Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions

మత్తులో ఊగుతున్న తెలంగాణ..!

నేటి సత్యం /తెలంగాణ /అక్టోబర్ 1

మత్తులో నిర్వీర్యమవుతున్న యువ శక్తి

“మరి కొంతమంది యువకులు.. ముందు యుగపు దూతలు.. అన్యాయపు పోకడలను సహించరు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు” అని మహాకవి శ్రీశ్రీ యువతను అభివర్ణించారు. కానీ నేటి పరిస్థితుల్లో ఆ యువతలో కొంత భాగం మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకుని తన భవిష్యత్తును మాత్రమే కాదు.. కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతోంది. యువతలో ఉత్సాహం, సృజనాత్మకత, ప్రశ్నించే శక్తి ఉండాలి. కానీ ఆ శక్తిని మత్తు పదార్థాలు నిర్వీర్యం చేస్తున్నాయి. గంజాయి నుంచి హెరాయిన్, కోకేన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, సింథటిక్ డ్రగ్స్ వరకు మాదకద్రవ్యాల వల విస్తరిస్తోంది. ఇది ఇక వ్యక్తిగత అలవాటు సమస్య కాదు.. ఒక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సమస్యగా మారింది. ఇటీవల భారతదేశంలో ఏఐఐఎంఎస్–ఎన్‌డీడీటీసీ నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం సుమారు 3.5 కోట్ల మంది గంజాయి ఉత్పత్తులను, 2.46 కోట్ల మంది ఓపియాయిడ్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. దేశంలో సుమారు 25 లక్షల మంది గంజాయి ఆధారిత సమస్యలతో, 77 లక్షల మంది ఓపియాయిడ్ వినియోగానికి చికిత్స అవసరమయ్యే స్థితిలో ఉన్నట్లు సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద 1,09,546 కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోంశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అదే కాలంలో దేశవ్యాప్తంగా రూ.25 వేల కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

మత్తులో ఊగుతున్న తెలంగాణ

తెలంగాణలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో ఒక సంవత్సరంలో సుమారు 2,387 ఎన్‌డీపీ ఎస్ కేసులు నమోదై, 4,682 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర వార్షిక నివేదిక ప్రకారం రూ.125.25 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి అధికారికంగా నమోదైన గణాంకాలు మాత్రమే. వాస్తవంగా అక్రమంగా సాగుతున్న వ్యాపారం ఎంత విస్తృతంగా ఉందో అంచనా వేయడం కష్టం. ఈ గణాంకాలు దేశంలోనూ, తెలంగాణలోనూ మాదకద్రవ్యాల సమస్య తీవ్రతను సూచిస్తున్నాయి. పాఠశాలల నుంచి కళాశాలల వరకు, నగరాల నుంచి గ్రామాల వరకు మత్తు పదార్థాల వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నెట్‌వర్క్‌లు, అంతర్రాష్ట్ర ముఠాలు, స్థానిక దళారులు, ఆన్‌లైన్ వేదికల ద్వారా పనిచేసే అక్రమ నెట్‌వర్క్‌లు ఈ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు అడవుల్లో గంజాయి సాగు, నగరాల్లో క్రయవిక్రయాలకే ఈ సమస్య పరిమితమై ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ పార్టీలు, కళాశాలల చుట్టూ ఏర్పడే సరఫరా నెట్‌వర్క్‌లు, ఆన్‌లైన్ మార్గాలు, కొరియర్ వ్యవస్థల ద్వారా మాదకద్రవ్యాల సరఫరా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందు వల్ల దీనిని కేవలం ఒక వ్యక్తి బలహీనతగా చూడటం సరైంది కాదు. భారీ లాభాల కోసం సాగుతున్న అక్రమ వ్యాపారం, నిరుద్యోగం, సామాజిక అసమానతలు, వినియోగ సంస్కృతి, యువతలో పెరుగుతున్న నిరాశ, ఒంటరితనం వంటి అనేక సామాజిక, ఆర్థిక అంశాలు ఈ సమస్య విస్తరణకు కారణమవుతున్నాయి. యువతను మత్తు నుంచి కాపాడా లంటే వినియోగదారుడిని మాత్రమే కాకుండా, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న మొత్తం సరఫరా వ్యవస్థను అర్థం చేసుకుని అరికట్టాల్సిన అవసరం ఉంది.

యువతే పెడ్లర్లు.. కారణాలేంటి?

డ్రగ్స్ మాఫియా వినియోగదారులను తయారు చేయడమే కాదు.. యువతను తమ వ్యాపారానికి పెడ్లర్లుగా, కొరియర్లుగా కూడా ఉపయోగించుకుంటోంది. కాలేజీ విద్యార్థులు, ఇంజినీరింగ్, ఎంబీఏ గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, కొరియర్ సిబ్బంది, చిన్న వ్యాపారులు కూడా డబ్బు ఆశతో ఈ ముఠాల వలలో చిక్కుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ చెల్లింపులు, డిజిటల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మాదకద్రవ్యాల సరఫరా సాగుతోంది.యువత డ్రగ్స్ వైపు వెళ్లడానికి ఒక్క కారణం లేదు. నిరుద్యోగం, భవిష్యత్తుపై నిరాశ, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, కుటుంబ పర్యవేక్షణ లోపం, సోషల్ మీడియాలో మత్తును గ్లామరైజ్ చేయడం, సరదాగా మొదలై అలవాటుగా మారడం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ వంటి అనేక కారణాలు ఉన్నాయి.మొదట సరదాగా మొదలైన అలవాటు చివరకు వ్యసనంగా మారుతుంది. డబ్బు కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం, అప్పులు చేయడం, అబద్ధాలు చెప్పడం నుంచి దొంగతనాలు, దాడులు, ఇతర నేరాల వరకు పరిస్థితి వెళ్లే ప్రమాదం ఉంది.

చట్టం మాత్రమే కాదు.. పరిష్కారమూ కావాలి

మాదకద్రవ్యాల నియంత్రణకు దేశంలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కఠిన నిబంధనలు కలిగి ఉంది. అక్రమ ఉత్పత్తి, కలిగి ఉండటం, విక్రయించడం, కొనుగోలు చేయడం, రవాణా చేయడం వంటి వాటికి తీవ్ర శిక్షలు ఉన్నాయి. తెలంగాణలో యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఈగిల్ ఫోర్స్, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ కలిసి పనిచేస్తున్నాయి.అయితే అరెస్టులు, కేసులు మాత్రమే సమస్యకు పూర్తి పరిష్కారం కావు. డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌లను ఛేదించాలి. చట్టాన్ని ఎంతటి వారైనా సమానంగా ఎదుర్కొనేలా అమలు చేయాలి.అదే సమయంలో యువతకు నాణ్యమైన విద్య, స్థిరమైన ఉపాధి, క్రీడా మైదానాలు, గ్రంథాలయాలు, సాంస్కృతిక వేదికలు, ఆరోగ్యకరమైన వినోద అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగం, పేదరికం, సామాజిక ఒంటరితనం వంటి మూల సమస్యలను పరిష్కరించకుండా డ్రగ్స్ సమస్యను పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు.వ్యసనానికి గురైన వారిని కేవలం నేరస్తులుగా ముద్ర వేయకుండా చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం అందించాలి. అదే సమయంలో డ్రగ్స్ వ్యాపారం వెనుక ఉన్న పెద్ద మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి.

యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ‘‘

నేటి యువతే రేపటి పౌరులు’’ అనేది కేవలం ఒక నినాదం కాదు, దేశ ప్రగతికి నాంది పలికే అక్షర సత్యం. దేశ పురోగతి ఆర్థిక సంపద కంటే కూడా అందుబాటులో ఉన్న యువ మానవ వనరులపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రస్తుత కాలంలో ఆ యువ శక్తిని అంతర్గతంగా దహించివేస్తున్న అతిపెద్ద మహమ్మారి మాదకద్రవ్యాలు. డ్రగ్స్ ప్రభావం ఒక్క వ్యక్తితో ఆగిపోక, వారి ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, సృజనాత్మకతలతో పాటు కుటుంబాల్లో కోలుకోలేని ఆవేదనను, ఆర్థిక వినాశనాన్ని నింపుతుంది. అంతేకాకుండా సమాజంలో నేరాలు పెరగడానికి, అక్రమ డబ్బు ప్రవాహానికి దారితీసి దేశ భద్రతకే ముప్పుగా మారుతుంది. సృజనాత్మ కతతో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత మత్తులో మునిగిపోతే, దేశ భవిష్యత్తే తీవ్రంగా దెబ్బతింటుంది.అందుకే మాదక ద్రవ్యాలపై పోరాటం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమగ్ర సామాజిక బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి ప్రవర్తనను గమనించాలి, విద్యాసంస్థలు సరైన అవగాహన కల్పించాలి, ప్రభుత్వం సరఫరా వ్యవస్థను కఠినంగా అణచివేయాలి. అదే సమయంలో యువత కూడా మత్తు పదార్థా లకు దూరంగా ఉంటూ తోటివారిని చైతన్యపరచాలి. యువతకు సరైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు అందిస్తే వారు దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపే శక్తిగా మారతారు. కాబట్టి, మన యువశక్తి మత్తులో బలికాకుండా చైతన్యంతో వికసించేలా ‘‘మాదకద్రవ్యాల రహిత సమాజం’’ కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాల్సిన అత్యవసర సమయం ఇది.

షేక్ బషీరుద్దీన్, 9704816603

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments