Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogయుద్ధం అంటే... l

యుద్ధం అంటే… l

యుద్ధమంటే….

బాంబులేస్తే ధ్వంసమైపోయేది రహదారులు భవనాలేనా?

అప్పటిదాకా

పుల్లా పుడకా ముక్కున కరిచి కట్టుకున్న నాగరీకతలన్నీ

పడుతూ లేస్తూ ప్రయోగాలు చేస్తూ దాటొచ్చిన తీరాలన్నీ

నెత్తుట్లో తడిసిపోతాయి

నడుస్తున్న జీవితాలు

నిద్రిస్తున్న బతుకులూ

ఒక్క మాట కూడా చెప్పకుండా బీభత్సంగా అంతరించిపోతాయి

విధ్వంసానికి

మనుషులంటే ఎముకల గూళ్ళే

శకలాలు శకలాలుగా పేలి పోతారు

ఇళ్ళన్నీ కాటికాపర్లు కరువైన స్మశానాలై భయపెడతాయి

కన్నీళ్ళు రక్తంతో తడిసిన రహదార్లు భోరుమంటాయి

పంటలు తోటలు బొగ్గుముక్కలైపోయి బావురుమంటాయి

యుద్ధమెప్పుడూ మృతదేహాల సేద్యమే

విత్తనాలు ఏరుకొచ్చి నేలని సశ్యం చేసే పక్షులైతేనేం?

పాలిచ్చి మనిషి జాతిని పరిపుష్ఠి చేసే పశువులైతేనేం?

చల్లని కౌగిళ్ళనిచ్చి ప్రాణవాయువుల్ని స్తన్యంలా నోటికందించే చెట్లైతేనేం?

బోసినవ్వుల పసిబిడ్డల నుండి బోసినోటి ముసలవ్వల వరకూ

ఎవరైతేనేం? ఏదైతేనేం ?

గెలిచినవాడి పంట కుప్పల్లో

అందరూ ఘొల్లుమనే కంకాళాలే

అన్నీ కెవ్వుమనే ఛిద్రమైన అవయవాలే

వసివాడని పసి కళేబరాలు

తీరాల వెంబడి కొట్టుకొస్తాయి

కూలిన ప్రార్ధనా మందిరాల కింద

దేవుడు కూడా నడుం విరిగి నేలమట్టమై కళ్ళప్పగించి చూస్తాడు

యుద్ధమెప్పుడూ ఆయుధ వ్యాపారమే

ఆయుధాలనిచ్చి ప్రాణాల్ని తీసుకొని పర్సులో పెట్టుకునే

చావు లెక్కల వ్యాపారమే

యుద్ధమెప్పుడూ మనిషి మీద మనిషిని

జాతిమీద జాతిని గురిపెట్టించే మృత్యు వాణిజ్యమే

ఆయుధ బేహారే యుద్ధాలు సృష్ఠిస్తాడు

వాడి గల్లాపెట్టె నిండా గలగలలాడుతూ శవాలే

యుద్ధం

నాగరెకుడి వైజ్ఞానిక క్రూరత్వం

యుద్ధం

ఆధునికుడి దురాశపూరిత వాణిజ్య హింసాత్మక కపటత్వం

పసి పిల్లలకి పక్షులకి పచ్చని చెట్లకి

అమాయక జంతుజాలానికి

ఈ లోకాన్నొదిలేసి

యుద్ధాలకి వ్యతిరేకంగా

ఆఖరి యుద్ధం చేస్తూ చచ్చిపోదాం

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments