ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు.. బలవన్మరణం.. బాధితులకు బాసట ఎవరు?
ఇంటిని సీజ్ చేయడంతో మనస్తాపానికి గురై విఠల్ బలవన్మరణం.. బాధిత కుటుంబం ఆవేదన
కామారెడ్డి అక్టోబర్ 6 నేటి సత్యం ప్రతినిధి నసురుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామంలో
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రుణ వసూళ్ల ఒత్తిడి సామాన్య కుటుంబాలను ఎంతగా వేధిస్తుందో బస్వాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన మరోసారి చర్చకు దారితీసింది. నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లి గ్రామానికి చెందిన పీట్లం విఠల్ రుణం విషయంలో ఎదురైన ఒత్తిడి, ఇంటిని సీజ్ చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రుణం చెల్లించలేదనే కారణంతో తమ ఇంటిని సీజ్ చేయడం, ఆ తర్వాత విఠల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు ఆయన ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
బాధితులకు అండగా ఉండాల్సింది ఎవరు?
ఇలాంటి ఘటనల్లో బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అసలు కారణాలను నిష్పక్షపాతంగా విచారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. అయితే తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు, “వేధింపుల వల్లే బలవన్మరణం చేసుకున్నాడని చెప్పడానికి సాక్ష్యం ఏముంది?” అంటూ ప్రశ్నిస్తూ తమపై ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులవుతున్న తమకు న్యాయం జరగడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమతో చర్చించి న్యాయం చేస్తామని చెప్తున్న ఫైనాన్స్ అధికారులు ఇంతవరకు రాలేదని వారు అంటున్నారు
బాధిత కుటుంబం చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? ఫైనాన్స్ సంస్థ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారా? ఇంటిని సీజ్ చేయడం చట్టబద్ధమైన ప్రక్రియలో భాగమేనా? విఠల్ మానసిక వేదనకు రుణ వసూళ్ల ఒత్తిడి కారణమైందా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
న్యాయం కోసం ఎదురుచూపులు
ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిన సమయంలో పరస్పరం నిందలు వేసుకోవడం కాకుండా, ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలి. ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలాలు, రుణ పత్రాలు, ఇంటి సీజ్‌కు సంబంధించిన రికార్డులు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవాలను తేల్చాలని బాధిత కుటుంబం కోరుతోంది.
బాధితుల ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా వెల్లడించాలి. కానీ ఒక కుటుంబం ప్రాణం కోల్పోయిన ఘటనపై నిజానిజాలు తేల్చకుండా బాధితులనే ప్రశ్నించడం మాత్రం మరిన్ని అనుమానాలకు తావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.