(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 13
బడి ఈడు పిల్లలను బడికి పంపాలి – బాల కార్మికత్వానికి స్వస్తి పలకాలి
చదువుకు దూరం చేయకండి నేటి బాలలే రేపటి పౌరులు
టి . రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య మాత్రమేనని, బడి ఈడు వచ్చిన ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి . రామకృష్ణ పిలుపునిచ్చారు. పేదరికం, నిర్లక్ష్యం, అవగాహన లోపం కారణంగా ఇంకా అనేక మంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి బాలబాలికకు విద్య అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను పనులకు పంపించడం, ఇంటి పనుల్లో నిమగ్నం చేయడం, చిన్న వయసులోనే ఉపాధి కోసం బలవంతం చేయడం అత్యంత బాధాకరమన్నారు. పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలి గానీ పనిముట్లు ఉండకూడదని పేర్కొన్నారు.
నేటి బాలలే రేపటి దేశ పౌరులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వైద్యులు, నాయకులు అవుతారని గుర్తు చేశారు. ఒక చిన్నారి చదువుకు దూరమైతే అది కేవలం ఒక కుటుంబానికే కాదు, సమాజానికే నష్టమని అన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి బస్తీలో విద్యా చైతన్యం పెంచి ఒక్క పిల్లవాడూ బడికి దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి విద్యార్థులను ఆకర్షించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
“పిల్లల భవిష్యత్తు పుస్తకాలలోనే ఉంది… చదువు ప్రతి చిన్నారి హక్కు. బడి ఈడు పిల్లలను బడికి పంపడం ప్రతి తల్లిదండ్రి, ప్రతి పౌరుడి బాధ్యత” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ తేదీ రోజున స్కూలను ఓపెన్ చేస్తుంది తప్పనిసరి పిల్లలను బడికి పంపండి
అని టి . రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పేర్కొన్నారు.