(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం న్యూఢిల్లీ జులై 30
ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్ భరో’ ఉద్యమం
భూపంపిణి, ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రత్యక్ష ఆక్రమణలు
ఉపాధి హామీ రక్షణకై దేశ వ్యాప్తంగా ఆందోళనలు
2027 ఫిబ్రవరి 7–10 తేదీల్లో బెంగళూరులో AIAWU 11వ అఖిల భారత మహాసభ
పిడిఎస్ కోటా పెంచాలి – గోడౌన్లకు మార్చ్‌లు
*క్యూబా కు బి వెంకట్, చంద్రన్*
*గ్రామాల నుంచి దేశవ్యాప్తంగా మిలిటెంట్ ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తాం*
*aiawu జాతీయ కౌన్సిల్ సమావేశాల పిలుపు*
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) అధ్యక్షులు కామ్రేడ్ ఎ. విజయరాఘవన్, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. వెంకట్ మాట్లాడుతూ, అల్లపుజ్జ లో ఈ నెల 24,25,26 తేదీల్లో జరిగిన అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశం దేశంలోని వ్యవసాయ, గ్రామీణ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని సమీక్షించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విస్తృత ఉద్యమాలను నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు.
ఉపాధి హక్కు, ఆహార హక్కు, భూమి హక్కు, గృహ హక్కు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం గ్రామాల నుంచి జాతీయ స్థాయి వరకు నిరంతర ప్రజా పోరాటాలను నిర్మించడమే జనరల్ కౌన్సిల్ ప్రధాన పిలుపని వారు స్పష్టం చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి తీసుకొచ్చిన VB-GRAMG చట్టం గ్రామీణ పేదల పని హక్కును కాలరాసిందని వారు తీవ్రంగా విమర్శించారు. పని హక్కును ప్రభుత్వ బాధ్యత నుంచి తప్పించి, కోటాలు, నిబంధనలు, ఆర్థిక భారాలతో రాష్ట్రాలపై మోపి, కోట్లాది గ్రామీణ పేదలను నిరుద్యోగంలోకి నెట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసి, ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల ఉపాధికి చట్టబద్ధ హామీ, జీవనానికి సరిపడే వేతనం, సమయానికి కూలి చెల్లింపు, పని అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించే వ్యవస్థ పునరుద్ధరించే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ప్రకటించారు.
ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికంగా అమలు చేసి, ప్రతి కుటుంబానికి తగిన పరిమాణంలో బియ్యం, గోధుమలు, పప్పులు, వంటనూనె, చక్కెర, ఉప్పు తదితర నిత్యావసర వస్తువులను అందించాలని కోరారు. పేదల కడుపు ఖాళీగా ఉండగా ప్రభుత్వ గోడౌన్లలో ధాన్యం నిల్వ ఉంచడాన్ని సహించబోమని హెచ్చరిస్తూ, పిడిఎస్ కోటాను పెంచకపోతే దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ, రాష్ట్ర గోడౌన్లకు భారీ మార్చ్‌లు నిర్వహించి ప్రజల హక్కుగా ఆహార ధాన్యాలను ప్రజలకు పంపిణీ చేసే ఉద్యమాలను చేపడతామని ప్రకటించారు.
భూమిలేని పేదలకు వెంటనే భూములు పంపిణీ చేయాలని, మిగులు, ప్రభుత్వ, బంజరు, అక్రమంగా ఆక్రమించబడిన భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ సంస్కరణలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైతే “దున్నేవాడికే భూమి” నినాదంతో రాష్ట్రాల వారీగా ప్రత్యేక భూ ఉద్యమాలను నిర్మించి, అవసరమైతే భూ ఆక్రమణ ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. గృహహీనులకు గృహస్థలాలు, గృహ నిర్మాణానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కూడా డిమాండ్ చేశారు.
దళితులు, ఆదివాసీలు, మహిళలపై పెరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు గ్రామీణ భారతదేశంలో విస్తృత ఉద్యమాలను చేపడతామని తెలిపారు. అడవులు, భూములు, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే విధానాలను ప్రతిఘటిస్తామని ప్రకటించారు. మహిళల రిజర్వేషన్ అమలును డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టకుండా, పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హిందుత్వ శక్తులు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలపై చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రచారాన్ని నిర్వహించాలని, సామాజిక న్యాయం కోసం ప్రజలను సమీకరించాలని జనరల్ కౌన్సిల్ నిర్ణయించిందన్నారు.
రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామంలో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, గ్రామ సభలు, ధర్నాలు, ముట్టడులు, గోడౌన్లకు మార్చ్‌లు, భూ ఆక్రమణ ఉద్యమాలు, జైల్ భరోలు, అవసరమైన చోట మిలిటెంట్ ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ గ్రామీణ పేదల సమస్యలను దేశవ్యాప్త ఉద్యమాలుగా మలుస్తామని తెలిపారు.
స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆగస్టు 10న CITU, AIKS, AIAWU సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే “జైల్ భరో” ఉద్యమాన్ని చారిత్రాత్మక విజయంగా మలచాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 11వ అఖిల భారత మహాసభను 2027 ఫిబ్రవరి 7 నుండి 10 వరకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో నిర్వహించాలని జనరల్ కౌన్సిల్ నిర్ణయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణ కార్మికుల ఉద్యమాలకు నూతన దిశానిర్దేశం చేసే మహత్తర రాజకీయ, సంఘటనా వేదికగా ఈ మహాసభ నిలుస్తుందని పేర్కొన్నారు.
అమెరికా సామ్రాజ్యవాద దిగ్బంధనాన్ని ధిక్కరిస్తూ పోరాడుతున్న క్యూబా ప్రజలతో సంఘీభావాన్ని మరింత బలోపేతం చేయాలని జనరల్ కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. ఫిడెల్ కాస్ట్రో శతజయంతి సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. వెంకట్, కేరళ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్. చంద్రన్తో కూడిన ప్రతినిధి బృందం క్యూబాను సందర్శిస్తుందని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో ఇంకా అఖిల భారత వ్యవసాయ అఖిల భారత నాయకురాలు mla os అంబిక, రాజేంద్రన్, శశాంకన్ పాల్గొన్నారు
బాబు ఆఫీస్ కర్త దర్శి ఢిల్లీ.