నేటి సత్యం హైదరాబాద్ జూన్ 24
దేశంలో కమ్యూనిజానిదే భవిష్యత్తు
భారతదేశంలో నిర్బంధాలను ఎదుర్కోని నిలబడ్డ చరిత్ర సిపిఐ ది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు పెట్టుబడిదారీ విఫలమవుతూ కమ్యూనిస్టు అనుకూల శక్తులు పెరుగుతున్న దశలో అసమానతలు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా రానున్న రోజులలో కమ్యూనిజానికి మాత్రమే భవిష్యత్తు ఉండనున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈరోజు హైదరాబాద్, నాగోల్ లోని గిరి ప్రసాద్ భవన్ లో జరిగిన సూర్యాపేట జిల్లా సమితి సభ్యుల రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆకలి చావులు, పేద, దనికుల వ్యత్యాసం భారీగా పెరిగిపోతున్నదని, మరోవైపు
దేశంలో ఆధాని, అంబానీల గణనీయంగా సంపద పెరిగిందన్నారు. ప్రపంచ ఆకలి సూచీలో 2014లో 55వ స్థానంలో ఉన్న భారతదేశం 2025లో 102 స్థానానికి పడిపోయిందని 2014లో సుమారు 53 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ అప్పు 2025 -26 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 197 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని, ఇంత భారీ అప్పు భారత దేశ ప్రజల మీద మోపబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు రోజు రోజుకు అన్ని రకాల ధరలూ ఆకాన్నంటి పేద, మధ్య తరగతి ప్రజలకు అందనంత దూరంలో ఉంటున్నాయి. వీటికి తోడు మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు బీజేపీ పాలనలో పెరిగిపోతున్నాయి. మహిళలతో పాటు మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు పెరిగి పోయాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే వీరిపై దాడులు పెరగడం చూస్తున్నామని ఆయన అన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో అణగారిన వర్గాల ప్రజలు నిమ్న వర్గాల ప్రజలు, మహిళలు, కార్మికులు, రైతులు, యువత కమ్యూనిస్టుల వైపు, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా యువత, ప్రజలు వివిధ దేశాలలో కమ్యూనిస్టుల వైపు చూస్తున్నారు. శ్రీలంకలో కమ్యూనిస్టు నాయకుడిని ఆదరించిన ప్రజలు దేశాధినేతగా ఎన్నుకున్నారని అలాగే నేపాల్ లో ఐక్యమైన కమ్యూనిస్టు పార్టీలు రాజ్యాధికారమే లక్ష్యంగా నిలబడ్డాయని వారు తెలిపారు. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ పాలనలో చైనా ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది. ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. ఇక ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తున్న ట్రంప్ పాలనలో కూడా న్యూయార్క్ నగరంలో సోషలిస్టు అభ్యర్థి మేయర్ గా మంమ్దాని గెలుపొందారని ఈ పరిస్థితులలో మన దేశంలోనూ కమ్యూనిస్టులకే భవిష్యత్తు ఉంటుందని వామపక్ష శ్రేయోభిలాషులు బలంగా నమ్ముతున్నారని సాంబశివరావు అన్నారు. కేంద్రంలో ఈవీఎంల మాయాజాలంతోనే మూడవసారి ప్రధానిగా మోడీ ఎన్నికయ్యారని, భారతదేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని వారు కోరారు. ఈ క్రమంలో భారత దేశంలో వందేళ్ల క్రితం ఆవిర్భవించి నాటి నుండి నేటి వరకూ అనేక నిర్భంధాలను తట్టుకుని నిలబడిన భారత కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.