కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో 18 కిలోల గంజాయి పట్టివేత
రూ.9 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి, అక్టోబర్ 10 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ శాఖ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అశోక్ (26) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.9 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
దసరా పండుగ నేపథ్యంలో అక్రమ మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో కానిస్టేబుళ్లు అమృత్ రెడ్డి, శిరీష, రాజు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) సిబ్బంది సహకరించారు.
తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా కనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన అశోక్‌ను అధికారులు తనిఖీ చేయగా, అతని వద్ద 18 కిలోల ఎండు గంజాయి లభించింది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో ఒడిశాలోని టిట్లాగఢ్ ప్రాంతం నుంచి నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని సోలాపూర్‌కు తరలిస్తున్నట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అక్రమ మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వండి
దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోంది. అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి రవాణా, ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 2523 కు ఫోన్ చేయాలని ఎక్సైజ్ అధికారులు కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.