Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 2:03 pm Editor : Admin

ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి కలెక్టర్

నేటి సత్యం / కామారెడ్డి/ అక్టోబర్ 12

రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలి

నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,  ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాల తగ్గుదల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటూ, పంటల వైవిధ్యం, సహజ వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సోమవారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో నిర్వహించిన రైతుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, వరికి బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు.

జిల్లాలోని 72 రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో సుమారు 5,000 మంది రైతులు, 200 మంది ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొని ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ, సాగు ప్రణాళికలపై చర్చించినట్లు పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో భూగర్భ జలమట్టాలు సగటున నాలుగు మీటర్ల మేర తగ్గిన నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

వరి సాగుకు అధిక నీరు అవసరమవుతున్నందున నేల స్వభావం, స్థానిక వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి కంది, పెసర, మినుము, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని రైతులకు సూచించారు.

సమగ్ర వ్యవసాయంతో అదనపు ఆదాయం

పంటల వైవిధ్యం, సహజ వ్యవసాయ పద్ధతులతో తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతు శ్రీకాంత్ తన అనుభవంతో నిరూపిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. మూడు ఎకరాల్లో పసుపు, ఉల్లిగడ్డ, కూరగాయలు, పెసర, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలను సాగు చేస్తూ రసాయన ఎరువులు, యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు పొలంలో నీటి కుంట ఏర్పాటు చేసుకోవడంతో పాటు, నేల సారాన్ని పెంచేందుకు పెసరను పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగిస్తున్నారని వివరించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసేందుకు పందిరి విధానాన్ని అనుసరిస్తూ అందుబాటులో ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారని చెప్పారు.

అర ఎకరంలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ ద్వారా మొదటి ఏడాది రూ.1.50 లక్షలు, రెండో ఏడాది రూ.3 లక్షలు, మూడో ఏడాది నుంచి సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నట్లు రైతు శ్రీకాంత్ వెల్లడించారని కలెక్టర్ తెలిపారు. పంటల వైవిధ్యం, సహజ వనరుల సంరక్షణతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవచ్చని పేర్కొన్నారు.

పామాయిల్‌తో పాటు అంతర పంటల సాగు

గాంధారి మండలం గుడిమెట్ గ్రామానికి చెందిన ఓ రైతు పామాయిల్ సాగుతో పాటు అంతర పంటలు పండిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారని కలెక్టర్ వివరించారు. గతంలో 15 ఎకరాల్లో సోయాబీన్, మొక్కజొన్న, వరి సాగు చేసిన ఆ రైతు, వరి సాగును తగ్గించి 2023 జూన్‌లో పామాయిల్ సాగు ప్రారంభించినట్లు తెలిపారు.

పామాయిల్ తోటలో మొదటి ఏడాది పత్తి, మునగ; రెండో ఏడాది మునగ, కంది అంతర పంటలుగా సాగు చేశారు. ప్రస్తుతం మూడో ఏడాదిలో ఉద్యానవన శాఖ ద్వారా పొందిన బంతిపూల మొక్కలను సాగు చేస్తున్నారు. పామాయిల్‌తో పాటు అంతర పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు రైతు తెలిపారు.

మొదటి కోతలో మూడు క్వింటాళ్ల వరకు పామాయిల్ దిగుబడి వచ్చిందని, పంట విక్రయించిన మూడు నుంచి నాలుగు రోజుల్లోనే డబ్బులు ఖాతాలో జమ కావడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. నీటి వసతి తగ్గడంతో గతంలో నాలుగు నుంచి ఐదు ఎకరాల్లో సాగు చేసిన వరిని ప్రస్తుతం ఇంటి సమీపంలోని ఒక ఎకరానికే పరిమితం చేసినట్లు తెలిపారు. రానున్న యాసంగి సీజన్‌లో ఆ ఎకరంలో కూడా వరికి బదులుగా మునగ సాగు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటల ఎంపికలో తగిన మార్పులు చేసుకోవాలని, పామాయిల్ వంటి దీర్ఘకాలిక పంటలతో పాటు అనువైన అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.

వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ, పంటల వైవిధ్యం, సహజ వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీమాయాల లక్ష్మి, కామారెడ్డి ఏఎంసీ చైర్మన్ ధర్మగోని లక్ష్మి, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, తహసీల్దార్ హిమబిందు, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.