నేటి సత్యం ఏప్రిల్ 16* నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపుతో మారనున్న రాజకీయ దృశ్యం!
నేడే పార్లమెంట్‌కు బిల్లులు
న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టే రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పేర్కొంటున్నట్లుగా లోక్‌సభలో సీట్ల సంఖ్యను 850కి పెంచి, 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన చేసి సీట్లను కేటాయించినట్లైతే భారతదేశ రాజకీయ మ్యాప్ చాలా మార్పులకు లోనవుతుంది. ప్రధానంగా ఉత్తర భారతంలోని హిందీ మాట్లాడే రాష్ట్రాలు లబ్ది పొందుతాయి. మరోవైపు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువ సీట్లను కోల్పోయే ప్రమాదం వుంది.
గురువారం నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా మూడు అంశాలు చోటు చేసుకోనున్నాయి. 1) లోక్‌సభ స్థానాలను 543నుండి 850కి పెంచడం (వీటిలో రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35). 2) సీట్ల కేటాయింపును 1971నాటి జనాభా లెక్కలతో ముడిపెట్టిన రాజ్యాంగపరమైన స్తంభనను తొలగించి ఆ స్థానంలో సాధారణ చట్టం ద్వారా జనాభా లెక్కలను ప్రాతిపదికగా ఎంచుకునేందుకు పార్లమెంట్‌ను అనుమతించే ఒక ఫార్ములాను ప్రవేశపెడుతుంది. 3) తాజాగా ప్రచురితమైన జనాభా లెక్కలు అంటే 2011 జనగణను ఉపయోగించు కునేలా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను నియమిస్తుంది. ఆ కమిషన్ సరిహద్దులను పునర్నిర్విచించి, సీట్లను తిరిగి కేటాయిస్తుంది. నారీ శక్తి వందన్ అభియాన్, 2023 కింద మహిళా రిజర్వేషన్‌ను అమల్లోకి తీసుకురావడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది. ‘ప్రొ రేటా బేసిస్’ పై దక్షిణాది రాష్ట్రాలు ఒక్క సీటును కూడా కోల్పోవని గతేడాది ఫిబ్రవరిలోనే హోం మంత్రి అమిత్ షా కోయంబత్తూరులో చెప్పారు. ‘దేశవ్యాప్తంగా దామాషా పెరుగుదల వుంటుంద’ంటూ దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలన్నీ సిల్లీగా వున్నాయని ఈ నెల 13న వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా వ్యాఖ్యానించారు.
అయితే, ప్రస్తుతమున్న సీట్ల నిష్పత్తులకు హామీ కల్పించే యంత్రాంగమేదీ బిల్లుల్లో లేదు. జనాభా నిష్పత్తికి తగినట్లుగా సీట్ల కేటాయింపు వుంటుందని, ఒకేరీతిన శాతం పెంపు వుండ దని పేర్కొంటున్న 81(2)(ఎ) అధికరణ ఎలాంటి మార్పులకు లోనవడం లేదు. తాజాగా అందుబాటులో వున్న జనాభా లెక్కలంటే 2011 నాటి జనగణన ఆధారంగా నియోజవకర్గాల పునర్విభజన జరగబోతోంది.
ఎవరికి లాభం, ఎవరికి నష్టం
దామాషా పెరుగుదలతో పోలిస్తే అత్యధికంగా సీట్లు లాభ పడేది ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు. అవి ఉత్తర ప్రదేశ్ (13), బీహార్ (10), రాజస్థాన్ (8), ఢిల్లీ (5), మధ్య ప్రదేశ్ (5). ఇవన్నీ హిందీ భాషా రాష్ట్రాలే.అధికంగా సీట్లు కోల్పోయే ఐదు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో తమిళనాడు (-11), కేరళ(-8 ), ఆంధ్రప్రదేశ్ (-5 ), ఒరిస్సా (-3), దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ (-3 ). వున్నాయి. వీటిలో నాలుగు దక్షిణ లేదా తూర్పు ప్రాంతంలో వున్నాయి.
ప్రాంతీయ దృశ్యం
ప్రాంతాలవారీగా చూసినపుడు ఈ నమూనా లేదా ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 850సీట్లు గల లోక్‌సభలో హిందీ భాషా రాష్ట్రాల (యుపి, ఎంపి, బీహార్, రాజస్థాన్, హర్యానా, చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ) వాటా 38.1శాతం నుండి 43.1శాతానికి పెరుగుతుంది. అంటే ఐదు పర్సంటేజ్ పాయింట్లు పెరుగుతాయి. అదే సమయంలో దక్షిణాది వాట 24.3 శాతం నుండి 20.7శాతానికి పడిపోతుంది. అంటే 3.6పర్సంటేజ్ పాయింట్లు తగ్గుతాయి. ఇక ఈశాన్య ప్రాంత వాటా 4.4 శాతం నుండి 3.8శాతానికి పడిపోగా, తూర్పు రాష్ట్రాల వాటా 14.4శాతం నుండి 13.7శాతానికి తగ్గుతుంది. పశ్చిమ ఉత్తర ప్రాంత హిందీయేతర రాష్ట్రాల్లో ఎలాంటి మార్పు వుండదు.
ఇక సీట్ల పరంగా చెప్పాలంటే, హిందీ హార్ట్‌ల్యాండ్‌కు 159 స్థానాలు అధికంగా వస్తాయి. (ప్రస్తుతమున్న 207తో పోలిస్తే ఇది 77శాతం ఎక్కువ), అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు కేవలం 44సీట్లు అధికంగా పొందుతాయి. (ప్రస్తుతమున్న 132తో పోలిస్తే 33శాతం ఎక్కువ), ఈశాన్య ప్రాంత పెరుగుదల కూడా 33శాతంగానే వుండనుంది.
జనాభా తగ్గుదలకు తీసుకున్న చర్యలే కారణం
ఈ అసమానతలకు మూలాలు తాజా సంతానోత్పత్తి డేటాలో కనిపిస్తున్నాయి. అయిదు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సంతానోత్పత్తి రేట్లు 1.5 నుండి 1.8మధ్యనే వున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రామాణిక మార్క్ 2.1 దాటి నమోదయ్యాయి. ఆరోగ్యం, విద్య, కుటుంబ నియంత్రణ వంటి రంగాలపై నిధులు ఖర్చు చేసిన రాష్ట్రాలు పార్లమెంటరీ స్థానాలు కోల్పోతుండగా, ఈ సూచికలను ఏమాత్రమూ పట్టించుకోకుండా వ్యవహరించిన రాష్ట్రాలు అత్యధికంగా లాభాలు పొందుతున్నాయి.
తమిళనాట ప్రతి ఇంటా నల్ల జెండా ఎగరేయండి
– ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపు – డిలిమిటేషన్ పెద్ద కుట్ర అని విమర్శ
చెన్నై : నియోజకవర్గాల పునర్విభజనకు ప్రతిపాదిత సవరణను ‘కుట్ర’గా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ విమర్శించారు. పార్లమెంట్లో సవరణ బిల్లులు ప్రవేశపెట్టే రోజైన గురువారం ప్రతి ఇంట్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురవేయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపిచ్చారు. ”పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న ఈ సవరణ – నల్ల చట్టం -పట్ల మా నిరసన, వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి మా ఇళ్లలో నల్ల జెండాలు ఎగురవేస్తాం.” అని స్టాలిన్ ప్రకటించారు. పార్టీ ఎంపీలు, జిల్లా కార్యదర్శులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా ఢిల్లీతో రాష్ట్రానికి జరిగే పోటీ అని అన్నారు. తమిళనాడు అభివృద్ది చెందాలని బిజెపి కోరుకోవడం లేదని, తమిళనాడు ప్రతినిధులు చెప్పేది పార్లమెంట్లో కూడా వినాలనుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ కుట్రకు ఒక రూపమివ్వడానికే సవరణను ప్రవేశపెడుతోందన్నారు. అలాంటపుడు ఆ కుట్రను చట్టంగా ఎలా ఆమోదిస్తామని ఆయన ప్రశ్నించారు. కేవలం జనాభా ప్రాతిపదికన పునర్విభజన ఎలా చేస్తారని అన్నారు. ఆనల్ల చట్టం అమల్లోకి రాకూడదన్నది 8కోట్ల తమిళుల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ చేపట్టినందుకు ఇది శిక్షా అని ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. దేశ సంక్షేమం, సమైక్యత కోసం మేం నిలుచున్నప్పటికీ మా రాజకీయ హక్కులు లాక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఇంతకంటే దారుణం మరేదీ వుండదన్నారు.