Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకార్పొరేట్ శక్తుల చేతిలో భారత్

కార్పొరేట్ శక్తుల చేతిలో భారత్

నేటి సత్యం శాపంగా క్రోనీ క్యాపిటలిజమ్‌
అసమానతల కొత్త శకంగా మోడీ పాలన
ప్రజల కంటే లాభాలకే ప్రాముఖ్యత
మేధావులు, ఆర్థిక నిపుణుల ఆందోళన

భారత్‌కు క్రోనీ క్యాపిటలిజం ఒక శాపంగా మారింది. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్‌ శక్తులు దేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వాలు కార్పొరేట్లు, బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు అండదండలు అందిస్తున్నాయి. ఫలితంగా దేశంలో స్వేచ్ఛా మార్కెట్‌ పోటీ దెబ్బ తింటున్నది. అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి. పేదలు నిరుపేదలుగా.. సంపన్నులు అతి సంపన్నులుగా మారిపోతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలే ఇందుకు ఉదాహరణగా వివరిస్తున్నారు విశ్లేషకులు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీల వ్యాపారాలు విస్తరించిన తీరు, వారు పొందుతున్న విపరీతమైన లాభాలు, వారికి అనుకూలంగా రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ పాలసీలు వంటివి దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. భారత్‌లో 1991లో ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చారు. ఆర్థిక స్వేచ్ఛ దిశగా అది కొత్త యుగానికి సంకేతమంటూ అంతా భావించారు.

లైసెన్స్‌రాజ్‌ను తొలగించి, మార్కెట్‌ స్వేచ్ఛను తెచ్చి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించాలన్న ఆశయంతో లిబరలైజేషన్‌ ప్రారంభమైంది. అయితే మూడు దశాబ్దాల తర్వాత ఆ ఆశయం ఒక భయంకరమైన వాస్తవంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. భారత్‌ ఇప్పుడు క్యాపిటలిజం నుంచి క్రోనీ క్యాపిటలిజంగా రూపాంతరం చెందిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు సామాజిక రక్షణేది?
యూరోపియన్‌ దేశాలు లిబరలైజేషన్‌ను ప్రజల భద్రతతో కలిపి అమలు చేశాయి. ప్రజారోగ్యం, విద్య, పెన్షన్‌, ఇన్సూరెన్స్‌ వంటి సామాజిక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కల్పించాయి. కానీ భారత్‌ మాత్రం ఆ మార్గంలో వెళ్లలేదు.ఇక్కడ ప్రభుత్వ రంగాన్ని క్రమంగా కూల్చి..కార్పొరేట్‌ చేతులకు అప్పగించారు. విద్య, ఆరోగ్యం, రైల్వేలు, రక్షణ..ఇలా కీలక రంగాలు ప్రయివేటీకరణ దిశగా కదిలాయి. దీంతో ప్రభుత్వం ఒక ప్రజాసేవకుడి పాత్ర నుంచి కార్పొరేట్‌ దళారీగా మారిపోయిందని మేధావులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

లిబరలైజేషన్‌ టు క్రోనీ క్యాపిటలిజం
రాజకీయ నాయకులు, వ్యాపారులు పరస్పర లాభాల కోసం కలిసిపోవడం క్రోనీ క్యాపిటలిజంలో భాగం. ఇందులో ప్రభుత్వ విధానాలు వ్యాపారస్తులు, సంపన్నులకు అనుకూలంగా ఉంటాయి. బొగ్గు బ్లాక్‌లు, టెలికాం లైసెన్స్‌ వంటి ప్రభుత్వ వనరులు కొద్ది మంది చేతుల్లోకే వెళ్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాలసీలు ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ల కోసం తయారవుతాయి.ఫలితంగా ప్రజాస్వామ్యం స్వరూపం కూడా మారిపోతున్నది.

క్రోనీ క్యాపిటలిజంతో లాభాలు గడించిన, గడించాలనుకుంటున్న సంపన్నులు, వ్యాపారులు.. అధికార పార్టీలకు భారీగా విరాళాలు అందజేస్తున్నాయి. ఇందుకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ కార్పొరేట్‌ లాబీలు, రాజకీయ పార్టీలకు మంచి అవకాశంగా మారాయి. ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా ఎవరు ఎంత విరాళం ఇస్తున్నారో ప్రజలకు తెలియదు. ఫలితంగా ‘సంపన్నులు భారీ విరాళాలు ఇవ్వడం, ప్రభుత్వాలు పాలసీలు మార్చడం’ వంటివి జరుగుతున్నాయని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.

ఉద్యోగాలు, అభివృద్ధి ఏది?
ఆర్థిక వ్యవస్థను క్రోనీ క్యాపిటలిజంగా మార్చిన ప్రభుత్వాలు.. గుప్పెడు మంది సంపన్నుల కోసం మాత్రమే పని చేస్తున్నాయి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి, ఉద్యోగాలు మాత్రం ఆశించిన స్థాయిలో కనబడటం లేవు. దేశంలో చదువుకున్న యువతలో 83 శాతం మంది నిరుద్యోగులు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేదరికం ఇప్పటికీ సమస్యగానే ఉన్నది.

వేలాది మంది నగరాలకు వలస వెళ్తున్నారు. మురికి ప్రాంతాలలో నివసిస్తూ, తక్కువ వేతనాలతో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. ఇది న్యూ ఇండియా కాదనీ, అసమానతలు తీవ్రంగా ఉన్న భారతదేశమని మేధావులు విమర్శిస్తున్నారు. అధికారం, సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడంతో సామాజిక అసమానతలు పెరిగిపోయాయని అంటున్నారు.

యువతలో నిరాశ అధికమైందనీ, పేదరికం, నిరుద్యోగం, రాజకీయ దుర్వినియోగం అంతా కలిసి సామాజిక అస్థిరతకు దారి తీస్తున్నాయని మేధావులు హెచ్చరిస్తున్నారు. దేశ అభివృద్ధిని జీడీపీ రూపంలో కాకుండా.. ప్రజలకు అందే విలువైన విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు, గౌరవం అనే అంశాల ఆధారంగా చూడాలని వారు అంటున్నారు. ఇందుకు ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, నియంత్రణ సంస్థల స్వతంత్రత, రాజకీయ నిధులపై నియంత్రణ, సంపన్నులపై న్యాయమైన పన్ను అవసరమని సూచిస్తున్నారు.

అలాగే ఎలక్టోరల్‌ బాండ్స్‌ రద్దు, విద్య, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధిపై అధిక పెట్టుబడులు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ప్రోత్సాహం ఆవశ్యమని అంటున్నారు. ఇది సమానతతో కూడిన మార్కెట్‌ వ్యవస్థను రూపొందించగలదని చెప్తున్నారు.

మోడీ హయాంలో తీవ్ర అసమానతలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో అసమానతలు తీవ్రంగా పెరిగిపోయాయి. భారత్‌ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కానీ గణాంకాలు చెప్పే వాస్తవాలు మాత్రం ఆ స్థాయిలో కనబడటం లేవు. ప్రపంచ అసమానతా నివేదిక(2025) ప్రకారం భారత్‌లో టాప్‌ ఒక శాతం వర్గం దేశ సంపదలో 62 శాతం వాటాను కలిగి ఉన్నది.

ఇక టాప్‌ 10 శాతం మంది వద్ద 74 శాతం సంపద ఉన్నది. కానీ.. 50 శాతం మంది ప్రజలు(కింది నుంచి), అంటే సుమారు 70 కోట్ల మంది వద్ద కేవలం ఆరు శాతం సంపదే ఉన్నది. అయితే ఇదంతా యాదృచ్చికంగా జరిగింది కాదని మేధావులు చెప్తున్నారు. దీనికి ప్రభుత్వ విధాన, నైతిక వైఫల్యంగా వారు అభివర్ణిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజల అభ్యున్నతికి కాకుండా, ధనిక వర్గాల లాభాలకు అనుకూలంగా తయారు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments