** ‘సనాతన’ ఉన్మాదం
Oct 8
,2025 05:55
నేటి సత్యం
RK
దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సనాతనధర్మోన్మాదం తలకెక్కించుకున్న న్యాయవాది బూటు విసిరి దాడికి యత్నించిన అత్యంత ఆందోళనకర ఘటన ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుస్థితిని తెలుపుతుంది. సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో, అదీ ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు జరుగుతుండగా దుండగ మనస్తత్వం నిలువెల్లా నింపుకున్న ఒక లాయర్ ఎలాంటి జంకు భయం లేకుండా చీఫ్ జస్టిస్ పోడియం వైపు దూసుకెళ్లి దాడికి తెగబడటాన్ని తీవ్రంగా పరిగణించాలి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ హఠాత్పరిణామంతో కోర్టులో తీవ్ర గందరగోళం నెలకొనగా, ఇటువంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయబోవని గవాయ్ చూపిన నిబ్బరం న్యాయవ్యవస్థపై గౌరవాన్ని, మన జ్యుడీషియరీ ధృఢత్వాన్ని ఇనుమడింపజేసింది. కాగా దాడి చేసిన వ్యక్తి సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించబోమంటూ కోర్టు హాలులో చేసిన నినాదాలనుబట్టి దాడికి ప్రేరణ ఏమిటో, ఎవరో సులభంగానే బోధ పడుతుంది. జస్టిస్ గవాయ్ పై దాడి ఉదంతంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ రక్షణను అభిలషించే ప్రతి ఒక్కరూ చీఫ్ జస్టిస్‌పై దాడిని ఖండించాలి.
జస్టిస్ గవాయ్ పై దాడి ఘటన అదేదో సాదాసీదా యాదృచ్చికంగా చోటు చేసుకున్నది కాదు. కేవలం ఒక వ్యక్తి పిచ్చి అంతనకన్నా కాదు. వందేళ్ల ఆర్ఎస్ఎస్, పరివారం ప్రజల మెదళ్లకు ఎక్కించిన విద్వేష విషం. ప్రజల్లో మత విభజన సిద్ధాంత భావజాల వ్యాప్తిని ఘటన ప్రతిబింబిస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక వ్యవస్థల ధ్వంసం సైద్ధాంతికంగా ఒక పథకం ప్రకారం సాగుతోంది. న్యాయ వ్యవస్థను సైతం వదిలిపెట్టలేదు. జస్టిస్ గవాయ్ పై దాడి రాజ్యాంగానికి, ప్రజలకు అవమానం. సనాతన ధర్మాన్ని మోడీ ప్రభుత్వం భుజానికెత్తుకొని ప్రచారం చేస్తున్న తరుణంలో, జస్టిస్ గవాయ్ పై దాడుల వంటివే సనాతన ధర్మమా? మోడీ, బిజెపి సమాధానం చెప్పాలి. మన రాష్ట్రంలో సనాతన ధర్మంపై ప్రచారం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్, చీఫ్ జస్టిస్‌పై సనాతన వాది దాడిని ఖండిస్తారా, లేక మద్దతిస్తారో స్పష్టం చేయాలి. గవాయ్ పై దాడిని తరతమ భేదం లేకుండా పార్టీలు, సంస్థలు, వ్యక్తులు నిరసిస్తుండగా, ఇప్పటి వరకు బిజెపి, మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి బహిరంగ స్పందన వెలువడలేదు. దీన్నిబట్టి దాడిని పరోక్షంగా స్వాగతిస్తున్నారనుకోవాలి.
జస్టిస్ గవాయ్ దళిత కులానికి చెందిన వారైనందున, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అయిన దగ్గర నుంచీ సంఘ్ పరివారం, బిజెపి ఆయన్ని లక్ష్యంగా చేసుకొని వ్యతిరేక ప్రచారం లంకించుకున్నాయి. చీఫ్ జస్టిస్ బాధ్యతలు స్వీకరించాక మే నెలలో తొలిసారి స్వంత రాష్ట్రం ముంబరు పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి బిజెపి ప్రభుత్వం కనీస ప్రొటోకాల్ పాటించకుండా ఘోరంగా అవమానపర్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, ముంబరు పోలీస్ కమిషనర్ వంటి ముఖ్య అధికారులు గవారు పర్యటనకు ఉద్దేశపూర్వకంగా డుమ్మాకొట్టారు. అనంతరం పొరపాటు జరిగిందని మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టు ముందు తప్పు ఒప్పుకొని విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది. జస్టిస్ గవాయ్ తల్లిదండ్రులపై మహారాష్ట్రలోని సంఫ్‌ు పరివార్ మూకలు సోషల్‌మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుండటంపై వారు బహిరంగంగా నిరసన తెలియజేశారు. మొన్న అక్టోబర్ 5న మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవానికి రావాలన్న ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు గవాయ్ తల్లి ప్రకటించారు. బీహార్ ఓటర్ల సవరణ, గవర్నర్ల వ్యవహారశైలి తదితరాలపై గవాయ్ జారీ ఉత్తర్వుల నేపథ్యంలో రాజకీయ కారణాలు కూడా ఆయనపై దాడికి పురిగొల్పి ఉండవచ్చు. ఈ పూర్వరంగంలో చూస్తే గవారుపై ఉద్దేశపూర్వకంగానే సంఘ్ పరివారం, బిజెపి పగబట్టి వెంటబడి వేధిస్తున్నాయని అర్థమవుతుంది. ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమన్న పరివార్ హెచ్చరికగా గవాయ్ పై దాడిని పరిగణించాలి. కోర్టు హాలులో గవారుపై దాడిని అగ్రకుల సనాతన ఉన్మాద సంస్కృతిలో భాగంగా చూడాలి. విభజన, విషపూరిత రాజకీయాల ప్రభావంతో సాగుతున్న విద్వేష చర్యలను అందరూ కలిసి సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. ఆ కర్తవ్య కార్యాచరణే వైవిధ్యభరిత భారతావనికి, రాజ్యాంగానికి తిరుగులేని రక్షణ కవచం.