Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 2:14 pm Editor : Admin

పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వము బ్రతికి బట్ట కట్టలేదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

  • నేటి సత్యం హైదరాబాద్ జూలై

పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదు

రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల తొలగింపులపై కమ్యూనిస్టుల ఆగ్రహం

*ప్రతి గుడిసెకూ పట్టా, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్*

*ల్యాండ్ మాఫియా భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి*

*“ప్రతి గుడిసెకు పట్టా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలి” నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వామపక్షాల మహాధర్నా*

*ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారో ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలి*

*ఎర్రజెండలన్నీ ఒక్క జెండాగా మారి పేదల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం*

*హైడ్రా’ పేరుతో పేదలను ఇబ్బందులకు గురి చేయవద్దు*

*పేదల జోలికొస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదు: కూనంనేని సాంబశివరావు*

‘పేదవాడి శ్రమ, చెమట బొట్ల నుంచే సంపద సృష్టించబడుతోంది. అలాంటి పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదు‘ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదని, కేవలం రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. పోలీసు యంత్రాంగం, బుల్డోజర్లు చేతిలో ఉన్నాయని పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెలుగుమట్ల, హనుమకొండలోని గుండ్ల సింగారం, గోపాలపురం, మహబూబాబాద్, యాదాద్రి జిల్లా కొలనుపాక, చేవెళ్ల, అబ్దుల్లాపూర్ అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లో వరుసగా జరిగిన కూల్చివేతలను తీవ్రంగా ఖండించారు. ‘భూదాన్ భూములు, ప్రభుత్వ భూములను ల్యాండ్ మాఫియా దొంగల్లా దోచుకుంటుంటే ప్రభుత్వం ఛోద్యం చూస్తోందని, మరో వైపు నోరు లేని మూగజీవాల్లాంటి పేదలు తలదాచుకోవడానికి గుడిసె వేసుకుంటే మాత్రం కూల్చేస్తున్నారు. ప్రభుత్వానికి అంతగా సమర్థత ఉంటే, ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఎన్ని వేల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారో ‘శ్వేతపత్రం’ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘హైడ్రా’ పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయడం కాదు. చేతనైతే పెద్ద పెద్ద కబ్జాకోరులను, 10 మంది పెద్ద చేపలను పట్టి జైల్లో పెట్టండి, మేం స్వాగతిస్తూ మీకు దండలు వేస్తాం’ అని సాంబశివరావు అన్నారు. వరంగల్ గుండ్ల సింగారంలో స్థానిక ఎంఎల్ ఏ ఇష్టం లేకపోయినా కలెక్టర్లు స్వయంగా వెళ్లి కూల్చివేతలు జరపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాప్రతినిధుల మాట వినని అధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ‘కమ్యూనిస్టులుగా మీరు పోరాటం చేయండి, ఆ డిమాండ్లను మేము అమలు చేస్తాం’ అని ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సాంబశివరావు కోరారు. సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ(ఎంఎల్), మావోయిస్టులు, అడవిలో ఉన్నా, నగరాల్లో ఉన్నా ఎర్రజెండాలన్నీ ఒకటేనని, అందరికీ తల్లి పార్టీ కమ్యూనిస్టు పార్టీయేనన్నారు. ఆ ఎర్రజెండలన్నీ ఒక్క జెండాగా మారి పేదల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘అధికారులు ఎవరైనా ఇళ్లు కూల్చడానికి వస్తే భయపడకుండా ఎదురుతిరగండి. అవసరమైతే లాఠీలను, తుపాకులను మీ గుండెలతో అడ్డుకోండి. కమ్యూనిస్టు నాయకత్వం మీతో పాటే నిలబడుతుంది. లాఠీలు, బుల్లెట్లకు భయపడకుండా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ భూపోరాటం కొనసాగుతుంది’ అని సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలు, ఇళ్లు వేసుకున్న వారందరికీ తక్షణమే పట్టాలు ఇవ్వాలని, ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు లేదా సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలని, రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పెండింగ్ లేకుండా పట్టాలు పంపిణీ చేయాలని, ఈ మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెడుతున్నామన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా తక్షణమే కమ్యూనిస్టు పార్టీలను చర్చలకు పిలవాలని ఆయన కోరారు. స్రభుత్వం స్పండించనట్లయితే డిమాండ్ల సాధన కోసం తమ ఉద్యమ కార్యాచరణ తమకు ఉంటుందని సాంబశివరావు స్పష్టంచేశారు.

:రాష్ట్రంలో నిరుపేదల ఇళ్లు, గుడిసెల కూల్చివేతలపై కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ స్థలం ఏదైనా కానీ వాటిలో నిరుపేదలు వేసుకున్న “ప్రతి గుడిసెకు పట్టా, అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలి” అని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో వేలాది మంది నిరుపేదలు హైదరాబాద్ కదం తొక్కారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.

కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఇవ్వగా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి.అబ్బాస్, వామపక్షాల నాయకులు వనం సుధాకర్ (ఎంసిపిఐ), కె.గోవర్థన్ (సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ), సదానంద్ (సిపిఐ ఎంఎల్ మాస్ లైన్), భరత్ (ఎస్ యు సి ఐ) అధ్యక్షవర్గంగా వ్యవహారించారు.

ధర్నాను ఉద్దేశించి సిపిఐ, సిపిఐ(ఎం), సిపిఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్, ఎంసిపిఐ , ఎంసిపిఐ(యు), ఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు.

*కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : జాన్ వెస్లీ*

సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్లులేని పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సొంత ఇళ్లు లేవని, హైదరాబాద్ 60 శాతం మంది అద్దె ఇళ్లలోనే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుడిసెల కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని, పేదలను రోడ్డున పడేయవద్దన్నారు. గుడిసెల కూల్చివేతలు కొనసాగితే బుల్డోజర్లకు ఎదురొడ్డి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పేదల ఇళ్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. పేదలు, శ్రామికవర్గం ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

*బుల్డోజర్ పాలన కొనసాగిస్తే ఇక ఊరుకోమ్ ః పశ్యపద్మ*

ఎన్నికల సమయంలో ఇందిరమ్మ ఇళ్లు, ఆరు గ్యారెంటీలు అంటూ గొప్పగా హామీలు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అదే పేదల గుడిసెలను బుల్డోజర్లతో నేలమట్టం చేయడం దారుణమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదని, బుల్డోజర్ రాజ్యం అని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుని కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంలేదని విమర్శించారు. పేదల ఆర్తనాదాలు వినపడకపోతే పాలకులు కళ్లు మూసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఒక్క పేదవాడి దరఖాస్తును ఆమోదించకపోయినా కోర్టును అశ్రయిస్తామని, అవసరమైతే రోడ్లపై తేల్చుకుంటామని హెచ్చరించారు. ప్రజలను సమీకరించి చలో ముఖ్యమంత్రి ఇంటికి వంటి పెద్ద ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

*పేదలు గూడు కోసం ఉద్యమించేది కమ్యూనిస్టులే*

*సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు*

తొలుత ధర్నాలు ప్రారంభించి స్వాగత ఉపన్యాసం చేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పేదలకు భూములు, గృహ వసతి కోసం కమ్యూనిస్టులే నిరంతరం పోరాడుతున్నారని గుర్తుచేశారు.నిరుపేదలు నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతలను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని అన్నారు.ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూపోరాటాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.

*గచ్చిబౌలిలో పెద్దల అక్రమాలు కనిపించవా ః ఈటి నరసింహా*

సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం, వారిని రోడ్డు మీదకు నెట్టేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు. ఒక వైపు సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గొప్పగా చెబుతుంటే, మరోవైపు అనేక ఏళ్లుగా గుడిసెల్లో జీవిస్తున్న పేదల ఇళ్లు కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎఫ్ బఫర్ జోన్, ప్రభుత్వ భూములు అనే సాకులు చూపుతూ పేదలపై మాత్రమే దాడులు చేయడం అన్యాయమన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లు గచ్చిబౌలిలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నా ప్రభుత్వం వారి వద్దకు వెళ్లడంలేదు కానీ పేదవాడు వేసుకున్న చిన్న గుడిసెనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది పేదల జీవితాలతో ఆడుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*ఇందిరమ్మరాజ్యంలోను పేదలకు అన్యాయమేనా ః నెల్లికంటి సత్యం*

ఎన్నో ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా, వారి నివాసాలను కూల్చివేయడం అన్యాయమని సిపిఐ ఎం ఎల్ సి నెల్లికంటి సత్యం అన్నారు. గత ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ‘ఇందిరమ్మ రాజ్యం’, ‘ప్రజా ప్రభుత్వం‘ పేరుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. రెండున్నరేళ్లుగా వామపక్ష పార్టీలు శాసనసభలోనూ, ప్రజా ఉద్యమాల ద్వారానూ ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. భూదాన్ భూములు, కోర్టు కేసులు వంటి కారణాలు చూపుతూ కాలయాపన చేస్తూనే, మరోవైపు గుడిసెల కూల్చివేతలు చేపడుతోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏళ్లు గడిచినా పేదలకు కనీసం నివాస స్థలం కల్పించలేకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమని అన్నారు. ఒకవైపు పాలకులకు వందల ఎకరాల ఫామ్ ఉండగా, పేదలు 60 లేదా 120 గజాల స్థలం కోరితే కూడా ఇవ్వకుండా వారి గుడిసెలను కూల్చివేయడం అమానుషమని విమర్శించారు. ప్రభుత్వం ఈ చర్యలను ఇలాగే కొనసాగిస్తే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదల హక్కులు సాధించే వరకు వామపక్ష పార్టీలు అండగా నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.

*పేదల ఇళ్లను కూల్చేస్తే… రోడ్డెక్కి తేల్చుకుంటాం: మేయర్ మూడ్ గణేష్ ఆగ్రహం*

పేదోడు గుడిసె వేసుకుంటేనే ప్రభుత్వం కన్నెర్ర చేస్తోందని, ఇదేనా ప్రజాపాలన? అని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ప్రశ్నించారు. ఇల్లు లేని వాడిని రోడ్డు మీదకి నెట్టే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. మొన్న అశ్వారావుపేట, కొత్తగూడెం ప్రాంతాల్లో 350 ఇళ్లను కూల్చి స్మశానంలా మార్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కూల్చివేతలను తాను స్వయంగా చూసానన్నారు. ప్రభుత్వం పేదవాడి కష్టాన్ని పట్టించుకోకుండా కేవలం గోడలు కూల్చే పనిలో ఉందని విమర్శించారు. పేదల ఇళ్లను కూల్చే పాలన మాకు వద్దు అని ఆయన హెచ్చరించారు.

*పాలకులు సిగ్గుతో తల దించుకోవాలి : సాధినేని వెంకటేశ్వర్లు*

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా నేటికి 80 కోట్ల మంది రేషన్ కార్డుల ద్వారా బియ్యం తీసుకుంటున్నారంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరు అన్నారు. పేదల గుడిసెలు, ఇంటి పట్టాల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం బుల్డోజర్ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు హన్మేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు లేవని, గత ప్రభుత్వాల హామీలు కూడా పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే రూ.5 లక్షల సహాయం సరిపోదని, కనీసం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు ఇవ్వాలన్నారు. ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా పేదలను బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మియాపూర్, వరంగల్, నర్సంపేట వంటి ప్రాంతాల్లో పేదల భూములు, గుడిసెలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు భారీ ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, పేదలకు మాత్రం న్యాయం చేయడంలేదని విమర్శించారు.

ఎస్ యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి మురహారి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా పేదల సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. పేదల హక్కుల కోసం ప్రారంభమైన ఈ పోరాటం చివరికి కార్మిక వర్గ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా కొనసాగించాలన్నారు.

సిపి(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి మాట్లాడుతూ ఇల్లు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, సిఎం రేవంత్ మహిళలకు చీర సారేలు ఇచ్చినట్లుగా ఇళ్ల స్థలాలు ఇళ్లు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ హామీని పూర్తిగా అమలు చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్యను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. పిఓడబ్లూ జాతీయ నాయకురాలు వి.సంధ్య మాట్లాడుతూ లక్షలాది మంది పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్లు ఉపయోగించకుండా పాడైపోయాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు తీసుకున్నా ఇళ్లు ఇవ్వడం లేదని, ఇల్లు ప్రజల ప్రాథమిక హక్కు అని ఆమె పేర్కొన్నారు.