(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి జూలై 22
మూడు అంతస్తులకు మాత్రమే అనుమతి.. ఏడు అంతస్తుల నిర్మాణం
బిల్డర్ మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
మాదాపూర్ లోని ఖానామెట్ గ్రామం సర్వే నంబర్లు 41/12, 41/13లోని అసైన్డ్ భూములలో అక్రమంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ నంబర్లు 46, 47లో బిల్డర్ మధుసూదన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల నుంచి మూడు అంతస్తుల (జి+3) నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఏడు అంతస్తుల (జి+7) వరకు నిర్మాణం చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములలో ఇలాంటి భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు పేర్కొంటున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తూ అదనపు అంతస్తులు నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి, అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన అంతస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే అసైన్డ్ భూములలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల పాత్రపై కూడా విచారణ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.