Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 2:07 pm Editor : Admin

పేదవాడికి పెను భారంగా మారిన పెట్రోల్ డీజిల్ ధరలు టి రామకృష్ణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ మే 28

పేదవాడికి పెనుబారంగా మారిన పెట్రోల్ – డీజిల్ ధరలు

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ ఆగ్రహం

టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, పెట్రోల్ – డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు.

ఇటీవలి రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు పలుమార్లు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు, కూరగాయలు, సరుకుల ధరలు అమాంతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో చమురు సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని విమర్శించారు.

ఎన్నికలు పూర్తయ్యాక ఒక్కసారిగా ఇంధన ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని టి. రామకృష్ణ ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలను సాకుగా చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. భారీ ఎక్సైజ్ సుంకాలు, పన్నులతో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల రైతులు, ఆటో కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. రైతు పొలంలో ట్రాక్టర్ నడపాలన్నా, పంట మార్కెట్‌కు తరలించాలన్నా డీజిల్ ఖర్చు భారంగా మారిందన్నారు. ప్రజల కష్టాలపై పాలకులకు చింత లేకుండా కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధానాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న పన్నుల భారం ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. లేకపోతే దేశవ్యాప్తంగా ప్రజా ఆందోళనలు చేపడతామని టి. రామకృష్ణ హెచ్చరించారు.