నేటి సత్యం.
విశ్లేషణ ఆర్కే 
*హైకోర్టు స్టే తో…. ముదిరిన బీసీ వివాదం*
*రిజర్వేషన్ వాటా దక్కకపోతే ప్రభుత్వంపై తిరగబడేందుకు మరో ఉద్యమం.*
తెలంగాణ రాజకీయాల్లో బీసీల అసంతృప్తి మళ్లీ ముదిరింది. హైకోర్టు రిజర్వేషన్లపై స్టే ఇచ్చిన తర్వాత బీసీ వర్గం తీవ్రంగా స్పందిస్తోంది. తమ హక్కులను కాల రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజకీయంగా పక్కనబెడుతున్నారని ఈ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బీసీలు తిరగబడితే ప్రభుత్వాలే కూలిపోతాయి అనే నినాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హై కోర్టులో బలమైన వాదనలు , సమగ్ర విచారణ చేపట్టకపోవడంతోనే స్టే విధించిందని, అగ్రవర్ణ కులాల కుట్రనేనని దానిని ప్రజలందరూ గమనిస్తున్నారని అతి త్వరలో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీ పెద్దలు అంటున్నారు.
*బీసీల సామాజిక శక్తి… రాజకీయ స్తంభం*
తెలంగాణలో మొత్తం జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఈ వర్గం ఓటు శక్తి అప్రతిహతం. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, లోక్సభ వరకు బీసీల ఓటు బ్యాంకు నిర్ణయాత్మకంగా ఉంటుంది. గత ఎన్నికల ఫలితాలపై కూడా వీరి ఓటు ప్రభావం స్పష్టంగా కనిపించింది.ఇలాంటి వర్గం ప్రభుత్వంపై తిరగబడితే రాజకీయ సమీకరణాలన్నీ తారుమారయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీల మద్దతు కోల్పోయిన ఏ పార్టీ ఎక్కువ రోజులు అధికారంలో నిలవలేదు అనేది చరిత్ర చెబుతున్న సత్యం.
*హైకోర్టు స్టే…ఆగ్రహానికి నాంది*
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఆదేశాలు బీసీలలో ఆగ్రహానికి కారణమయ్యాయి.తమ హక్కులపై రాజీ పడమని స్పష్టమైన హెచ్చరికలు వస్తున్నాయి. బీసీ సంఘాలు, నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. బీసీ నాయకులు చెబుతున్న మాట స్పష్టం మాకు న్యాయం చేయకపోతే మేము ఎవరికీ వెనకడుగు వేయం. బీసీలను విస్మరించిన ప్రతి ప్రభుత్వం కూలింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
*ప్రభుత్వానికి పెరుగుతున్న ఒత్తిడి*
ప్రస్తుతం ప్రభుత్వం రెండు మంటల మధ్య చిక్కుకుంది. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు బీసీ వర్గం ఒత్తిడి. చట్టపరమైన పరిమితుల్లో రిజర్వేషన్ల సవరణ చేయాల్సిన అవసరం ఉన్నా, బీసీల ఆగ్రహాన్ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారింది.హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే బీసీలకు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లేకపోతే హై కోర్టు స్టే ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికీ చాలా జాప్యం కావడంతో బీసీల సహనాన్ని పరిశీలిస్తున్నారని సహనం కోల్పోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.కానీ ఈ మాటలతో బీసీ వర్గం చల్లబడేలా కనిపించడం లేదు.
*రాజకీయ విశ్లేషకుల అంచనాలు.*
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ..బీసీలు ఏకతాటిపైకి వస్తే అది తెలంగాణ రాజకీయాల రూపురేఖలను మార్చేస్తుంది. బీసీలు తిరగబడితే కేవలం ప్రభుత్వమే కాదు, రాజకీయ సమీకరణాలే కూలిపోతాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా, బీసీ ఉద్యమం విస్తృతంగా రూపుదిద్దుకుంటే, రాబోయే ఎన్నికల్లో ప్రతి పార్టీ తమ వ్యూహాలను మళ్లీ పునరాలోచించాల్సి వస్తుంది. బీసీలను విస్మరించడం అంటే ఓటు బ్యాంకును కోల్పోవడమేనని రాజకీయ నాయకులు కూడా గుర్తిస్తున్నారు.
*మరో ఉద్యమానికి బాట?*
పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తే బీసీ ప్రజలు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం సమయంలో బీసీలు కీలకపాత్ర పోషించారు. ఆ వర్గం మళ్లీ ఐక్యమై, రాజకీయంగా దృఢంగా మారితే, అది కొత్త ఉద్యమానికి నాంది కావచ్చు. ప్రజా స్థాయిలో ఇప్పటికే ఆ అసంతృప్తి గుసగుసలుగా మొదలైంది.బీసీలు తిరగబడితే కేవలం రాజకీయ ప్రకంపనలు మాత్రమే కాదు, అధికార కుర్చీ కూడా కదిలే అవకాశం ఉంది.ప్రభుత్వం ఈ బీసీ ఆవేశాన్ని సమర్థంగా ఎదుర్కొని, న్యాయం చేయగలదా…? మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే…!
*ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఫైనల్ ఆప్షన్*
హైకోర్టు జీవో నెంబర్ 9పై విధించిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ప్రభుత్వానికి ఉన్న తొలి ఆప్షన్. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి, విచారణకు వచ్చేలా చూడటం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ట్రిపుల్ టెస్ట్ ప్రక్రియను రిజర్వేషన్లు పెంపు సందర్భంగా పాటించినట్లు చట్టపరంగా నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకుగాను, బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణన సర్వే, బీసీ కమిషన్ ఏర్పాటు, ఆ కమిషన్ చేసిన అధ్యయనం, సిఫారసులను సుప్రీంకోర్టు ముందు ఉంచడం ద్వారా, తమకు అనుకూలంగా అంటే జీవో నెంబర్ 9పై స్టేను ఎత్తివేసేలా చేయడం ఫైనల్ ఆప్షన్ గా చేయాలి…