నేటి సత్యం శంషాబాద్ జూలై 12
బహదూర్‌గూడ రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
బహదూర్‌గూడ రైతు భూ పోరాట సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహదూర్‌గూడలో మొత్తం సుమారు 1,400 ఎకరాల భూమిలో 650 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర అన్యాయమని అన్నారు.
ఈ భూముల విషయంలో రైతులు న్యాయపోరాటం చేసి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కోర్టు ఆదేశాలను గౌరవించకుండా హైడ్రా వంటి సంస్థలను ఉపయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
హైడ్రా ద్వారా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమిని, ఎవరి నుంచి, ఏ ప్రాతిపదికన స్వాధీనం చేసుకున్నారో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను బెదిరించి భూములు లాక్కోవాలని కాకుండా, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు.
రైతుల భూములకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వకుండా, భూ హక్కులను నిర్ధారించకుండా, బుల్డోజర్లు, బస్ టెర్మినల్, మెట్రో రైలు, ఇతర ప్రాజెక్టుల పేరుతో సాగుభూములను స్వాధీనం చేసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం రైతులను ఒంటరిగా చేసి బెదిరించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో గతంలో లక్షల ఎకరాల భూములను క్రమబద్ధీకరించారని, జీవో 58, 59ల ద్వారా పట్టాలు, రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం వివాదాస్పదంగా ఉన్న ఈ భూములు ప్రభుత్వ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. అయినప్పటికీ దశాబ్దాలుగా సాగు చేస్తున్న నిరుపేద రైతుల నుంచి ప్రభుత్వం పన్నులు వసూలు చేసిందని, ఇప్పుడు అదే భూములపై హక్కులను ప్రశ్నించడం అన్యాయమని అన్నారు.
“పేదవాడి గొంతును వినిపించేది కమ్యూనిస్టులే. పేదల, రైతుల, కార్మికుల పక్షాన ఎర్రజెండా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. బహదూర్‌గూడ రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఐ అండగా నిలుస్తుంది” అని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, రామస్వామి, రైతు సంఘం నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, ఆర్ యాదగిరి.నర్రగిరి, అడ్వకేట్ సతీష్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, గ్రామ రైతులు కృష్ణ మోహన్ రాజు కేఎం రాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు.