నేటి సత్యం హైదరాబాద్ మే 30మే 30
మహిళా చైతన్యంపై మాట్లాడుకుందాం రండి!` యు.వాసుకి.
మహిళా చైతన్యం అంటే ఇత్తడి, కంచు లాంటి లోహం గురించినది కాదు. అది ఒక విద్య, పరిశోధన, ఆచరణ. మహిళా హక్కులకు సంబంధించిన దృక్పథం. ‘ఆడవాళ్లు ఇలాగే ఉండాలి’ అనే అభిప్రాయాన్ని సవాలు చేసేదే మహిళా చైతన్యం. అది పురుషాధిక్యతను ధిక్కరిస్తుంది.
సాధారణంగా సినిమా చూసేందుకు వెళ్లేవారు రకరకాలైన వారుంటారు. అందిరి మనస్సుల్లోనూ ఏవేవో ఊహలు, భావాలు గజిబిజిగా గందరగోళ పరుస్తుంటాయి. వాటితో పాటు సినిమా చూస్తున్నప్పుడు అందులో ఎన్నో అంశాలు వస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరూ వారి, వారికి అత్యంత దగ్గరయిన అంశాలను మాత్రమే ఆ సినిమాలో ప్రధానంగా గమనిస్తారు. ‘నేనిప్పుడే అనుకున్నాను, ఇలాగే అవుతుంద’ని ప్రతి ఒక్కరూ ప్రకటించేస్తారు. ఎవ్వరైనా ఒక పురుషుడు భార్య అయిన రమ్యకృష్ణను పాట పాడుతూ కొరడాతో బాదుతున్నప్పుడు, ఆ దృశ్యం చూసి మన ప్రేక్షక మహాశయుడు ఆనందంతో ఉర్రూతలూగుతాడు. తనకు తెలియకనే ‘శభాష్ రజనీ…!’ అని అరిచేస్తాడు కూడా. స్త్రీలను చూడటం, వారితో మాట్లాడటం, వారితో ఆరోగ్యకరమైన స్నేహం చేయటం లాంటి అలావాట్లు లేని మనస్థితిలో ఉన్నవారు సినిమాల్లో వచ్చే అర్ధనగ్న దృశ్యాలను చూచి తమను, తాము మరిచిపతారు. పిల్లలు సినిమాల్లోని ఫైట్ ధృశ్యాలను మాత్రమే బాగా వంటపట్టించుకుంటారు. థియేటర్ నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ఇతర పిల్లలతో ఫైట్లు చేస్తుంటారు. తమ అభిమాన హీరో చూపే అర్థం, పర్థం లేని ‘సైకిళ్లను’ ప్రదర్శిస్తూ కేరింతలు కొడుతుంటారు. అయితే మహిళా ఉద్యమాలకు సంబంధించిన స్త్రీలు సినిమాలు చూస్తున్నప్పుడు తమ భావజాలానికి వ్యతిరేకమైన దృశ్యాలేమైనా అందులో
ఉన్నాయా అని కళ్లు పెద్దవి చేసి చూస్తారు. ‘ఇదేంటీ, ఎనిమిదో తరగతి అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేసేస్తున్నారు. వయస్సు రీత్యా ఎదగని, మానసికంగా వికసించని పసి అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయడం ఎంత వరకు సమంజసమని ఆ డైరెక్టర్‌ను అడగాలనిపిస్తుంది. తమ ఖాజానాలను నింపుకునేందుకు విరిసీ, విరియని వయస్సులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రేమింపచేసి ఆ దృశ్యాలను రంగు, రుచులతో తెర మీదకెక్కించే నిర్మాతలను, డైరెక్టర్లను నిలదీయాలనిపిస్తుంది.
స్త్రీ హక్కులకు వ్యతిరేకమైన వైఖరి పాశ్చాత్య దేశాల నుండి భారతదేశానికి దిగుమతి అయ్యిందని అనుకోకండి. మన దేశంలో వైదికయుగంలో గార్గి, మైత్రేయి లాంటి మునిపత్నులు వైదిక శాస్త్రాలలో నిష్ణాతులుగా ఉన్నారు. తర్కశాస్త్రంలో పురుషులను సైతం ఓడించారు. అయితే తమ భార్య మేధస్సు మునిపుంగవులకు నచ్చలేదు. అందువల్ల తమ భార్యలనే శపించిన
‘ఉదారులు’ వారు.
ఒక సినిమా మొత్తం దౌర్జన్యాలతో, హింసా దృశ్యాలతో, రక్తపు ప్రవాహాలతో ఉన్నా, జుగుప్స కలిగించే నగ్న దృశ్యాలతోనూ, భంగిమలతోనూ, రెండర్థాల సంభాషణల తో ఉన్నా మన గౌరవనీయులైన సెన్సార్ బోర్డు సభ్యులకు అదేమి కనికట్టో గానీ కనబడనే కనపడవు. అయితే చిత్రం చివరలో హీరో ‘ఇందుకే నేను మొదట్నుంచీ హింసా చర్యలు పనికిరావు అహింసను పాటించాలని చెబుతున్నాను’ అన్న వాక్యంతో సినిమా ముగియగానే మన సెన్సార్ బోర్డు సభ్యులు ‘ఆహా ఇదే కదా కథల్లో నీతి’ అంటూ పులకించి పోయి ‘యు’ సర్టిఫికేట్(అందరూ చూడదగ్గది) ఇచ్చేస్తారు. మొత్తంలో ఏ సినిమానైనా వీక్షకులు వారి, వారి సొంత అభిరుచులతోనూ, అభిప్రాయాలతోనే చూస్తారు.
ఇలాగే మహిళా చైతన్యం కూడా పలువురు పలు రకాలుగా అర్థం చేసుకున్నారు. దీన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. మరికొందరు గట్టిగా సమర్ధిస్తారు. సాధారణంగా జనం దీన్ని తమ వద్దకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. మరీ చెప్పాలంటే ‘తిట్టుపదాలు’తో దీన్ని కూడా ఇంచు, మించు చేర్చేశారు. విచారించాల్సిన విషయం ఏమిటంటే అధిక సంఖ్యాకుల స్త్రీలకే ఈ పదం తెలీదు.
సరిపడుతుందా…?
1848వ సంవత్సరంలో అమెరికాలో బానిసవ్యవస్థకు ప్రతిఘటనోద్యమం సాగింది. ఆ సందర్భంలో అమెరికాలో ప్రపథమంగా జరిగిన మహిళా మహాసభ మహిళల హక్కులకు సంబంధించి కొన్ని డిమాండ్లు దేశం ముందుంచింది. మహిళలందరికీ ఓటుహక్కు కోరింది. కానీ 1928వ సంవత్సరానికి వారి కోరిక నెరవేరింది.
‘అన్నీ సరేనండి….! అయితే మా అమ్మాయికి, నా భార్యకు ఇది సరిపడదండి…! సంసారం చేసుకునే వాళ్లకు ఇదెక్కడైనా సరిపడు తుందాండి…!’ అని కొందరు ప్రశ్నిస్తారు.
(‘మరండీ, అంటే మేమందరం సంసారాలు చేసుకోవడం లేదా…? కంపెనీలా నడుతున్నాం….?’)
మహిళా చైతన్యం గురించి ఒక పెద్ద మÖఢనమ్మకమిది. ఒక సాధారణ స్త్రీ, సంసార పక్షంగా ఉన్న మహిళ స్త్రీ హక్కుల గురించి మాట్లాడజాలదు అని వాదించడమే దీనర్థం. అనేక సినిమాలూ ఈ భావాన్నే చూపరుల బుర్రల్లో ఎక్కించున్నాయి. ఆ విధంగా ఆ నిర్మాతలు, డైరెక్టర్లు ‘మహత్తర సామాజిక సేవ’ చేస్తున్నారు. మనం చూసే చలన చిత్రాల్లో మహిళా హక్కుల గురించి మాట్లాడే స్త్రీలు ఉన్నత కుటుంబాలకు చెందిన వారుగా, సంపన్నులుగా, పనీపాట్లు చేసేందుకు పని మనుషులున్న వారుగా, ఉబుసు పోక కబుర్లాడే వారుగా, భర్తను వదిలేసిన వారుగా, అవివాహితులుగా, విడాకులు తీసుకున్న వారుగా, మొత్తంలో తమకంటూ సొంత కుటుంబమే లేని వారుగా మనకు కనిపిస్తారు. సినీ నిర్మాతలు మహిళా హక్కులను ఇంత చులకనగా చూస్తారు. ఆ సినిమాను చూసే మహిళలు కూడా అది మనకు పనికి రాదనే నిర్ణయానికి వచ్చేస్తారు.
మరోపక్క ‘ఓీవ , మీరు స్త్రీ స్వాతంత్య్రం బృందం వారా…? అయితే మేం జాగ్రత్తగానే ఉండాలండి’ అని కొందరు పురుషులు లేని భయం నటిస్తారు. అనగా మహిళాసంఘ నాయకులంటే పురుషులను ద్వేషించే వారు, మగవారితో కొట్లాడేవారని అనుకుంటారు.
‘అదే, అది మీరేనా…? మిమ్మల్ని చూస్తే అలాగనిపించలేదే…!’ అంటూ కొందరు ఆశ్చర్యపడిపోతారు. దీనిర్థమేంమిటీ…? స్త్రీ చైతన్యం మాట్లాడే వారు మిక్కిలి ప్రత్యేకంగా ఉంటారు. టపీమని నవ్వరు, ముచ్చులాగా, కఠినంగా ఉంటారు (అదృష్టవశాత్తు ఇంతవరకు వారికి కొమ్ములు మొలిచుంటామని ఎవ్వరూ అనుకోలేదు). బిగ్గరగా మాట్లాడతారు. మొత్తంగా ఎదుటి మనుషులను సతాయించేస్తారు.
ఇంత వరకు చెప్పిన వాటన్నింటినీ ఓడించేసే మరో తత్వమొకటి ఉంది. అది నిజంగానే పెద్ద మÖఢనమ్మకం. కొందరు యువతులు చీరకు బదులు ఫ్యాంటు, షర్టు దరిస్తే అదేదో మహాపరాధమన్నట్లు ‘హూ… కలియుగం దగ్గరకొచ్చేసింది. మహిళా హక్కులు, మహిళా హక్కులని చెప్పి దుస్తులు కూడా అసభ్యంగా మారి పోతున్నాయి’ అంటూ నిట్టూర్పు విడుస్తారు. మరికొందరయితే అసభ్యంగా, మగవారిని రెచ్చగొట్టే విధంగా బట్టలు ధరించడమే చైతన్యమనే కుతర్కానికి పాల్పడతారు. అందువల్లే కొందరు పత్రికా సంపాదకులు కూడా ముందూ వెనకా ఆలోచించక ‘బట్టలు విడిచేయబడే మహిళా విముక్తి’ అని పత్రికల్లో రాస్తుంటారు. అయితే మహిళా చైతన్యాన్ని సమర్థించే ఎవ్వరూ ప్రపంచంలో ఇంత వరకు స్త్రీల హక్కులంటే నగ్నంగా మారటమని చెప్పనేలేదు.
కొందరలా చెప్పటానికి 1960 సంవత్సరాల్లో పాశ్చాత్య దేశాల్లో ఉద్భవించిన మహిళా విముక్తి ఉద్యమం కారణంగా ఉండొచ్చు. ఆ ఉద్యమానికి చెందిన కొందరు మహిళలు తమలో దుస్తులను బహిరంగంగా ఊడదీసి పారేశారు. కాల్చేశారు. నిజానికి వారు తరతరాలుగా పురుషుల భోగలాలసతకు బలైన మహిళల విముక్తికి చిహ్నంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు గానీ లోకంలో పూర్తిగా నగ్నంగా తిరగటానికి కాదు. కానీ పత్రికలు, టీవీ ఛానళ్లు అసలు విషయం వదిలేసి కొసరు విషయానికి ప్రాముఖ్యత నిచ్చి ప్రపంచానికి చాటి చెప్పాయి.
ఆ సమయంలోనే భారతదేశం నుంచ కొందరు మహిళా జర్నలిస్టులు అమెరికా వెళ్లారు. పై విషయాన్ని అక్కడి మహిళా ఉద్యమ నాయకురాళ్లను మన వారు అడిగినప్పుడు, వారు తామింత వరకు ఈ సంగతే వినలేదన్నారు. ఎక్కడో కొన్ని స్వల్ప సంఘటనలు మినహా పాశ్చాత్య దేశాలన్నిటా ‘లో దుస్తుల దహనం‘ కార్యక్రమాలు జరగలేదు.
మరికొందరు మహిళా హక్కుంటేనే తమ హక్కులు ఎక్కడ మంటగలిసిపోతాయే అని ఉలిక్కి పడిపోతారు.
స్త్రీ సమయం చేయబడిన పేదరికం ఎలా ఏర్పడుతుంది…? మహిళలు పిల్లలను, వృద్ధులను, రోగులను చూచుకునే ప్రతిఫలంలేని పనులు మాత్రం ఎందుకు చేయాల్సి వచ్చింది..? ‘ఇవన్నీ పనులా…? కర్తవ్యాలు కదా…? ఆడవారికి వాత్సల్యం లేదా…?’ అని ప్రశ్నించొచ్చు. అయితే పురుషులు మాత్రం ఈ పనులు ఎందుకు చేయటంలేదు…?