Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకే నాగేశ్వర్ పై జరుగుతున్న దాడులపై రౌండ్ టేబుల్ సమావేశం

కే నాగేశ్వర్ పై జరుగుతున్న దాడులపై రౌండ్ టేబుల్ సమావేశం

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 4

రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ పై జరుగుతున్న కక్షపూరిత దాడుల పై రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌పై జరుగుతున్న కక్షపూరిత దాడులు, సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌, అక్రమ కేసులను రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ముక్తకంఠంతో ఖండించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని దేశోద్దరక్‌భవన్‌లో గురువారం సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడి’కి వ్యతిరేకంగా’ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జర్నలిస్టులు, సామాజిక విశ్లేషకులు పాల్గొని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

*సత్యాన్వేషణ, భావప్రకటన స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి పునాది: జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి*

సమావేశంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ అనేది లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదన్నారు. ‘ప్రజాస్వామ్యం ఎప్పుడూ భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తుంది. ఒకరి విశ్లేషణతో అందరూ ఏకీభవించాల్సిన అవసరంలేదు. కానీ, ఆ అభిప్రాయాన్ని చెప్పే హక్కును కాపాడటం సమాజ బాధ్యత‘ అని ఆయన స్పష్టం చేశారు. ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్టెయిర్‌ అన్న మాటలను గుర్తు చేస్తూ ‘నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు, కానీ నీవు ఆ మాట చెప్పే హక్కు కోసం నా ప్రాణం ఉన్నంతవరకు పోరాడతాను‘ అనే తాత్విక పునాదిపైనే రాజ్యాంగ హక్కులు నిర్మితమయ్యాయన్నారు. పత్రికలకు, విశ్లేషకులకు తమ విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) కల్పించిందని, ‘నీకు ఎవరు చెప్పారు?‘ అని అడగడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. రాజకీయాల కోసం అస్థిత్వవాదానికి, ప్రాంతీయవాదానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని, ప్రాంతీయ విద్వేషాలను రగల్చడం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. నాగేశ్వర్‌పై అక్రమ కేసులు పెట్టడం అంటే సమాజంలో భయానక వాతావరణం సృష్టించి, ఎవరూ ప్రశ్నించకుండా చేయడమేనని జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

*నాగేశ్వర్‌ గొంతును కాపాడుకోవాలి: కూనంనేని సాంబశివరావు*

సమావేశానికి అధ్యక్షత వహించిన కూనంనేని సాంబశివరావుమాట్లాడుతూ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక విజ్ఞాన ఖని లాంటివారని, ప్రజా గొంతుకైన ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక విశ్లేషణపై వివాదం చెలరేగినప్పుడు నాగేశ్వర్‌ పెద్ద మనసుతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక కూడా, దానిని ఇంకా పెద్ద వివాదంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయ కుట్రలను అర్థం చేసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ సమాజం అందరినీ ప్రేమిస్తుందని, అయితే ఇక్కడి అస్థిత్వంపై దాడి చేస్తే ఊరుకోదని సాంబశివరావు స్పష్టం చేశారు.

*భావప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి ః ప్రొఫెనర్‌ కోదండరామ్‌*

ఎంఎల్‌సి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛను గౌరవించడం ప్రజాస్వామ్య సమాజానికి అత్యవసరమని అన్నారు. నాగేశ్వర్‌ వ్యక్తపరిచే అభిప్రాయాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని, విభేదాలు ఉంటే వాటిని చర్చల ద్వారా, ప్రత్యామ్నాయ అభిప్రాయాల ద్వారా వ్యక్తపరచాలని సూచించారు. అభిప్రాయ భేదాల పేరుతో దాడులకు దిగడం అన్యాయమని, అమానుషమని, అనాగరికమని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమస్యలను నాగరిక పద్ధతుల్లో చర్చించి పరిష్కరించుకోవాలని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలన్నారు.

నాగేశ్వర్‌పై దాడి *ఖండనీయం.. వివాదాలకు ముగింపు పలకాలి: అద్దంకి దయాకర్‌*

ప్రభుత్వ విప్‌ అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణకు రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని, అయితే తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించడం అవసరమన్నారు. నాగేశ్వర్‌ అంశాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు పెరిగేలా వ్యవహరించడం ఎవరికీ మేలు చేయదన్నారు. తెలంగాణ ప్రజలు ప్రేమ, సహనానికి ప్రతీకలని, ద్వేష రాజకీయాలకు తావివ్వకూడదని దయాకర్‌ అన్నారు. జనసేనతో సహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయాలు చేయాలని, తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పరస్పర ఆరోపణలకు ఇక ముగింపు పలికి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్నారు. పవన్‌ కళ్యాణ్‌పై తెలంగాణ ప్రజలకు వ్యక్తిగత వ్యతిరేకత లేదని, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించే దిశగా అందరూ ముందుకు రావాలని కోరారు.

*భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలి: పశ్య పద్మ*

ప్రజల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అవగాహన పెంపొందించేందుకు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ నిరంతరం చేస్తున్న కృషిని గౌరవించాల్సింది పోయి, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ అన్నారు. నాగేశ్వర్‌పై ఏర్పడిన పరిస్థితిని నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సమావేశాలు, సభలు జరుగుతున్నాయని, ఆయనపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యల్లో కమ్యూనిస్టు ఉద్యమాలపై చేసిన విమర్శలు రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల సాధన, సామాజిక సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న రాజకీయ పోరాటాల నేపథ్యాన్ని గుర్తించకుండా మాట్లాడటం విచారకరమన్నారు. రాజకీయాల్లో అరాచక ధోరణులకు తావివ్వకుండా ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించాలని, భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ వంటి మేధావుల ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.

*నాగేశ్వర్‌పై కేసులు ఎత్తివేయాలి.భావప్రకటన స్వేచ్ఛను కాపాడాలి: కె.శ్రీనివాస్‌*

సీనియర్‌ సంపాదకులు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రాంతీయవాదాన్ని జాతీయ భద్రతా సమస్యగా లేదా ఉగ్రవాదంతో పోల్చే వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య చర్చలను దెబ్బతీస్తాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసర వైరుధ్యాలను సృష్టించే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సహజ మిత్రులని, వారి మధ్య విద్వేష సంబంధాలు లేవని స్పష్టం చేశారు.ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఒక రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను వెల్లడించారని, విశ్లేషకులు, జర్నలిస్టులను రాజకీయ ప్రత్యర్థులుగా భావించి లక్ష్యంగా చేసుకోవడం ప్రమాదకర ధోరణి అని విమర్శించారు. అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా ఎదుర్కోవాలే తప్ప వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్‌లు సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

*పవన్‌ కళ్యాణ్‌ వెనుక బిజెపి ఎజెండా: ఎస్‌. వీరయ్య,*

సిపిఎం నేత ఎస్‌ వీరయ్య మాట్లాడుతూప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అంశం ఆంధ్రా-తెలంగాణ పంచాయితీ కాదని, అది కేవలం మీడియా స్వేచ్ఛకు సంబంధించిన విషయమన్నారు. అయితే, ఎపి ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ సరిగ్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఇక్కడికి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పుండు మీద కారం చల్లడమేనన్నారు. ముగిసిపోయిన ప్రాంతీయ విభేదాలను మళ్లీ రగల్చడం ద్వారా ఇక్కడి ఓట్లను చీల్చి రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ వ్యూహమని, ఆ ఎత్తుగడలో పవన్‌ కళ్యాణ్‌ ఒక పాచికగా మారారని విమర్శించారు.

*సిరా ఇంకేవరకు రాస్తూనే ఉంటాను.. గొంతు ఉన్నంతవరకు మాట్లాడుతాను: ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌*

ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌ మాట్లాడుతూ గత 15 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రజాసమస్యలను పక్కనబెట్టి తన చుట్టూనే చర్చలు నడపడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, రైల్వే జోన్‌ లాంటి కీలక అంశాలపై చర్చించని మీడియా ఛానళ్లు, తనపై గంటల తరబడి చర్చలు పెట్టడం వెనుక ఉన్న అధికార వర్గాల విశృంఖలత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘నా మాటల్లో ఎక్కడా కుల ప్రస్తావనగాని, అల్లర్లు రేపే ఉద్దేశం లేదన్నారు. అయినా హైకోర్టులు కొట్టేసిన సెక్షన్లను నాపై ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నేను భయపడను. పదవుల కోసమో, ప్రలోభాల కోసమో నేను మాట్లాడటం లేదు; ప్రజాపక్షాన నిలబడటమే నా బాధ్యత. నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు, నా పెన్నులో సిరా ఇంకేవరకు నేను రాస్తూనే ఉంటానని, మాట్లాడుతూనే ఉంటాను తప్పితే ఎలాంటి నిర్బంధాలకూ లొంగే ప్రసక్తే లేదని నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్లు, సిపిఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ నాయకురాలు రమ మాట్లాడుతూ నాగేశ్వర్‌పై పెట్టిన అన్ని అక్రమ కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. భిన్నాభిప్రాయాలను గౌరవించే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ పరిరక్షణకు తెలుగు నేలపై అందరూ కలిసికట్టుగా ఉద్యమించాలని కోరారు.

*భావప్రకటన స్వేచ్చను గౌరవించుకుంటామని ప్రతిజ్ఞ* ః

ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హజరైన సభికులతో రాజ్యాంగం హామి ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను గౌరవించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ రాజకీయ విశ్లేషణ పై ఆంధ్ర ప్రదేశ్‌ లో కొన్ని పార్టీలు, వారి సోషల్‌ మీడియా బృందాలు చేస్తున్న కక్షపూరిత దాడి, ట్రోలింగ్‌ ను ఈ అఖిల పక్ష సమావేశం తీవ్రంగా ఖండిస్తు తీర్మానం చేసింది. ఇప్పటికే నాగేశ్వర్‌ తన మాటలను ఉపసంహరించుకున్నా, విద్వేషపూరిత దాడి కొనసాగించడం సరికాదని .జనసేన ఆ అంశానికి ముగింపు పలికినట్లు ప్రకటించినప్పటికీ నాగేశ్వర్‌ పైఆంధ్రప్రదేశ్‌ లో కేసులను ఎత్తివేయలేదని,తక్షణమే ఈ అంశానికి ముగింపు పలికి, నాగేశ్వర్‌ పై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సభ అధ్యక్షులు కూనంనేనిసాంబశివరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశంఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే భావ ప్రకటన స్వేచను పరిరక్షించాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సామరస్య వాతావరణం పరిఢవిల్లాలని అఖిల పక్ష సమావేశం అభిప్రాయపండింది. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌ తదితరులు పొల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments