ద్యాలతో ముందుకు సాగేందుకు మేం కట్టుబడి వున్నాం. గత పదేళ్ళలో అమలు చేసిన అభివృద్ధి చొరవలు, సంక్షేమ పథకాలు సమాజంలో ప్రధాన మార్పులు తీసుకువచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి అర్ధంతరంగా నిలిచిపోకుండా, ముందుకు తీసుకెళ్ళడానికి గానూ బలమైన ప్రజా చైతన్యం కొనసాగాలి.

కొత్త కేరళంను నిర్మించేందుకు ఎల్‌‌డిఎఫ్‌ ‌ముందుకు తీసుకువచ్చిన దార్శనికతలు-విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ, యువత ఉపాధి, సామాజిక న్యాయం, ప్రజారోగ్యం, విద్య-బలమైన ప్రతిపక్ష పాత్ర ద్వారా ముందుకు తీసుకెళ్ళబడతాయి. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించడం, మహిళా సాధికారత, సామాజిక భద్రత వంటి రంగాల్లో మన విధానాలు ప్రజలకు అవసరం. వీటిని అమలు చేయడానికి కొత్త ప్రభుత్వంపై మేం ప్రజాతంత్ర పద్ధతిలో ఒత్తిడి తీసుకువస్తాం.

మతోన్మాదం ఏ రూపంలో దానిపై రాజీలేని పోరాటం..

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచ డానికి తీసుకునే ఏ మంచి చర్యలకైనా మేం మద్దతునిస్తాం. అదే సమయంలో, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేయ డాలన్నదే ఎల్‌‌డిఎఫ్‌ ‌లక్ష్యం. కేరళ లౌకికవాదం, బహుళత్వాన్ని పరిరక్షించాలన్నది ఎల్‌‌డిఎఫ్‌ ‌ప్రాధమిక వైఖరి. ఈ ఎన్నికల ఫలితాల నుండి వెలువడిన కొన్ని సంకేతాలు లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుకునేవారికి ఆందోళన కలిగిస్తున్నాయి. బిజెపి మూడు సీట్లు గెలుచుకోవడం చాలా తీవ్రమైన అంశం. మతోన్మాదం ఏ రూపంలో వున్నా దానిపై రాజీ పడకుండా విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది.

బహిరంగంగా సమిక్షిస్తాం..

ఇంతకుముందే చెప్పినట్లుగా, ఈ ఎన్నికల్లో తప్పడు సమాచారం వ్యాపించింది. ఇందుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు పోషించిన పాత్రపై తీవ్రంగా పరిశీలన జరపాల్సిన అవసరం వుంది. అర్థ సత్యాలపై ఆధారపడే ప్రజంటేషన్లు, అతిశయోక్తులు, వాస్తవ విరుద్ధ ప్రచారాలు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రమూ ప్రయోజనకరం కాదు. అయితే, ఈ అనుభవాల నుండి నేర్చుకుని, ముందుకు సాగడం ముఖ్యమని ఎల్‌‌డిఎఫ్‌ ‌విశ్వసిస్తోంది. ఎన్నికల ఫలితాలను సమగ్రంగా సమీక్షించాలని, కామ్రేడ్‌‌లందరి అభిప్రాయాలను వినాలని ఎల్‌‌డిఎఫ్‌ ‌నిర్ణయించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో, బహిరంగ సమీక్ష జరపాలన్నది ఉద్దేశ్యం.

ఎన్నికల ఫలితాలనంతరం ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వెలువడే ఆందోళనలు, అభిప్రాయాలు, విమర్శలు అన్నింటినీ తీవ్రంగా పరిశీలిస్తాం. ప్రతి ఒక్కరి అభిప్రాయం విని నిర్ణయాలు తీసుకుంటాం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎల్‌‌డిఎఫ్‌ ‌కోసం వేలాదిమంది కార్మికులు పగలనక, రాత్రనక కష్టపడ్డారు. వారందరికీ మా అభినందనలు. యుడిఎఫ్‌, బిజెపి వంటి ప్రతిపక్ష శక్తులు, అలాగే నిర్దిష్ట మీడియా తీసుకున్న వైఖరి సృష్టించిన రాజకీయ వాతావరణంలో ఈ ఫలితం వచ్చింది. కొంతమంది వ్యక్తులు, నిర్దిష్ట అరాచక శక్తులు, రాజకీయేతర కేంద్రాలు సాగించిన తప్పడు ప్రచారంతో తప్పుదారి నడిచారు.

వారు వాస్తవాలు తెలుసుకునేలా తీవ్రమైన కృషి జరుగుతుంది. పోరాటం కొనసాగుతుంది.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ, మరింత శక్తి సామర్ద్యాలతో పనిచేయడానికి మేం సిద్ధమయ్యాం. కార్పొరేట్‌ ‌పిఆర్‌ ‌వ్యూహాలు సాగించే తప్పుడు కథనాలు, బూటకపు ప్రచారం మమ్మల్ని వెనక్కి నెట్టలేవు. ఎల్‌‌డిఎఫ్‌ ‌వైఖరుల్లో, జోక్యాల్లో లోపాలు, లొసుగులు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిశీలిస్తాం. అవసరమైన దిద్దుబాట్లు జరుగుతాయి. ప్రజలతో మా బంధాన్ని బలోపేతం చేయడం ద్వారా ఎల్‌‌డిఎఫ్‌ ‌మరింత స్పష్టతతో, విశ్వాసంతో ముందుకు సాగుతుంది. కేరళ భవితవ్యం, ప్రజల సంక్షేమం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం కోసం పోరాటం కొనసాగుతుంది. ఎల్‌‌డిఎఫ్‌‌తో నిలిచిన వారందరికీ మరోసారి కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగివస్తామని, కేరళ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని మీకు హామీ ఇస్తున్నాం.