భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చారిత్రక క్షేత్ర పర్యటన*
నేటి సత్యం జనవరి 2 ముధోల్ ఆర్ సీ ప్రతినిధి కదం మారుతీ
మహిషాసుర పాదాలు,మహిషా గుట్ట,గట్టు మైసమ్మ ఆలయాల సందర్శన భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం పెంపొందించాలనే మహత్తర లక్ష్యంతో శుక్రవారం ఒక విశిష్టమైన చారిత్రక క్షేత్ర పర్యటనను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహిషాసుర పాదాలు, మహిషా గుట్ట మరియు ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాలను సందర్శించారు.ఈ సందర్భంగా మహిషాసుర పాదాలకు సంబంధించిన పురాణ, చారిత్రక నేపథ్యం, సంబంధించిన ప్రాచీన కథనాలు, ఈ పాదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, మహిషాసురుడు ఎవరి చేత వధించబడ్డాడు వంటి అంశాలను చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పి.గంగారెడ్డి విద్యార్థులకు సవివరంగా, ఆసక్తికరంగా వివరించారు. చరిత్రను కేవలం పాఠ్యపుస్తకాల పరిమితిలో కాకుండా ప్రత్యక్షంగా ప్రదేశాలను సందర్శిస్తూ తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానపరమైన అవగాహన మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు.
అనంతరం విద్యార్థులు మహిషా గుట్టపై ఉన్న ప్రసిద్ధ గట్టు మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక విశిష్టత, భక్తుల అచంచల విశ్వాసం, ఈ ప్రాంత ప్రజల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి అధ్యాపకులు వివరించారు. మహిషాసుర పాదాలను స్థానిక ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తూ, తరతరాలుగా అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తూ రావడం విశేషమని తెలిపారు. ఇది ప్రజల ధార్మిక నిబద్ధతకు, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే భావనకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని గాఢమైన విశ్వాసంతో ప్రార్థనలు చేస్తారని, అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరచుగా ఇక్కడికి వస్తుంటారని అధ్యాపకులు వివరించారు. చారిత్రక ప్రాధాన్యతతో పాటు ఆధ్యాత్మిక విలువలు కలిగిన ఈ ప్రాంతం విద్యార్థులకు ఒక జీవంత అధ్యయన కేంద్రంగా మారిందని వారు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా మహిషాసురుడి పేరుతోనే మహిషా, మాయిస, మైష్య అనే పదాలు ఉద్భవించి, కాలక్రమంలో భైంసా అనే పేరుగా ఈ ప్రాంతం ఏర్పడినట్లు చరిత్ర చెబుతోందని విద్యార్థులకు వివరించారు. ఇది భైంసా పట్టణానికి ఉన్న పురాతన చారిత్రక నేపథ్యాన్ని మరింతగా తెలియజేస్తుందని పేర్కొన్నారు.ఈ క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థుల్లో చరిత్ర, పురాణాలు, స్థానిక సంస్కృతి, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన మరింతగా పెరిగిందని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ళ బుచ్చయ్య అనుమతితో ఇంచార్ ప్రిన్సిపల్ కె.రఘునాథ్ డా. భీమారావు డాక్టర్ పవన్ కుమార్ పాండే, డాక్టర్ యం. శంకర్, ఎ.రాజు, డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్, డాక్టర్ సంతోష్ కుమార్,డాక్టర్ నహీదా, డాక్టర్ కల్పన, రామ్మోహన్, రాజయ్య, సురేందర్, కిషన్, శ్రావణ్య, అర్షియా సుల్తానా, ఉజ్మా విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.