(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆగస్టు 4
రక్తం రంగు ఒక్కటే..
*మరి హృదయాల మధ్య ఈ గోడలెందుకు?*
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి ఒకే తల్లి కడుపు నుండి వచ్చినట్టు కాదు కానీ మనమందరం ఒకే శ్వాసను పీల్చుకుంటున్నాం. ఒకే సూర్యుడి వెలుతురులో నడుస్తున్నాం. ఒకే ఆకాశం కింద నిద్రపోతున్నాం. అయినా *ఈ మనిషి మనిషిని ఎందుకు ద్వేషిస్తున్నాడు? మతానికి మతం కత్తులు నూరుతున్నది. కులానికి కులం నెత్తురు చిందిస్తున్నది. దేశానికి దేశం అణుబాంబు చేతిలో పట్టుకుని చిరునవ్వు నవ్వుతున్నది. ఇదేమి వింతైన నాగరికత? ఇదేమి మహా సంస్కృతి?* మన పూర్వులు చెప్పారు వసుధైవ కుటుంబకం అని. ఈ జగత్తు అంతా ఒక్క కుటుంబమే అని దాని అర్థం. ఆ మాటలు రాతిపై చెక్కారు, నోటితో చదివారు, పుస్తకాల్లో ముద్రించారు. కానీ చేతులతో మాత్రం ఎప్పుడూ ఆచరించలేదు. ఆ మాటలు నినాదంగా మిగిలాయి నిజంగా మారలేదు. ఒక్కసారి ఆలోచించండి. *ఒక ఇంట్లో అన్నదమ్ములు ఒకరినొకరు చంపు కుంటే ఆ ఇంటిని మనం ఏమంటాం? నరకం అంటాం కదా! అదే మాట ఈ భూమికి అన్వయించండి.* జవాబు: మీ గుండెనే కదిలిస్తుంది. ద్వేషానికి ఏ మతమూ అనుమతి ఇవ్వలేదు కానీ ద్వేషాన్ని అమ్మడానికి మతం పేరు వాడుకున్నారు. ఇది అపరాధం కాదు ఇది చరిత్ర చేసిన అతి పెద్ద మోసం!
ఒక పసిపాప పుట్టినప్పుడు అది ఏ కులంలో పుట్టిందో తనకు తెలియదు. ఏ మతంలో జన్మించిందో అది అడగదు. ఆ పాప చేతి నిండా ప్రేమ ఉంటుంది ద్వేషం ఉండదు. కానీ ఆ పాప పెరిగే కొద్దీ సమాజం దానికి ద్వేషం అనే విషాన్ని పట్టుపట్టి తాగిస్తుంది. ఆ కులం వాళ్ళు మనకు శత్రువులు అని చెప్తుంది. ఆ మతం వాళ్ళు మన విరోధులు అని నేర్పుతుంది. ఆ దేశం వాళ్ళు మన పగవాళ్ళు అని రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఈ విషం ఒక తరం నుండి మరో తరానికి వారసత్వంగా అందుతోంది. ఇది పాపం కాదా? ఇది నేరం కాదా? మనిషి ఎంత తెలివైనవాడైనా ఈ మూఢత్వం విషయంలో మాత్రం ముమ్మాటికీ మూర్ఖుడిగానే మిగిలాడు. *చంద్రుడి పైకి రాకెట్లు పంపగలిగాడు. సాగరగర్భాన్ని వెలికితీయగలిగాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అద్భుతాన్ని సృష్టించగలిగాడు. కానీ పక్కింటి వాడిని ప్రేమించడం మాత్రం ఇంకా నేర్చుకోలేదు.*
ఇది మనిషి గొప్పతనమా? ఇది మనిషి చేసిన చారిత్రక విఫలతా?
ప్రతి ద్వేషానికి వెనుక ఒక వ్యాపారి ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఒక మతోన్మాది ఉంటాడు. వాళ్ళకు ద్వేషం అమ్మడం వ్యాపారం. మీ మధ్య చిచ్చు పెట్టడం వాళ్ళ పొట్ట బ్రతుకు, రెండు కులాల మధ్య అల్లర్లు జరిగినప్పుడు ఆ చితిలో కాలిపోయేది సాధారణ మనిషి, కానీ ఆ మంటకు నిప్పు పెట్టిన నాయకుడు ఏ సురక్షిత బంగలాలోనో కూర్చుని తన కుర్చీ పదిలంగా ఉందా అని లెక్కచేసుకుంటాడు. ఇది సత్యం. ఇది చేదు సత్యం. కానీ ఇది మీరు విన్నా, వినకున్నా మారదు. *మతం పేరు మీద రక్తం చిందించిన చరిత్ర చూస్తే ఏ దేవుడైనా ఆ రక్తాన్ని చూసి సంతోషించాడా? రాముడు అడవిలో సీతను వెతికినప్పుడు ఎవరినైనా జాతి అడిగాడా? అల్లాహ్ ఖురాన్లో ద్వేషాన్ని ఆదేశించాడా? క్రీస్తు సిలువపై మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు అనుయాయులు మాత్రం శత్రువులను తయారుచేస్తున్నారు.* ఈ వైరుధ్యానికి మనం ఎప్పుడు జవాబు చెప్పగలం?
ఈ విశ్వంలో మన భూమి ఒక చిన్న నీలి బిందువు మాత్రమే. కోట్ల గెలాక్సీలలో మన పాలపుంత ఒక మూల, ఆ పాలపుంతలో మన సూర్యుడు ఒక సాధారణ నక్షత్రం. ఆ సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి ఒక మహా సముద్రంలో ఒక ఇసుక రేణువు లాంటిది. ఆ ఇసుక రేణువు మీద అంత చిన్న జీవితాన్ని పొందిన మనిషి ఇంకా ద్వేషానికి, హింసకు, యుద్ధానికి సమయం వెచ్చిస్తున్నాడు! ఇది మూర్ఖత్వం కాకపోతే మరేమిటి? *ఒక్కసారి ఆకాశం వైపు తలెత్తి చూడండి. ఆ నక్షత్రాలకు మన కులం తెలుసా? ఆ చంద్రుడికి మన మతం తెలుసా? ఆ గాలికి మన జాతి తెలుసా? ప్రకృతి ముందు మనమందరం ఒక్కటే అయినా మనం ఒక్కటి గా జీవించలేకపోతున్నాం.* ఇది మానవ నాగరికత చేసుకున్న మహా పరాభవం. మనం సృష్టించుకున్న కృత్రిమ సరిహద్దులు మన హృదయాల మధ్య గోడలుగా మారకూడదు.
ద్వేషాన్ని వదిలేయడం బలహీనత కాదు అది అత్యున్నత శక్తి. గాంధీ బంతి తుపాకుల ముందు నిలబడినప్పుడు అది పిరికితనం కాదు అది మహాశక్తి, నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైలులో ఉన్నా ద్వేషం మోయలేదు అది నిస్సహాయత కాదు. అది నిజమైన నాయకత్వం. ద్వేషాన్ని నరాల్లో పెంచుకోవడానికి పిరికి మనసు చాలు ప్రేమను నిలబెట్టడానికి మాత్రం ఉక్కు గుండె కావాలి. మారాలంటే మొదట మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు ఎదుటివారిని ద్వేషిస్తున్నాను? ఎవరు నాకు ఈ ద్వేషం నేర్పారు? ఈ ద్వేషం వల్ల నాకు ఏమి లాభం వచ్చింది? ఈ మూడు ప్రశ్నలకు నిజాయితీగా జవాబు చెప్పగలిగితే మీలోని ద్వేషం సగం అక్కడికక్కడే కరిగిపోతుంది. ఈ సమాజాన్ని మార్చాలంటే ఒకేసారి వేలమందిని మార్చాలని లేదు. ఒక్కో మనిషిలో ఒక్కో మార్పు చాలు. *నువ్వు నీ పిల్లలకు ద్వేషం నేర్పకు అదే చాలు, ఒక తరం మారిపోతుంది. నువ్వు వేరే కులం, మతం వాడితో మనసు తెరచి మాట్లాడు అదే చాలు, ఒక గోడ కూలిపోతుంది. నువ్వు ఇతరుల బాధలో స్పందించు అదే చాలు, ఈ జగత్తు కొంచెం మెరుగు పడుతుంది. ఈ వ్యాసం చదివి మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఇది రాసిన ప్రయోజనం నెరవేరినట్లే. ఎందుకంటే మార్పు ఎప్పుడూ ఒక నిమిషపు మెలకు వతోనే మొదలవుతుంది. ఆ మెలకువ మన ఆలోచనలను, మన ప్రవర్తనను మారుస్తుంది.*
జగమంత కుటుంబం అని చెప్పుకుంటాం అది కేవలం అక్షరాల్లో కాదు, ఆచరణలో రుజువు చేయాలి. రాతిలో చెక్కిన మాటలు రాళ్ళుగానే మిగులు తాయి హృదయంలో చెక్కిన మాటలు మాత్రం చరిత్రగా మారుతాయి. ద్వేషం పాపం అది ఏ మతమైనా చెప్తుంది. ద్వేషం బలహీనత అది ఏ తత్వమైనా నేర్పుతుంది. ద్వేషం విష బీజం అది నాటినవాడికే ముందు హాని చేస్తుంది. కాబట్టి ఈ రోజే ఇప్పుడే ఆ విషపు గింజను మీ మనసు నుండి పెకలించి పారేయండి. దాని స్థానంలో ప్రేమ బీజం నాటండి. అది మీరు మాత్రమే కాదు మీ పిల్లలకు, వారి పిల్లలకు, ఈ జగత్తుకు గొప్ప వారసత్వం అవుతుంది. జగమంత కుటుంబం సాధ్యమే అది మీతో మొదలవుతుంది. ఇప్పుడే మొదలు పెట్టండి!
*✍️డా. సూర్యదేవర రామకృష్ణ*