Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 2:56 pm Editor : Admin

850 కేజీల నెయ్యి సీజ్…!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జులై 17

850 కిలోల నెయ్యి సీజ్

రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్

కమిషనర్ సంగీత సత్యనారాయణ వెల్లడి

రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఉక్కుపాదం మోపింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర పదార్థాలు, కొవ్వులు కలుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జూలై 14, 15 తేదీల్లో పోలీసుల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యానారాయణ తెలిపారు.

కొన్ని లైసెన్స్ పొందిన సంస్థలు తయారు చేసిన నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారించగా, మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నెయ్యి తయారీ, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గుర్తించారు. సంబంధిత సంస్థల నుంచి నెయ్యి నమూనాలు సేకరించి టెస్టింగ్‌ కోసం పంపించామని, పరీక్షల ఫలితాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్స్ ప్రకారం నెయ్యిలో 99.5 శాతం పాల కొవ్వు ఉండాలి. తేమ శాతం 0.5 శాతానికి మించకూడదు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులను కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం నిషేధం అని ఆమె వివరించారు.

850 కిలోల స్వాధీనం

హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 14 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. 15 నెయ్యి సాంపిల్స్‌ను సేకరించారు. వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను ప్రయోగశాల నివేదికలు వచ్చే వరకు భద్రపరిచి, నివేదికల్లో కల్తీ నిర్ధారణైతే సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యానారాయణ స్పష్టం చేశారు.

వివిధ జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 65 సంస్థలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను పరిశీలించారు. మొత్తం 91 నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి

వినియోగదారులు లైసెన్స్ ఉన్న, విశ్వసనీయ సంస్థల నుంచే నెయ్యి కొనుగోలు చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ సూచించారు. కొనుగోలు చేసే ముందు FSSAI లైసెన్స్ నంబర్, మాన్యుఫాక్చరింగ్ లేబుల్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని పేర్కొన్నారు. కొనుగోలు బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని, కల్తీ ఆహార పదార్థాలు లేదా లైసెన్స్ లేకుండా విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.