(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హైదరాబాద్ : నేటి సత్యం జూన్ 19
‘జీవించే హక్కును కాలరాస్తున్న ఎస్ ఐ ఆర్ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎంపి మల్లు రవి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు అబ్బాస్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చలపతి, సిపిఐ(ఎంఎల్) మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హన్మేష్, ఎస్ రాష్ట్ర కార్యదర్శి మురహారి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, ఫ్రొపెసర్ జి.హరగోపాల్, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. గ్రామసభ లేదా వార్డు కమిటీలలో ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించడం, ఓటు హక్కు నిర్ధారణకు గ్రామ సభలు, వార్డు కమిటీలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం, ప్రజల వద్ద అందుబాటులో ఉన్నదృవీకరణ పత్రాలను ఆమోదించడం, అలాగే ఓటు హక్కును , పౌరసత్వానికి ముడి పెట్టరాదని తదితర తీర్మానాలను రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
*ఎస్ ఐ ఆర్ ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి ః మహేశ్ కుమార్ గౌడ్*
ఎస్ ఐ ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అనే ప్రక్రియ ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన పద్ధతి అని, కానీ ప్రస్తుతం ఓట్లు తొలగించే కార్యక్రమంగా మారిందని టిపిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గాన్ని కమ్యూనిస్టులు, కాంగ్రెస్, లౌకికవాద శక్తులన్నీ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రమని, ఆలాంటి ప్రతి ఒక్కరి ఓటును భద్రపరిచి జతచేయడమే ఎస్ ముఖ్య ఉద్దేశం కావాల్సి ఉండగా, లౌకికవాద పార్టీలకు ఓటు వేస్తారనే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి ఓటు తొలగించే ప్రక్రియగామారిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతంలో 2002లో లింగ్డో నేతృత్వంలో హైదరాబాద్ ఎస్ జరిగినప్పటికీ, నాటికీ నేటికీ చాలా తేడా ఉందన్నారు. ఓట్ల తొలగింపు వల్ల ముఖ్యంగా ఎస్సి ఎస్ టి, మైనారిటీ, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, కూలీ పనులు చేసుకునే వారు ఓటు హక్కు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ (బిఎల్ ఏ వ్యవస్థ చాలా ప్రాధాన్యమైందని, ఓటర్ల జాబితాను కాపాడుకోవడంలో వీరి పాత్ర కీలకమని తెలిపారు. కాంగ్రెస్ తరుపున తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే 108 నియోజకవర్గాల్లో బిఎల్ ఎ శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. వరంగల్, ఆందోల్ తదితర ప్రాంతాల్లో త్వరలోనే శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘బిఎల్ ఎ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడి ఓటును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు.
*ప్రజాస్వామానికి ఓటు ప్రాణ వాయువు ః కూనంనేని సాంబశివరావు*
కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ఓటు అనేది ప్రాణ వాయువు లాంటిదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు ఎంత వరకైనా ఉద్యమాలకు సిద్దమని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ఓటర్ల వివరాలు నిర్ధారణ కాలేదంటూ పత్రికల్లో వస్తున్న వార్తలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని, రాష్ట్రంలో మూడు కోట్లకు పైగా ఓటర్లు ఉంటే వారిలో 80 లక్షల మంది వివరాలు లభ్యం కాకపోవడం చిన్న విషయం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ బిడ్డలు తమ ఓటు హక్కును నిరూపించుకోవాలని అసంబద్ద నిర్ణయాలతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఓటు హక్కు నిరూపణకు గాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ధృవీకరణ పత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడేందుకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనకు వినతిపత్రం అందజేయడంతో పాటు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమాలకు సంసిద్దం అవుదామని ఆయన పిలుపునిచ్చారు.
*ప్రజా ఉద్యమాల ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి అడ్డుకట్ట సాధ్యం ః మల్లు రవి*
ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలను అడ్డుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే అడ్టుకట్ట వేయగలుగుతామని, ఇందుకు అన్ని పార్టీలు కలిసి రాజకీయంగా చేపట్టాల్సిన వ్యూహాలకు పదును పెట్టాలని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి అన్నారు.
ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థగా ఉండాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, కేంద్ర ప్రభుత్వం ఏమి చెబితే అది చేసే వ్యవస్థలా కొన్ని సంస్థలు మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 25 నుంచి ఎస్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, త ద్వారా ఓ బలమైన ప్రజా ఉద్యమం నిర్మించగలిగితే తప్ప కేంద్ర ప్రభుత్వం లొంగదన్నారు. ఇందుకు నాటి రైతు ఉద్యమమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
*ఓటుహక్కు లేకపోతే పౌరసత్వం లేనట్లే ఃకోదండరామ్
ఎంఎల్ సి ప్రొఫెసర్ ఎం.కోదండరామ్* మాట్లాడుతూ ఓటు హక్కు కోల్పోవడం అంటే కేవలం ఓటు వేసే అవకాశం పోవడం మాత్రమే కాదని, ఇది భవిష్యత్తులో పౌరసత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదానికి దారితీయవచ్చని హెచ్చరించారు. పౌరసత్వం లేకపోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లభించవని, తద్వారా ఇల్లు, రేషన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పేద ప్రజలు దూరమయ్యే ప్రమాదం ఉందని, ఇది ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు ప్రతి పేద వర్గానికి పెద్ద సమస్యగా మారనుందన్నారు. తాము ఈ దేశ పౌరులమేనని, ఇక్కడ ఓటు వేయడానికి అర్హులమేనని ప్రజలే స్వయంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక వ్యక్తి ఓటరా కాదా అని తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉండేదని, కానీ ఇప్పుడు 2002 నాటి ఎన్నికల రిజిస్టర్ ప్రస్తుత రిజిస్టర్ పోల్చి చూసే విధానం చాలా సంక్లిష్టంగా ఉందని, పేరులో కామాలు, పుల్ లేదా స్పెల్లింగ్ తేడాలు ఉన్నా కూడా ఓట్లను తొలగిస్తున్నారన్నారు. ఎస్ ప్రక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్ 93 లక్షల మంది ఓట్లు తొలగించగా ఇందులో 22 లక్షల మంది అక్కడ ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్ల ముందు ఆధారాలు చూపించినప్పటికీ, చిన్న చిన్న కారణాలతో వారిని ఓటర్లుగా గుర్తించలేదని గుర్తు చేశారు. ఈ తీవ్రమైన సమస్యను
అధిగమించడానికి ఐక్య కార్యాచరణకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.
ఓటు హక్కును తొలగించడం పౌర హక్కుల హరించడమే ఃహరగోపాల్
ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో భాగంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు ప్రక్రియకు సమాజంలో ప్రశ్నించే గొంతులను, మేధావులను ’అర్బన్ నక్సల్స్’గా
ముద్ర వేయడం వెనుక ఒక నిర్ధిష్టమైన రాజకీయ భావజాలం దాగి ఉందని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలని నక్సల్స్ పిలుపునిచ్చేవారని, కానీ నేడు సాధారణ ప్రజల్లో చైతన్యం పెరిగి వారు ఓటు వేస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా నుండి లక్షలాది మంది పేర్లను తొలగించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కును హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి మైనారిటీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఓట్ల తొలగింపు ప్రక్రియపై అధికార పక్షాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయని, దీనిని తిప్పికొట్టడానికి వామపక్షాలు, ఇతర ప్రజాస్వామ్య శక్తులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండేలా చూడాల్సిన నైతిక బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
సర్ ప్రక్రియ ఫాసిస్ట్ విధానం ఃమురహారి
‘సర్’ ప్రక్రియ పూర్తిగా ఫాసిస్ట్, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానమని, దీనిని విధానపరంగా ముక్త కంఠంతో ఖండించాలని ఎస్ రాష్ట్ర కార్యదర్శి మురహారి అన్నారు. ఎస్ ఐ ఆర్ అనేది ఒక నిర్ధిష్టమైన, వివక్షాపూరితమైన లక్ష్యంతో తీసుకువచ్చిన విధానమని విమర్శించారు. ఎస్ పేరుతో ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, వారి పౌరసత్వాన్ని ప్రశ్నించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో జర్మనీలో హిట్లర్ ఏ విధంగానైతే యూదులను వేటాడి చంపేశాడో, ఈ విధానం కూడా అదే తరహాలో జాతి వివక్షతో, ఒక వర్గాన్ని నిర్మూలించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవించే హక్కును కాలరాయడమే ః హన్మేష్
ఓటు హక్కును తొలగించడమంటే ఇది మనిషి జీవించే హక్కును కాలరాయడమేనని సిపిఐ(ఎంఎల్) మాస్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హన్మేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవస్థలనే మార్చేలా, తన అధీనంలోకి తెచ్చుకునేలా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఓటు హక్కు తొలగించడమంటే పౌర సత్వం నిరాకరించడమేనని ఇదే జరిగితే లక్షలాది మంది ప్రజలు కాన్సంట్రేషన్ క్యాంపులలో ఉండాల్సి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు.
రిటర్నింగ్ అధికారి దయ ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది ఃఅబ్బాస్
ఎస్ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కును అనుమతించాలా లేదా అనే విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్లకే పూర్తి విచక్షణాధికారాలు ఉంటాయని ఎలక్షన్ కమిషన్ స్వయంగా స్పష్టం చేసిందని సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు అబ్బాస్ తెలిపారు. ఈ నేపధ్యంలో ఓటు నిర్థారణకు సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన సరిపోదని, దానిని ఆమోదించాలా లేదా అనేది ఆ అధికారి భావజాలంపై ఆధారపడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ దురుద్దేశంతో ఓటు హక్కు తొలగింపు ః చలపతి
పౌరసత్వ చట్టం, ఎన్ లాంటి విధానాలు దేశంలోని మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను గురిచేస్తున్నాయని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు చలపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు ప్రక్రియ వెనుక ఒక రాజకీయ ఉద్దేశం ఉందని, వలసదారులు, పేదలు, ఆదివాసీలను ఇది ఇబ్బందుల్లోకి నెడుతుందని పేర్కొన్నారు.