నేటి సత్యం
‘బిసి హక్కుల సాధన సమితి’ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 12
తెలంగాణ ఉద్యమం తరహా ‘ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల’ సాధన కోసం బిజెపి,బిఆర్ ఎస్ ఎందుకు కలిసి రావడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. రిజర్వేషన్ల అమలుపైన రాహుల్ గాంధీ మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్న బిజెపి, రాహుల్ గాంధీ మాట్లాడకపోతే కేంద్ర ప్రభుత్వం మాట్లాడదా?, ఆ బిల్లులను ఆమోదించరా? అని నిలదీశారు. ‘బిసి హక్కుల సాధన సమితి’ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హైదరాబాద్ మఖ్ధూం భవన్ ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కూనంనేని సాంబశివ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘బిసి హక్కుల సాధన సమితి’ అధ్యక్షుడు తాటిపాముల వెంటక్రాములు, కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు, గౌరవ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, నాయకులు పాండురంగాచారి, పల్నాడు యాదయ్య, విజయుడు, ఎల్. శ్రవన్, ప్రమీల, సి.హెచ్ .కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ శాసనసభ ఆమోదించిన ‘బిసి రిజర్వేషన్ల బిల్లుల’ను కేంద్రంలోని అధికార బిజెపి ఆమోదిస్తే, ప్రస్తుతం రిజర్వేషన్ల సమస్య ఉత్పన్నమయ్యేదే కాదు కదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ల విషయంలో బిజెపి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక వైపు అసెంబ్లీలో బిసి రిజర్వేషన్ల బిల్లుకు బిజెపి మద్దతు పలుకుతూనే, ఆ బిల్లు ఎలా పెండింగ్ ఉండాలని ఆలోచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వమే దేశ వ్యాప్తంగా కులగనణ చేపట్టి, వాటి ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలి కదా?, మిగతా రాష్ట్రాలలో కూడా బిసిలు ఓట్లు వేస్తేనే బిజెపి అధికారంలోనికి వచ్చిందని అన్నారు. బిపి మండల కమిషన్ వ్యతిరేకంగా అప్పటి బిజెపి సీనియర్ నాయకుడు అద్వాని కమండల్ యాత్రను నిర్వహించారని కూనంనేని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సాధ్యం కాదని అనేక మంది చెప్పారని, కానీ అందరూ కలిసి ఉద్యమించారని, తద్వారానే రాష్ట్ర ఏర్పాటు జరిగింది, రిజర్వేషన్లు కూడా అలాగే చేస్తే సాధ్యమవుతుందని వివిధ రాజకీయ పార్టీలకు కూనంనేని సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మంలో ఉద్యమం లేదని చెబుతున్న సమయంలోనే తాను ఎంఎల్ పాదయాత్ర చేపట్టానని గుర్తుచేశారు. ఏ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు ఉంటాయో అర్థం చేసుకోవాలని, ఏ రాజకీయ పార్టీ నిర్ణయం ఎలా ఉన్నదోకూడా లోతుగా పరిశీలించాలని ఆయన సూచించారు. బిసి రిజర్వేషన్ల విషయంలో బిజెపి, బిఆర్ ఎస్ కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో కలిసి ముందుకు రావాలని కూనంనేని సూచించారు. వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, వెనుకబాటుతనంలో ఉన్న కులాలను బయటికి తీసుకురావాలని ‘బిసి హక్కుల సాధనసమితి’ నాయకులకు సూచించారు. రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించాలన్నారు. బిసి రిజర్వేషన్లను సాధించే దిశగా ఉద్యమ కార్యా చరణను రూపొందించాలని పిలుపు నిచ్చారు.