- *గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలి*
*ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్*
నేటి సత్యం హైదరాబాద్ డిసెంబర్ 9
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నందువలన కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నర్సింహా నేడు ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతినిధి సభ చట్టం 1951 సెక్షన్ 135 బి ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేయుచున్న అన్ని రకాల ఉద్యోగులకు, ప్రైవేటు రంగంలో పనిచేయుచున్న కార్మికులకు ఎన్నికల తేదీ నాడు వేతనంతో కూడిన సెలవు పొందే అధికారం ఉన్నదని వారు పేర్కొన్నారు.
జిహెచ్ఎంసి పరిధిలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో మరియు వివిధ ప్రభుత్వ స్కీములలో ప్రైవేటు సంస్థలలో విధులు నిర్వహిస్తున్నారని. గ్రామపంచాయతీలలో ఓటు ఉన్నవారికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలలో పనిచేయుచున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వివిధ స్కీములలో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలని తద్వారా వీరందరూ తమ ప్రాథమిక హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.
రెండు రోజులలో గ్రామపంచాయతీ ఎన్నికలు ఉన్న నేటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వీరికి సెలవు దినం ప్రకటించకపోవడం వలన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామని ఎంతోమంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల తేదీ నాడు ఈ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.