Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogతెలంగాణకు మద్దతిచ్చిన మావోయిస్టులు

తెలంగాణకు మద్దతిచ్చిన మావోయిస్టులు

తెలంగాణకు మద్దతిచ్చిన మావోయిస్టులు

***********************************

నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్దుపేగు బంధముంది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. రెండు వందలేళ్లకు పైగా నిజాం పాలనలో బాంచెన్ దొరా! అంటూ భూస్వాముల దౌర్జన్యాల మధ్య తెలంగాణ అరిగోస పడింది. ఆ నిజామును ఎదిరించి పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చాక తెలంగాణ పీకపై ఆంధ్రుల పెత్తనం వచ్చింది. ఆ పీడ వదిలేందుకు జనం చావో రేవో అనేదాకా వెళ్లారు. అంటే 2014 లో తెలంగాణ ఏర్పాటయ్యే దాకా స్వీయ పాలన రుచి తెలియకుండానే తెలంగాణ తరాలు భూమిలో కలిసిపోయాయి. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరు చరిత్రాత్మకమైనది. అది ఎన్నో అధ్యాయాలతో కూడిన గ్రంథం లాంటిది. విప్లవమంటూ తుపాకీ పట్టిన వారు కూడా మరో చేతితో పిడికిలెత్తి జై తెలంగాణ అంటూ ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రజల ఆకాంక్షను మించిన లక్ష్యం లేదని తోడు నిలిచారు. తెలుగు సమాజంలో ఉన్న విప్లవ సానుభూతిపరులు తెలంగాణ కావాలని మొదలైన ఉద్యమాలతో మమేకమయ్యారు. ఉద్యమాన్ని వివిధ రూపాల్లోకి ప్రజల్లోకి తీసికెళ్లేందుకు వీరి తోడ్పాటు పనికొచ్చింది. సాహిత్య, సాంస్కృతిక కళా రూపాల్లో ఉద్యమ అవసరం తెలిపేందుకు వీరి ఆట, పాట అడుగులేసింది. విప్లవ పాటలు పాడే వీరి బృందాలు తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ చిందులు వేశాయి.

ఆనాటి మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ 2009 ఒక పత్రికకి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని, దానిలోంచి హైదరాబాద్ ను విడదీసే కుట్ర చేయవద్దని అన్నారు. ఇది ఆ ప్రజల 50 ఏళ్ల తీరని కోరిక, వారి బతుకులతో పాటు, భాషా సంస్కృతుల సంరక్షణ ప్రత్యేక తెలంగాణతోనే సాధ్యపడుతుందని అని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 1969 లో ఎగిసిపడిన తొలి ఉద్యమంతోనే రాష్ట్ర సాధన సాధ్యమై ఉంటే అసలు తెలంగాణలో నక్సలైటు ఉద్యమమే పుట్టేది కాదేమో! కాంగ్రెస్ చేసిన ద్రోహం యువత ఆగ్రహానికి ఆజ్యం అయింది. రాష్ట్రం ఇవ్వకుండా పోలీసులను ఎగదోసి మూడు వందల మంది ప్రాణాలను బలిగొన్న దాష్టికం తెలంగాణ బిడ్డలను మరో పోరుబాట వైపు చూసేలా చేసింది. చదివినా ఉద్యోగాలు రాని దశలో, ఇక రాష్ట్రం రాదనే నైరాశ్యంలో చిక్కుకున్న తెలంగాణ యువత నక్సలైటు సిద్ధాంతానికి ఆకర్శితమైంది. తొలి ఉద్యమంలో పాల్గొన్న ఇరువై ఏళ్ల లోపు యువకులు కొందరు తెలంగాణలో నక్సలైటు ఉద్యమానికి ద్వారాలు తెరిచారు. ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో ఆ ఉద్యమ నిర్మాణానికి వారు కార్యకర్తలయ్యారు. అలా సాయుధమార్గంలోని వెళ్లిన ఒక్కొక్కరు సుమారు నలుబై, యాభై ఏళ్ల తమ జీవితాన్ని ఆ పోరు బాటకే అర్పించారు. అదే సిద్ధాంతాన్ని నమ్మి అడవిలో జీవనం గడిపారు. ఇప్పుడు కేంద్ర బలగాలు వెదికి, వేటాడి చంపుతుంటే.. చచ్చేవారు చస్తున్నారు, లొంగుబాట దొరికినవారు బతికిపోతున్నారు.

1970 దశకంలో నక్సలైట్లుగా మారిన తెలంగాణ బిడ్డలు సుమారు 50 ఏళ్లుగా సాగుతున్న ఈ పోరుకు సారథ్యం వహిస్తున్నారు. చివరి దశలో దండకారణ్యం కేంద్రంగా సాగిన మావోయిస్టు ఉద్యమంలో స్థానిక గిరిజన యువత సైన్యం కాగా నాయక స్థాయిలో మాత్రం తెలంగాణ కు చెందిన సీనియర్లే ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా, బీర్ పూర్ గ్రామానికి చెందిన ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సి పి ఐ (మావోయిస్టు) పార్టీకి సెక్రెటరీ జనరల్ గా 2018 దాకా కొనసాగారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న ఈయన వయసు 76 ఏళ్లు. పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు. ఈయన 2011 లో పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. వీరిరువురు తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు ఆనాటి వారి సన్నిహితులు చెబుతుంటారు. 1969 లోనే తెలంగాణ సాధ్యపడి ఉంటే గణపతి తన టీచర్ ఉద్యోగాన్ని వదిలి పెట్టేవాడు కాదేమో! అదే విధంగా కిషన్ జీ న్యాయ విద్యను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేసి మంచి వకీలుగా మారేవారేమో! ఇలా 1969 లో తెలంగాణకు జరిగిన నష్టం ఆనాటి ఒక తరాన్ని అతలాకుతలం చేసిందని చెప్పవచ్చు.

అజ్ఞాత మావోయిస్టుల మద్దతుయే కాకుండా కాలక్రమంగా జన జీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లలో ఎంతో మంది మలి తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. వారి ఉద్యమ జీవితం, ఉద్యమం నడిపిన అనుభవం, నాయకత్వ పటిమ తెలంగాణ సాధనకు ఊతమిచ్చాయి. నక్సలైటు ఉద్యమానికి సాంస్కృతిక సేనానిగా పని చేసిన గద్దర్ 2010 లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కు అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ సాధనకు పనిచేస్తున్న అన్ని సంఘాలను ఏకం చేయడమే ఫ్రంట్ లక్ష్యం అని చెప్పారు. విప్లవోద్యమాన్ని వదిలేసి వచ్చిన వారు రాష్ట్ర సాధనలో పాల్గొని, భారాస లో చేరి పాలనలోనూ భాగమయ్యారు. కొందరు ప్రభుత్వ నియామక పదవుల్లోనూ కొనసాగారు. కె సి ఆర్ ప్రభుత్వంలో మాజీలకు ఎం ఎల్ ఏ, ఎం ఎల్ సి, మంత్రి స్థాయి పదవులు కూడా లభించాయి.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మావోయిస్టుల మద్దతుపై రకరకాల కథనాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల అణచివేతను తట్టుకోలేక 2012 నాటికి మావోయిస్టులు తెలుగునేలను వదిలేశారు. ఛత్తీస్ గడ్ కేంద్రంగా అడవిలో బతుకులీడుస్తున్న వారికి కొత్తగా వచ్చే తెలంగాణ రాష్ట్రం తిరిగి ఆశ్రయం ఇస్తుందని వారు ఆశించారు. ఎప్పటిలా తమ ఉద్యమాన్ని పునర్నిర్మించుకోవచ్చని అనుకున్నారని కొందరు విశ్లేషకుల వాదన. తెలంగాణను విడదీస్తే అక్కడ మళ్ళీ నక్సల్ సమస్య మొదలవుతుందని 2012 -14 లో కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే అన్నారు. 2010 లో ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రం ఇస్తే ఇక్కడ మళ్ళీ వామపక్ష తీవ్రవాదం విచ్చుకుంటుందని రిపోర్టులో పేర్కొంది.అయితే తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల మూలంగా ప్రజలకు ఉద్యమాల అవసరం రాలేదు. కొందరు ఊహించినట్లుగా ఇక్కడి ప్రజలు తిరిగి నక్సల్ వైపు చూడలేదు

పోరు గడ్డగా పేరు పొందిన తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంది. స్వీయపాలన సాధించింది. పరిస్థితులు అనుకూలించక లొంగిపోతున్నామంటున్న మావోయిస్టులు ప్రజలకు ఏదో రూపంలో తోడు ఉంటామంటు న్నారు. కొత్త రాష్ట్రం పునర్నిర్మాణం దశలో తెలంగాణకు వారి అవసరం ఉంది. తొలి దశ తెలంగాణ ఉద్యమం వారికి ప్రజాజీవన ప్రస్థానం నేర్పితే సాకారమైన తెలంగాణ వారికి తోడు నిలవాలి. ఆయుధాలు వద్దు అంటున్నవారికి పునరావాస హామీని ఇయ్యాలి. వారు ఏం చేసినా సామాన్యుని, కష్టజీవి బతుకు మార్చాలనుకున్నారు. తెలంగాణ వారి ఇల్లు, వారు మనతోనే ఉండేలా ప్రభుత్వం సాయపడoడి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments