నేటి సత్యం నల్లగొండ నవంబర్ 6 *నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం*
*కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్*రాష్ట్ర కార్యదర్శి
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు.ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం నల్గొండ లోని మక్ధూమ్ భవన్ సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర* మాట్లాడుతూ మన దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. అటు ప్రభుత్వ రంగం నుండి కొత్త ఉద్యోగ ప్రకటనలు తక్కువగా రావడం, ఇటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం, ఈ రెండు కలసి ఒక కుంభమేళం లాగా నిరుద్యోగాన్ని పెంచిపెడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నియామక ప్రక్రియలు చాలా నెమ్మదిగా జరగడం, గ్రూప్ పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి అలస్యం అవుతుండగా, నియామకాల్లో తారతమ్యాలు, కోర్టుల స్టేలు, రాజకీయ ప్రతిస్పందనలు మరింత కల్లోలం సృష్టిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యువత తమ జీవిత భద్రతపై ఆశను కోల్పోతున్నారన్నారు. రాబోయే 10-20ఏళ్లలో మనం తీవ్ర సంక్షోభాన్ని, సామాజిక అసమతుల్యతను ఎదుర్కొవల్సి వస్తుందని. దీనికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయాలన్న చొరవ పాలకుల నుండి కనిపించడం లేదన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు వేగవంతం చేయాలని, ఖాళీలను నిబంధనలతో నింపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. నిరుద్యోగ యువతకు నిరంతరం ధైర్యం ఇచ్చేవిధంగా ప్రభుత్వ రంగం ముందుకు రావాలని,. ప్రైవేట్ రంగానికి నిబంధనలు విధించాలని, ఉద్యోగుల తొలగింపుల విషయంలో కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలన్నారు.. కర్మాగారాలు, సంస్థలు తమ సామాజిక బాధ్యతను గుర్తించాలి. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఆర్థిక మద్దతు లేదా స్వయం ఉపాధి యోజనాల ద్వారా భరోసా కల్పించాలన్నారు. నవతరానికి సామాజిక భద్రత, పెన్షన్, ఆరోగ్యబీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు మద్దతు ఇవ్వడం ద్వారా వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని అన్నారు. ఈ మార్గాల్లో చర్యలు తీసుకోకపోతే రేపటి సమాజం ఘోరసంక్షోభాన్ని ఎదుర్కొవలసి వస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, సామాన్యుల జీవన పరిస్థితులను దేశ వ్యాప్తంగా దుర్భర స్థితికి మార్చిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని వారు దుయ్యబట్టారు
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి బూడిద సురేష్, తీర్పరి వేంకటేశ్వర్లు*. లు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కల్పన కేంద్రాలు నామమాత్రంగా వ్యవహరిస్తోందని, ఉపాధికి అవసరమయ్యే నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యలపై సర్వేలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ నవీన్ అన్నమల్ల,మల్లేష్, గడ్డం నవీన్, మహేందర్, దశరథ, కట్కూరి లింగస్వామి,నేతల నరేష్,రాజు, గోపగోని ఉదయ్, అక్కలయ్య,బాబు తదితరులు పాల్గొన్నారు.