నేటి సత్యం/ శేరిలింగంపల్లి /అక్టోబర్ 30
మియాపూర్ సర్వే నంబర్లు 100, 101 ప్రభుత్వ భూములు
పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
సీపీఐ డిమాండ్
మియాపూర్ సర్వే నంబర్లు 100, 101కు సంబంధించిన భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఆ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని పేద ప్రజల సంక్షేమానికి వినియోగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) డిమాండ్ చేస్తోంది.
హైదరాబాద్ నగరంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వేలాది మంది పేదలు సొంత ఇల్లు లేక, అద్దె ఇళ్లలో ఉంటూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ భూములు పేదల అవసరాలకు ఉపయోగపడాల్సిందే తప్ప, ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు ఉపయోగపడకూడదు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సుమారు 550 ఎకరాల 39 గుంటల భూమిని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. అర్హులైన నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలి.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల హామీలను అమలు చేయాలి. భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే, పేదలకు న్యాయంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా చేపట్టాలి.
లేనిపక్షంలో పేద ప్రజలను సమీకరించి సీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహిస్తాం.పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.
**టి. రామకృష్ణ**
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు
సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి