(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం హైదరాబాద్ జూలై 30
వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీలు, బస్తీలు, చెరువుల పరిసర ప్రాంతాలు, వాగులు, నాలాల సమీపంలో నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా కుటుంబ సభ్యులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, అవసరమైన చోట సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు సురక్షిత పునరావాస కేంద్రాలు, తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందించాలని కోరారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని టి. రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.