అందరి చూపు బీఆర్ఎస్ వైపే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ జోష్ పార్టీలోకి ఊపందుకున్న చేరికలు.
నేటి సత్యం జూబ్లీహిల్స్. నవంబర్ 2జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం!మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే..ఈ చేరికలతో బీఆర్ఎస్ రాబోతున్నట్లు ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోంది.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్లో చేరిన మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నవతా రెడ్డి.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్.
రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిన రేవంత్ సర్కార్.. పథకాలన్నింటినీ బంద్ చేసిందని ఫైరయ్యారు. మహిళలకు రూ.4 వేలు, యువతులకు రూ. 2500, స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి ఏడు వందల రోజులైనా ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మెడలో చైన్ కూడా లాగేస్తోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు కేటీఆర్. ఇప్పుడు వరుసగా జరుగుతున్న చేరికల కార్యక్రమంతో.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. మరో 500 రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని చెప్పారు.
ఇక.. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గోపినాథ్‌ను తలుచుకొని మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే.. దాన్ని కూడా డ్రామా అంటూ కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ ఆయన.. అలాంటి కాంగ్రెస్‌కు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.*