నేటి సత్యం /అక్టోబర్ 23
విఠల్ కుటుంబానికి మళ్లీ ఫైనాన్స్ వేధింపులు?
రుణ వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ బాధితుల ఆవేదన
టీఆర్పీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఖాసింను కలిసిన కుటుంబ సభ్యులు
కామారెడ్డి అక్టోబర్ 23 నేటి సత్యం ప్రతినిధి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బస్వాయిపల్లికి చెందిన పిట్లం విఠల్ గతంలో ఫైనాన్స్ సంస్థల వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, విఠల్ మరణించి నెలన్నర రోజులు గడిచినా తమ కుటుంబానికి వేధింపులు తప్పడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మృతుడు విఠల్ తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐలు చెల్లించాలంటూ గత రెండు రోజులుగా ఫైనాన్స్ సిబ్బంది తమపై ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా, ప్రస్తుతం తాము నివసిస్తున్న ఇంటిని కూడా ఖాళీ చేయాలని చెబుతున్నారని విఠల్ భార్య అనురాధ కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ నేపథ్యంలో గురువారం బాన్సువాడ పట్టణంలో టీఆర్పీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఖాసింను బాధిత కుటుంబ సభ్యులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ఫైనాన్స్ సిబ్బంది మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఖాసిం
విఠల్ కుటుంబానికి అండగా ఉంటామని టీఆర్పీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఖాసిం తెలిపారు. ఈ విషయాన్ని తమ నాయకుడు తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు.
కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలపై సంబంధిత ఫైనాన్స్ సంస్థ స్పందన తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.