నేటి సత్యం హైదరాబాద్ అక్టోబర్ 7
హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు మందలించారా?
నిర్వాహకుల తీరుతో మానసిక ఒత్తిడికి గురైందని తండ్రి ఫిర్యాదు
హైదరాబాద్: నగరంలోని షేక్‌పేటలో ఓ యువతి హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పేరూరు గ్రామానికి చెందిన కల్పన (18) షేక్‌పేటలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ స్థానిక కళాశాలలో బీటెక్ చదువుతోంది.
కల్పన హాస్టల్లో ఉరేసుకుని మృతి చెందినట్లు సమాచారం. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హాస్టల్లో భోజనం సరిగా పెట్టడం లేదని ప్రశ్నించినందుకు నిర్వాహకులు తన కుమార్తెను మందలించారని, దీంతో ఆమె మానసిక ఒత్తిడికి గురైందని కల్పన తండ్రి రామాంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన కుమార్తె మృతికి హాస్టల్ నిర్వాహకుల వైఖరే కారణమని తండ్రి ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కల్పన మృతికి దారితీసిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.