* దిగ్భ్రాంతికరం
నేటి సత్యం నవంబరు 12
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో బాంబుపేలుడు దిగ్భ్రాంతికరం. 13 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు కావడం అత్యంత విషాదకరం. తమ పనుల్లో తలమునకలై ఉన్న అనేకమంది ఏం జరిగిందో తెలుసుకునేలోపే తమ చుట్టూ శరీర అవయవాలు తెగిపడి ప్రాణాలు కోల్పోవడమో, క్షతగాత్రులై హాహాకారాలు చేస్తూ పడిపోవడమో, అత్యంత భీతావహంగా ఆ ప్రాంతమంతా మారిపోయింది. భారీ విస్ఫోటనంతో భయపడి పరిగెడుతున్న తమపై మృతుల శరీర భాగాలు ఎగిరిపడ్డాయని, సెకన్లలోనే ఎర్రని పొగ ఆకాశమంతా కమ్మేసిందని, కిలోమీటర్ల మేర శబ్దం వినిపించిందన్న ప్రత్యక్ష సాక్షుల కథనాలు అందరినీ బాధిస్తాయి. ఈ ఘటనలో మరణించిన వారి, చావుబతుకుల మధ్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులు పడుతున్న క్షోభ హృదయవిదారకం. మృతుల శరీర భాగాలను గుర్తులు లేదా ఆభరణాలను బట్టి గుర్తించాల్సిన దుస్థితి ఏర్పడటం ఎంతటి విషాదం! ఇంతటి అమానుష కాండను దేశమంతా ముక్తకంఠంతో ఖండించింది. ఈ మారణహోమానికి బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షించాల్సిందే.
గత పదేళ్లలో పుల్వామా, పహల్గాం తదితర భారీ ఉగ్రవాద దాడులు జమ్ముకాశ్మీర్‌లో జరిగాయి. తాను ముందస్తు హెచ్చరికలు చేసినా, కేంద్రంలోని హోం మంత్రిత్వశాఖ రోడ్డు మార్గంలో పంపించడం వల్లే జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అప్పటి జమ్ముకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తరువాత మళ్లీ కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి రావడానికి ఈ ఘటన అనంతరం సాగిన విద్వేష ప్రచారం ఉపయోగపడిందనేది విశ్లేషకుల భావన. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి ప్రతిస్పందనగా కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. మతపరమైన విభజన రగిలించడానికే ఉగ్రఘాతుకం జరిగిందని ‘పహల్గాం’ అనంతరం విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ఆ తరువాత దేశంలో సంఫ్‌ు శ్రేణులు చేసిన ప్రచారం అనేక చోట్ల ఒక మతస్తులపై దాడికి కారణమవడం గర్హనీయం. అన్ని మతాలు శాంతి, అహింసను ప్రబోధించేవే. కాలం చెల్లిన భావజాలాన్ని మెదళ్లలో నింపి, అధికారానికి నిచ్చెనమెట్లుగా విద్వేషాన్ని వాడుకుని, కార్పొరేట్లకు వనరులను కట్టబెట్టే నయా ఉదారవాద విధానాలు ఉగ్రవాదానికి అండదండలందించేవే.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2,900 కిలోల భారీ పేలుడు పదార్థాలను మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకుని, ముగ్గురు వైద్యులుసహా ఎనిమిదిమందిని అరెస్టు చేసిన తరువాత రోజే ఢిల్లీలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇటువంటి నెట్‌వర్క్‌లు వేళ్లూనుకోవడం ఆందోళనకరం. పేలుడు పదార్థాలు, ఉగ్రవాద స్థావరాల లోగుట్టును ఛేదించడం ప్రభుత్వ కర్తవ్యం. హస్తినలో విస్ఫోటానికి ఆత్మాహుతి బాంబర్ కారణమని, అదే కారులో మరొకరు ఉన్నారని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పాలనా వైఫల్యం తప్ప వేరొకటి కాదు కదా! ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖదే. కనుక సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత వారిదే.
ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే శాంతియుత వాతావరణం అత్యవసరం. భిన్నత్వంలో ఏకత్వం, బహుళత్వంతో కూడిన సమాజమే భారతదేశం బలం. దీన్ని విచ్ఛిన్నం చేసే ఎత్తుగడలు, ఒక మతంపై విద్వేషాన్ని వ్యాపింపజేసే వాతావరణం గత పదేళ్లలో బాగా పెరిగింది. విద్వేషం పెంచే ధోరణులను అడ్డుకోవాలి. రెచ్చగొట్టే చర్యలకు లొంగిపోకుండా ఐక్యతే బలమని చాటిచెప్పాలి. అది ఏ మతానికి చెందినదైనా ఉగ్రవాదం ప్రమాదకరము, వినాశకరమైనది. ఉగ్రవాదంపై పోరాడటం అత్యవసరం. ఉగ్రవాదుల హత్యాకాండకూ, వారి విద్వేషపూరిత భావజాలానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ప్రజల సమ్యైకత పైన, లౌకిక విలువలపైన ఆధారపడి సాగాలి. ఉగ్రవాదం పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వుండాలి. విద్వేష విషానికి ఐక్యతే విరుగుడుగా భుజం భుజం కలిపి ముందుకుసాగితే ఉగ్ర భూతాన్ని అణగదొక్కగలం.