Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష..

ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష..

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 24

ప్రజాస్వామ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష?

డా. కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అంతిమ రాజకీయ లక్ష్యం క్రమంగా రాజకీయ వ్యవస్థనే నిర్వీర్యం చేయడమేననే అనుమానాలు తాజా పరిణామాలు కలిగిస్తున్నాయి. రాజకీయ వ్యవస్థ పవిత్రమైనది. జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంత విశిష్టమో, ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ కూడా అంతే కీలకమైనది. రాజకీయ వ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు.

నేటి పరిణామాలను గమనిస్తే, స్థిరంగా ఉన్న రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావన కలుగుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల వ్యవస్థ పునాది కాగా, దానికి న్యాయవ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థలు అండగా నిలవాలి. అయితే అవి తమ బాధ్యతలను స్వతంత్రంగా, సమర్థంగా నిర్వర్తించే పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అలాంటి అనుమానాలకు ఆధారంగా నిలిచే సంఘటనలు అనేకం ఉన్నాయి. అందులో తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా జరిగిన పరిణామాలు కూడా ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఎన్నికైన ప్రజాప్రతినిధులను వారి పార్టీల నుంచి ఫిరాయింపులకు ప్రోత్సహించడం నేటి రాజకీయాల్లో సాధారణంగా మారింది. కొత్తగా వివాహమైన వధూవరులు శోభన గదిలోకి వెళ్లే సమయంలో వధువును అపహరించినట్లుగా, ఎన్నికైన ప్రతినిధులను పార్టీలు మారేలా చేసి, ఆ తర్వాత వాటికి చట్టబద్ధత కల్పించడం ద్వారా రాజకీయ పార్టీల ఉనికినే దెబ్బతీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది “మోదీ–షా” రాజకీయాలకు ఒక సాధనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ధోరణి కొనసాగితే, ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాన్ని ప్రశ్నించే వ్యక్తులు, రాజకీయ పార్టీలు, సామాజిక శక్తులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో స్పష్టమవుతోంది.

ఇదే క్రమం కొనసాగితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక అగ్నిపరీక్షగా మారుతుంది. చివరికి ఇది పురాణాల్లోని భస్మాసురుడి కథలా, తనను తాను నాశనం చేసుకునే పరిస్థితికి దారితీయవచ్చు.

ఇలాంటి ప్రక్రియలో బీజేపీ కూడా శాశ్వతంగా మినహాయింపు పొందలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మనోభావాలకు, ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అతీతంగా ఉండలేదు, ఉండలేను. బీజేపీ నాయకత్వం ఈ వాస్తవాన్ని గుర్తించినా, మోదీ–షా ద్వయం అలాంటి ఆత్మపరిశీలనకు సిద్ధపడతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

“పార్టీ రహిత ప్రజాస్వామ్యం” అనే బూటకపు నినాదంతో వ్యక్తులను వ్యవస్థల కంటే పై స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగితే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే రాజకీయ వ్యవస్థనే బలహీనపరిచే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే, చివరికి బీజేపీ కూడా అదే ప్రక్రియకు బలికాక తప్పదు.

అంతిమంగా, ఇది రాజకీయ భస్మాసుర హస్తంగా మారి ప్రజాస్వామ్యాన్నే కాదు, దానిని బలహీనపరిచే శక్తులనూ మింగివేయదా అనే ప్రశ్న ప్రతి ప్రజాస్వామ్యవాదిని ఆలోచింపజేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments