Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:18 pm Editor : Admin

గెలవడమే జీవితమైతే..నేర్చుకోవడం ఎక్కడ.?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జూన్ 28

గెలవడమే జీవితమైతే… నేర్చుకోవడం ఎక్కడ?

మన చుట్టూ ఉన్న గజిబిజి ప్రపంచాన్ని ఒక్కక్షణం నిదానించి గమనించండి. పసితనపు నవ్వులు కూడా సరిగ్గా వికసించకముందే, పిల్లల లేత గుండెలపై ఒత్తిడి పర్వతాలు వచ్చి పడుతున్నాయి. బడిలో ఫస్ట్ ర్యాంకు రాకపోతే కన్నవారి ముఖాల్లో కారుచీకట్లు కాస్తో కూస్తో పోటీ పరీక్షల్లో వెనుకబడితే సమాజం చూపే నిరాదరణ రేపు ఉద్యోగంలో ప్రమోషన్ మిస్సయితే స్నేహితుల గుంపులో పలచబోయే పరువు! ఇదంతా చూస్తుంటే గుండెల్లో ఒక పదునైన ప్రశ్న తళుక్కున మెరుస్తుంది అస్సలు గెలవడమే జీవిత పరమార్థమైతే, మరి నేర్చుకోవడం అనే ప్రక్రియ ఎక్కడ దాక్కుంది?

ఈ ప్రశ్న కేవలం కాగితాలకే పరిమితమైన తత్వశాస్త్రం కాదు. ఇది నేటి ఆధునిక సమాజంలో ప్రతి తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ, యువతీయువకులూ తమ గుండెలపై చేయి వేసుకుని అడుక్కోవాల్సిన నగ్నసత్యం.

ఒకప్పుడు మన తెలుగు సంస్కృతిలో పడిలేచిన వాడే బలశాలి అనే ఒక అందమైన నమ్మకం ఉండేది. జ్ఞానాన్ని శ్వాసించడమే చదువుకు అసలైన హృదయస్పందన అనుకునేవారు. గురువు కేవలం అక్షరాలు దిద్దించేవాడు కాదు, జీవితపు ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పే లైఫ్ కోచ్‌గా నిలిచేవాడు. ఓటమిని హుందాగా స్వీకరించడం, ఆ అనుభవాల నుంచే కొత్త పాఠాలు వెతుక్కోవడం ఇదే కదా అసలైన చదువు అంటే!కానీ ఈ కార్పొరేట్ యుగంలో ఆ విలువలన్నీ కరిగిపోయాయి. సమాజంలో నెంబర్ వన్ అనే ఒక్క సీటుకు మాత్రమే విలువుందనే ఒక ప్రమాదకరమైన వైరస్ పాకిపోయింది. ఫలితంగా, మన పిల్లలు ఈనాడు జ్ఞానం కోసం బడికి వెళ్లడం లేదు, ఏదో ఒక పతకాన్ని వేటాడటానికి రేసు గుర్రాల్లా పరుగెడుతున్నారు. మార్కులే మనుషుల కొలమానాలు అయిపోయాయి, ర్యాంకులే వాళ్ల గుర్తింపు పత్రాలుగా మారాయి. ఈ పరుగుల పందెంలో అసలైన విజ్ఞానం ఎక్కడో వెనుక బెంచీకే పరిమితమైపోయింది.

చరిత్ర పుటలను ఒక్కసారి తిరగేస్తే, ప్రపంచాన్ని మార్చేసిన మహానుభావులంతా ఒకప్పుడు ఘోరంగా విఫలమైనవారే. వేల సార్లు అపజయాల చీకట్లను చూసిన థామస్ ఎడిసన్ అధైర్యపడలేదు కాబట్టే, నేడు ప్రపంచం బల్బు వెలుతురులో మెరుస్తోంది. కోర్టులో కనీసం వాదించలేక అవమానంతో తలదించుకున్న మహాత్మా గాంధీ, తర్వాతి కాలంలో యావత్ జాతికే దిక్సూచిగా నిలిచారు. నిరంతర అణచివేతలను, అవమానాలను భరించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ శతాబ్దాల చీకట్లను చీల్చుతూ రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారు.వీరందరికీ తెలిసిన ఏకైక రహస్యం అపజయం అంటే ప్రయాణం ముగిసిపోవడం కాదు, అదొక కొత్త పాఠం! తప్పు చేయడం బలహీనత కాదు, కానీ ఆ తప్పు నుండి ఏమీ నేర్చుకోకుండా కూర్చోవడమే అసలైన చేతగానితనం.మరి మనం మన పిల్లలకు ఈ జీవిత సత్యాన్ని అందిస్తున్నామా? లేదే! ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయొద్దు అని శాసిస్తున్నాం. ఓడిపోతే నీ బతుకు శూన్యం అని బెదిరిస్తున్నాం. అందరికంటే ముందే ఉండాలి అని గొంతుపై కత్తి పెడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తూ, ఒకవేళ ఓడిపోతే తిరిగి ఎలా నిలబడాలో మాత్రం నేర్పడం లేదు. కింద పడినప్పుడు స్పింగ్‌లా పైకి లేచే మానసిక స్థైర్యమే కదా అసలైన విద్య!

మన విద్యావ్యవస్థ నేడు మార్కుల మాయాజాలంలో చిక్కుకుపోయింది. మార్కులు లేకపోతే టాప్ కాలేజీలో సీటుండదు, సీటు లేకపోతే బహుళజాతి సంస్థలో ఉద్యోగం రాదు, ఉద్యోగం లేకపోతే సమాజంలో గౌరవం దక్కదు. ఇదొక ఊపిరి సలపని గొలుసుకట్టు విషవలయం. ఈ వలయంలో పడి లేత ప్రాయంలోనే పిల్లల కలలు నలిగిపోతున్నాయి.పదేళ్లు చదివిన ఏ విద్యార్థినైనా సరదాగా అడిగి చూడండి.నీకు నచ్చిన సబ్జెక్ట్ ఏది? నువ్వు ఎందుకు చదువుతున్నావు? అని. మెజారిటీ పిల్లల నుండి శూన్యమైన చూపులే సమాధానంగా వస్తాయి. ఎందుకంటే వారికి ఆలోచించే స్వేచ్ఛను మనం ఇవ్వలేదు. వారిని కేవలం ర్యాంకులు ఉమ్మేసే మార్కుల యంత్రాలు గా మార్చేశాం. నిజమైన విద్య అంటే కేవలం సమాధానాలు బట్టీ పట్టించడం కాదు, ప్రశ్నించే ధైర్యాన్ని ఇవ్వడం, విఫలమైనా సరే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగే మనోబలాన్ని నింపడం!ఒక చిన్నారి పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటోంది? ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చుతూ సూటిపోటి మాటల దాడి, కోపంతో కూడిన మందలింపులు, నీవల్ల ఏమీ కాదు అనే నిరాశాజనకమైన తీర్పులు!ఈ కఠినమైన మాటలు ఆ చిన్నారి సున్నితమైన మనసుపై ఎంతటి లోతైన గాయాలు చేస్తాయో తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. ఆ క్లిష్ట క్షణంలో ఆ బిడ్డకు కావలసింది అరుపులు, కేకలు కాదు ,తనను అర్థం చేసుకునే ఒక ఆత్మీయమైన కౌగిలింత, మళ్లీ ప్రయత్నించేలా చేసే కొండంత భరోసా. మార్కులు తక్కువొస్తే పోయిందిలే నాన్నా ,ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకుని, వచ్చేసారి దుమ్ములేపుదాం అని వెన్నుతట్టే తల్లిదండ్రులే నిజమైన గురువులు. ఆ ఒక్క మాట పిల్లవాడి జీవిత కాలానికి ఒక రక్షణ కవచంలా మారుతుంది.జీవితంలో గెలవడం సంతోషాన్ని ఇస్తుంది, కానీ నిరంతరం నేర్చుకోవడం మాత్రమే జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. గెలుపు అనేది ఒక తాత్కాలిక మైలురాయి మాత్రమే, కానీ నేర్చుకోవడం అనేది మరణించే వరకు సాగే ఒక అద్భుతమైన నిరంతర ప్రయాణం.పిల్లవాడికి కేవలం గెలవడం మాత్రమే నేర్పిస్తే, జీవితంలో ఎప్పుడైనా మొదటిసారి ఓటమి ఎదురైనప్పుడు వాడు కోలుకోలేనంతగా కుప్పకూలిపోతాడు. అదే నేర్చుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చితే, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే, ప్రతి పతనంలోనూ ఒక సరికొత్త పాఠాన్ని వెతుక్కుంటూ మరింత పట్టుదలగా పైకి లేస్తాడు.జీవితం అనేది పక్కవాడిని తోసేసి ముందే వెళ్లే పరుగు పందెం కాదు, అదొక సుదీర్ఘమైన ప్రయాణం. అందుకని నేటి తరానికి గెలుపు గుర్రాలు కావడం కంటే ముందు, అపజయాలను చిరునవ్వుతో స్వీకరించే సంస్కారాన్ని అలవాటు చేద్దాం. వారికి ప్రశ్నించే స్వేచ్ఛను, తప్పులు చేసి తెలుసుకునే హక్కును ఇద్దాం. అప్పుడు వారు కేవలం తరగతి గది పరీక్షల్లోనే కాదు . జీవితం అనే మహా సంగ్రామంలో ఎప్పటికీ ఓడిపోని విజేతలుగా నిలుస్తారు!

డా .సూర్యదేవర రామకృష్ణ ,

9490754169