నేటి సత్యం జూలై 3
సమస్య కాదు… మనిషిని చంపేది ఊహే !
మనం చదువుకునే నవలల్లోనో, చూసే సినిమాల్లోనో కాదు .అచ్చంగా మన జీవిత రంగస్థలంపై ప్రతిరోజూ నడిచే అసలు సిసలైన హైడ్రామా ఇది! మనిషి జీవితంలో సమస్యలు రావడం అనేది ఆకాశంలో మబ్బులు కమ్మడం లాంటి అత్యంత సహజమైన ప్రక్రియ. అమ్మ కడుపు నుంచి భూమిపై పడ్డ మొదటి క్షణం నుంచి, శ్మశాన వాటికకు చేరే ఆఖరి ప్రయాణం వరకు ఏదో ఒక సమస్య మనిషిని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల సుడిగుండాలు, కుటుంబ కలహాల చదరంగం, కార్పొరేట్ కొలువుల ఒత్తిళ్లు, గుండెను పిండేసే ప్రేమ వైఫల్యాలు, పడకన పడేసే ఆరోగ్య సమస్యలు ఇలా రంగులు మారుస్తూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవి అలిఖిత భాగాలుగా మారిపోయాయి.కానీ, ఒక్క క్షణం గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. నిజంగా మనిషిని నిలువునా కుంగదీసేది, కుదేలు చేసేది, ఆఖరికి కన్నవారిని అనాథలను చేస్తూ ఆత్మహత్యల వైపు నడిపించేది ఆయా సమస్యలేనా? ఈ మానసిక కల్లోలాన్ని కాస్త లోతుగా, విశ్లేషించి చూస్తే తేలే నగ్నసత్యం ఒక్కటే మనిషిని నిజంగా ఊపిరాడకుండా చంపేది సమస్య కాదు! ఆ సమస్య చుట్టూ అతడు స్వయంగా అల్లుకునే భీతి గొలిపే ఊహల సామ్రాజ్యం మాత్రమే.
వాస్తవానికి సమస్య అనేది ఒక భౌతిక రూపం. అది వాస్తవంగా జరిగిన లేదా ప్రస్తుతం మీ కళ్లముందు జరుగుతున్న ఒకానొక సంక్లిష్ట పరిస్థితి మాత్రమే. కానీ ఆ చేదు పరిస్థితిని మనిషి తన మనోఫలకంపై ఎలా ముద్రించుకుంటున్నాడు, దానికి ఎంతటి భయానక రూపాన్ని ఇస్తున్నాడు అనేది పూర్తిగా అతని ఊహాశక్తిపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక విద్యార్థికి సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనుకుందాం. ఇది కేవలం ఒక తాత్కాలిక సమస్య. కానీ ఆ విద్యార్థి మనసులో నేను వేస్ట్గాడిని, జీవితంలో ఎందుకూ పనికిరాను నా పేరెంట్స్ నన్ను ఛీత్కరించుకుంటారు,నా కెరీర్ ఇక అంధకారమే అనే ఊహాగానాలు, నెగెటివ్ థాట్స్ కనుక స్టార్ట్ అయితే ఆ చిన్న సమస్య కాస్తా అతని మనసులో ఒక హిమాలయ పర్వతమంత పెద్దదిగా మారిపోతుంది. ఇక్కడ గమనించాల్సిన గ్లామరస్ ట్విస్ట్ ఏంటంటే వాస్తవానికి ఆ మార్కుల వెనుక ఉన్న ప్రాక్టికల్ నిజం వేరు, అతని తలలో మెదులుతున్న హారర్ సినిమా లాంటి ఊహ వేరు!మానవ మెదడు ఒక అద్భుతమైన సూపర్ కంప్యూటర్. కానీ దానికి ఒక వింత అలవాటు ఉంది. అది ఏదైనా నెగెటివ్ సంఘటనను జరిగినట్టుగా ప్రశాంతంగా దాచుకోదు. దానికి రకరకాల మిరపపొడి, మసాలాలు దట్టించి సొంత వ్యాఖ్యానాలను జోడిస్తుంది. ఒక్కసారి మన మనసులో ప్రతికూల ఊహల బీజం పడిందా, ఇక మన బ్రెయిన్ దానికి తగిన అబద్ధపు ఆధారాలను వెతకడం మొదలుపెడుతుంది.ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు.నేను పూర్తిగా ఒంటరినైపోయాను .ఇక ఈ నరకం నుంచి బయటపడే మార్గమే లేదు .ఇలాంటి డిప్రెసివ్ ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి గొలుసుకట్టుగా వచ్చి మనల్ని చుట్టుముట్టేస్తాయి. సైకాలజీ భాషలో దీనిని క్యాటాస్ట్రఫైజింగ్ అని పిలుస్తారు. అంటే చిన్న రై ఆవగింజంత సమస్యను తాటికాయంత తీవ్రమైనదిగా ఊహించుకుని సెల్ఫ్-డిస్ట్రక్షన్ మోడ్‌లోకి వెళ్లడం. ఈ ప్రమాదకరమైన ధోరణి మనిషిని ప్రాక్టికల్ ప్రపంచం నుండి దూరం చేసి, తన ఊహాజనిత నరకంలోకి లాగేస్తుంది.నేడు మనం ఉదయం లేవగానే వార్తాపత్రికల్లో, సోషల్ మీడియా స్క్రీన్లపై చూసే గుండెతరుక్కుపోయే ఆత్మహత్యల వెనుక ఈ వినాశకర ఊహల పాత్రే సింహభాగం ఉంటోంది. ఎగ్జామ్స్ తప్పుతామనే భయంతో విద్యార్థులు, బ్రేకప్స్ భరించలేక యువతీయువకులు, అప్పుల ఊబిలో చిక్కుకుని బిజినెస్‌మెన్స్… వీరందరి విషాద గాథల్లో కామన్‌గా కనిపించే ఒకే ఒక్క పెయిన్ఫుల్ పాయింట్ , సమస్యకు అసలు పరిష్కారమే లేదు అని వారు బలంగా నమ్మేయడం! వాస్తవానికి ప్రతి లాక్కు ఒక కీ ఉన్నట్టే, ప్రతి సమస్యకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఉంటుంది. కానీ తీవ్రమైన ఎమోషనల్ ఒత్తిడిలో ఉన్న మైండ్, ఆ చిన్న లాజిక్‌ను చూడనివ్వదు. ఇక అంతా అయిపోయింది, క్లోజ్ అనే ఊహల వలలో చిక్కుకుపోయి చీకటి నిర్ణయాల వైపు అడుగులు వేయిస్తుంది.ఈ మైండ్ గేమ్ నుంచి, ఊహాచక్రం నుంచి క్షేమంగా బయటపడాలంటే మనం కొన్ని లైఫ్ స్టైల్ సూత్రాలను అలవర్చుకోవాలి.ఒక డైరీ తీసుకుని బుక్ మధ్యలో గీత గీయండి. ఒకవైపు ఇది నిజంగా జరిగిన వాస్తవం అని, మరోవైపు దీని గురించి నేను భయపడుతున్న ఊహ అని రాసి చూడండి. మీ ఊహ ఎంత అతిశయోక్తిగా ఉందో మీకే మైండ్ బ్లోయింగ్ క్లారిటీ వస్తుంది. గుండె గదిలో ప్రతికూల ఆలోచనలను దాచి కుళ్ళబెట్టకండి. నమ్మకమైన స్నేహితుడితోనో, కుటుంబ సభ్యులతోనో షేర్ చేసుకోండి. మాటల ద్వారా ఊహల తీవ్రత కరిగిపోయి, వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. అవసరమైతే సైకాలజిస్ట్‌లను సంప్రదించడంలో ఎలాంటి మొహమాటం, సిగ్గు పడాల్సిన అవసరం లేదు. అది మీ మానసిక ఫిట్‌నెస్‌కు సంబంధించింది.వ్యక్తిగత ప్రయత్నాలతో పాటు మన ఫ్యామిలీస్, స్కూల్స్ మరియు సొసైటీ కూడా తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవాలి. పిల్లలు తప్పులు చేసినప్పుడు లేదా ఫెయిల్ అయినప్పుడు వారిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడం మానేయాలి. ఒక్క పరీక్ష తప్పితే జీవితం ముగిసిపోదురా బుజ్జీ నీ వెనుక మేమున్నాం అనే భరోసాను, కొండంత అండను చిన్నప్పటి నుంచే వారి నరనరాల్లో నూరిపోయాలి. నేటి కార్పొరేట్ విద్యాసంస్థల్లో మార్కుల వేట కంటే, లైఫ్ స్కిల్స్ మరియు మానసిక దృఢత్వాన్ని పెంపొందించే స్పెషల్ కౌన్సెలింగ్ సెషన్స్ అత్యంత కీలకం.బాటమ్ లైన్ ఏంటంటే ఈ అందమైన జీవితంలో సమస్యలు రాకుండా ఏ దేవుడూ ఆపలేడు. కానీ ఆ సమస్యల చుట్టూ మనం అల్లుకునే భయాందోళనల ఊహలను అదుపులో పెట్టుకోవడం నూటికి నూరు శాతం మన చేతుల్లోనే ఉంది. సమస్య అనేది ఆకాశంలో వచ్చిపోయే ఒక తాత్కాలిక నల్లటి మబ్బు మాత్రమే, అది ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ దాని గురించి మనం ఏర్పరచుకునే నెగెటివ్ నమ్మకమే మనిషిని లోలోపలే దహించివేస్తుంది. కాబట్టి, సమస్య ఎంతటిదైనా, దానికి ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది అనే పాజిటివ్ ఆప్టిమిజాన్ని లైఫ్ గార్డ్‌గా మార్చుకుందాం. గుర్తుంచుకోండి .మనిషిని ఎప్పుడూ కాపాడేది ధైర్యం మరియు వాస్తవికత మాత్రమే, మనిషిని నిలువునా చంపేది భయం నిండిన ఊహ మాత్రమే!
డా .సూర్యదేవర రామకృష్ణ ,
9490754169.