నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 28

ప్రజాస్వామ్యానికి పునాదులైన నాలుగు వ్యవస్థలు కునారిల్లి పోతున్నాయి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎ ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు
- హైదరాబాద్: ప్రజాస్వామ్యానికి పునాదులైన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడు స్తంభాలైతే నాలుగో స్తంభం మీడియా అని ఈ నాలుగు వ్యవస్థలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన మాదిరిగా కునారిల్లిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎ ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థలను తిరిగి నిలబెట్టడంతో పాటు దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం (టిఎస్ జాగో నవతెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి’ అనే అంశంపై సదస్సు ఆదివారం హైదరాబాద్ బాగ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. సదస్సుకు టిఎస్ చైర్మన్ జస్టిస్ బి.చంద్రకుమార్ అధ్యక్షతన వహించగా ముఖ్య వక్తగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, వక్తలుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు, వామపక్ష, ప్రజా, పౌర హక్కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సదస్సులో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పేదల హక్కుల కోసంపోరాడుతున్న వ్యక్తులు అక్రమంగా జైళ్లలో బంధించబడుతుంటే దేశాన్ని దోచుకుంటున్న కొంతమంది దొంగలు మాత్రం గద్దేనెక్కుతుండడం దేశానికి పట్టిన గ్రహాణమని ఆయన పేర్కొన్నారు. దేశంలో కొద్దో గొప్పో న్యాయవ్యవస్థ పనిచేస్తున్నందునే సమాజం మనుగడ సాగిస్తోందని, న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు జరిగే ప్రతి ఉద్యమంలో సిపిఐ ప్రత్యక్షంగా పూర్తిగా భాగస్వామ్యం అవుతందని కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాట యోదులు కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈవిఎంల ద్వారా ఓట్ల చోరీకి పాల్పడుతూ గద్దేనెక్కిన బిజెపి దేశంలోని అన్ని ప్రధాన సంస్థలను చెరబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందన్నారు. బిజెపి అధికారానికి చరమగీతం పాడేందుకు ఈవిఎం విముక్తి భారత్ పేరుతో ప్రజాఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఇందుకు ప్రశాంత్ భూషణ్ దేశ వ్యాప్తంగా న్యాయకత్వం వహించాలని కోరారు.