(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కామారెడ్డి జూలై 30
సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు
కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపాం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి
*అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మద్యం, గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సలబత్‌పూర్ చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి గత రెండు దశాబ్దాలుగా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.*
*చెక్‌పోస్ట్‌లో ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ వాహనాల తనిఖీలు చేపడుతున్నారని పేర్కొన్నారు.*
*నిన్న సాయంత్రం రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్కులో ప్రయాణిస్తున్న యూట్యూబర్ చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడిన సందర్భంగా వివాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.*
*ప్రాథమిక విచారణలో ఘటనకు సంబంధించి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని గుర్తించినట్లు తెలిపారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (నోడల్ అధికారి)కి సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.*
*సదరు కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి తెలిపారు.*
*ఈ ఘటనపై శాఖ ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించదని, విధి నిర్వహణలో నిబంధనలు, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యులపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.*