Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 1:31 pm Editor : Admin

మూసి పునర్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 29

మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది

అభివృద్ధి–మానవీయత రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం

భూ సేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి సమీక్ష

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి అన్నారు. మూసి నది పునరుజ్జీవంతో నగరానికి కొత్త జీవం పోసేలా, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందన్నారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాసం తదితర అంశాలపై డాక్టర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రిగారు సోమవారం ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసి నదిని పునరుజ్జీవింపజేసి, దాన్ని పర్యాటకం, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దూరదృష్టి అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన జీవన వాతావరణాన్ని అందించే సంకల్పమని వివరించారు.

మూసి నది కాలుష్యంతో ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వరదల సమయంలో పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుందని తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు, వినోద కేంద్రాలు ఏర్పాటు ద్వారా మూసి పరివాహక ప్రాంతాలను సరికొత్త జీవన కేంద్రాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేసినట్టుగా మూసి ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భూ సేకరణ ప్రక్రియలో ప్రజా కోణంలో ఆలోచించి మాన‌వీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని అధికారులకు సూచించారు. ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాల‌ని ఇందుకు అవ‌స‌ర‌మైన క కార్యాచరణ రూపొందించి త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని ఆదేశించారు.

భూములు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడబోదని మంత్రిగారు స్పష్టం చేశారు.