నేటి సత్యం హైదరాబాద్ నవంబర్ 20
బూటకపు ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు నాయకులను హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాద్,ట్యాంక్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘అఖిలపక్ష పార్టీల ధర్నా’ నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాల సేకరణను చేపట్టాలని వక్తలు తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులైన, పేదల కోసం పని చేస్తున్న మావోయిస్టులతో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. బూటకపు ఎన్ కౌంటర్ల పై పౌర సమాజం స్పందిచకపోతే భవిష్యత్ మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. ‘బిజెపి ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడాన్ని నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మఖ్దూంభవన్ గురువారం ‘రౌంట్ టేబుల్’ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష,రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల నాయకులు,మేథావులు తదితరులు హాజరయ్యారు. అభివృద్ధి నమూనా పేరుతో అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిచేందుకు అడ్డంకిగా మారిన మావోయిస్టులను ఎన్ కౌంటర్ల పేరుతో కేంద్రం హత్య చేస్తోందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 మార్చి నాటికి అటవీలోని ఖనీజ సంపదను కార్పొరేట్ శక్తులకు ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందని, అందుకే ఆ గడువులోపు మావోయిస్టులను హత్య చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లొంగిపోయేందుకు ప్రయత్నించిన వారిని, కాల్పులు విరమించి షెల్టర్ తీసుకున్న మావోయిస్టులను చుట్టుముట్టి వారిపైన కాల్పులు జరుపుతున్నారని దుయ్యబట్టారు.
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా జీవితంలో కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి లాంటి ఫాసిస్టు శక్తులు బలపడితే దేశానికి, సమాజానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను, కాంగ్రెస్ వామపక్ష భావజాలం ఉన్న వారిని కేంద్రంలోని బిజెపి బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తోందని, ఆరోపించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంద న్నారు. బిహార్ తరహాలో ఎస్ ఓటర్ జాబితాను తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్రం ప్రవేశపెట్టబోతుందన్నారు. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగే విధంగా చూస్తోందని, దేశాన్ని కార్పొరేట్ దేశంగా చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అధికారమే పరమవదిగా ఎంతదూరమైనా వెళ్లేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. మతం పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తోందని, ఇందులో ఉన్నత చదువులు కలిగిన యువత ఉండడం బాధాకరమన్నారు. బిజెపి విధానాలను అందరం వ్యతిరేకించాలన్నారు. హిడ్మా, కేశవరావు, తిరుపతి ఇలా వీరిని నాయకులుగా గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినప్పటికీ వారు తమ జీవితాంతం ప్రజల కోసం పాటు పడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత మారిన పరిస్థితుల కారణంగా ఎలిమినేషన్ అనేది సరి కాదని, ప్రజాస్వామ్య దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదన్నారు. జన జీవన స్రవంతి లో కలుస్తామని చెప్పిన వారిని కూడా పట్టుకుని చంపడం ఏం పద్ధతి అని మండిపడ్డారు. అధికారం కోసం బిజెపి ఎంత దూరమైనా పోతుందని, కార్పొరేట్ శక్తుల గుప్పిట్లోనే బిజెపి పనిచేస్తోందని ఆరోపించారు. ఛత్తీస్ జార్ఖండ్ ఉన్న విలువైన ఖనిజాలను కార్పొరేట్ లకు అప్పగించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పాలకులు, మావోయిస్టుల తరపున జరిగే ఇరు వైపులా హింసను తాము వ్యతిరేకిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ ఎన్ కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని డిమాండ్ చేశారు. రాముని పేరు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, కనీసం రాక్షస నీతిని కూడా పాటించడం లేదని, నరరూప రాక్షసుల తరహా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మావోయిస్టుల పట్ల కేంద్రం బార్బరిజం సాగిస్తోందన్నారు. మానవ హననం చేయాలని పాలకులకు ఏ శాస్త్రం, ధర్మం చెబుతుందని నిలదీశారు. ఎన్ కౌంటర్ అంటే ఏమిటో కూడా తెలియనివారు కేంద్ర మంత్రులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టుల పట్ల కేంద్రం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కమ్యూనిస్టులు, మావోయిస్టులకు మధ్య భావజాలంలో తేడా ఉన్నప్పటికీ ఇద్దరూ పేద వర్గాల కోసమే పని చేస్తారన్నారు. ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణ చేపట్టాలని, ఇప్పటి వరకు జరిగిన ఎన్ కౌంటర్ల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.
టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ రాజకీయ ఉద్యమాలను హింసతో రూపుమపలేవని, వ్యక్తులను చంపి,వారిని అణిచివేయవచ్చని, కానీ వ్యవస్థను అణచివేయడం సాధ్యం కాదని సూచించారు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. ఎన్ కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన కూడా కేసు నమోదు చేసి విచారించాలని జాతీయ కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని, దీనిని కేంద్రం పాటించడం లేదని కోదండరామ్ తెలిపారు.
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని, ప్రదాని మోదీ,బిజెపిని ప్రశ్నించే, ఆరోపించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. మావోయిస్టులతో పాటు అన్ని రంగాలు, వ్యవస్థలపైన కేంద్రం ఎన్ కౌంటర్ చేస్తోందని మండిపడ్డారు. బిజిపేయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్కౌం టర్ భయపెడుతున్నారని, గవర్నర్ల ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి ఏదో ఒక రకంగా అక్కడ కూడా బిజెపి అధికారంలోకి రావడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జూలకంటి అన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం చెబుతున్న ‘అభివృద్ధి నమూనా’లో మానవతా విలువలు లేవన్నారు. అడవిలో ప్రాంతాల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విద్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు. అటవీలోని నాలుగు లక్షల చెట్లను తొలగిస్తున్నారన్నారు. ఆదివాసీల హక్కులను కూడా కాలరాస్తున్నారని, కేంద్రం ఎవరి మాటలనూ వినడం లేదని, రాజ్యంగం, చట్టాలను కూడా కేంద్రం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రం తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఎటువంటి మార్చులూ కనిపించలేదన్నారు.
జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ బూటకపు ఎన్ కౌంటర్లు ప్రభుత్వం మానుకోవాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలని, అదే సమయంలో మావోయిస్టులు కూడా సాయుధపోరాటాన్ని వదిలి ప్రజాజీవితంలోనికి రావాలని కోరారు. మనుషులను పట్టుకుని కాల్చిచంపడం ఆర్టికల్ 21 ఒప్పుకుంటుందా? అని ప్రశ్నించారు.
అరుణోదయ సాంస్కృతిక మండలి నాయకురాలు విమలక్క మాట్లాడుతూ ఎన్ కౌంటర్ల పేరుతో కేంద్రం మానవ హననం చేస్తోందన్నారు. మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్రం చేస్తున్న ప్రతి హింస కూడా హింసనే కదా అని ప్రశ్నించారు. తుపాకీ కి తుపాకీ పరిష్కారం కాదన్నారు.
సిపిఐ (ఎం.ఎల్. న్యూడెమోక్రసి మాస్ రాష్ట్ర నాయకులు హన్మెశ్ , సిపిఐ (ఎం.ఎల్). న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు చలపతిరావు, సిపిఐ (ఎం.ఎల్) లిబరేషన్
రాష్ట్ర నాయకులు రమేశ్ రాజా, సిపిఐ (ఎం.ఎల్) చంద్రన్న గ్రూప్ నాయకులు భాస్కర్, , ఎస్‌యుసిఐ (యు) మురహరి, సిపిఐ ఎం.ఎల్. నాయకులు గుర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం తక్షణమే బూటకపు ఎన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చట్టవిరుద్ధమన్నారు. తెలంగాణ పౌర హక్కుల నాయకులు నారాయణతో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి.నరసింహ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాయాదేవి, నెదునూరి జ్యోతి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, రాష్ట్ర సమితి సభ్యులు ఫైమీద, సిపిఐ (ఎం.ఎల్. న్యూడెమోక్రసి నాయకులు కె.గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు .