Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 6:31 am Editor : Admin

రాజధానిలో సిఆర్ సేవలు..!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జులై 17

రాజధానిలో కూడా సీఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన వృద్ధాశ్రమం దేశంలోనే ఆదర్శప్రాయమైన వృద్ధుల సేవా కేంద్రంగా నిలిచింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, మానవీయ విలువలతో నిర్వహించబడుతున్న ఈ వృద్ధాశ్రమం అనేకమందికి ఆశ్రయం, ఆదరణ కల్పిస్తోంది.

సీపీఐ మహానేత చండ్ర రాజేశ్వరరావు గారి చివరి కోరికల్లో ఒకటి వయో వృద్ధులకు సేవ చేయడం. ఆ సంకల్పానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి డా. కోట్ల విజయభాస్కర రెడ్డి గారు సూత్రప్రాయ అంగీకారం తెలపగా, అనంతరం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి చొరవతో ముందడుగు పడింది. చివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సాంకేతిక సమస్యలను పరిష్కరించి భవన నిర్మాణం పూర్తయ్యేలా సహకరించారు.

దీని ఫలితంగా నేడు సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం దేశవ్యాప్తంగా ఆదర్శ వృద్ధాశ్రమంగా గుర్తింపు పొందింది.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో సీఆర్ ఫౌండేషన్ సేవా సంస్థ లేకపోవడం ఒక వెలితిగా భావించాము. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాజధాని ప్రాంతంలో ఫౌండేషన్‌కు భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశాము.

ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి, సంబంధిత మంత్రి నారాయణ గారిని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ త్వరలో సాకారమై, రాజధాని ప్రాంతంలో కూడా చండ్ర రాజేశ్వరరావు గారి ఆశయాలకు అనుగుణంగా వృద్ధుల సేవా కార్యక్రమాలు విస్తరించనున్నాయని ఆశిస్తున్నాము.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి సీఆర్ ఫౌండేషన్ కార్యకలాపాలు, వృద్ధాశ్రమాల విస్తరణ ప్రణాళికలు, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వృద్ధాశ్రమాల స్థాపనపై వివరాలు అందజేశాము.

– డా. కె. నారాయణ

గౌరవ అధ్యక్షులు, చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ (CR Foundation)

కొండాపూర్, హైదరాబాద్