నేటి సత్యం/ హైదరాబాద్ /అక్టోబర్ 13
దళిత సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయరా ఎం బాల నరసింహ
దళితుల సబ్‌ప్లాన్ నిధులకు కేటాయింపులే తప్ప ఖర్చులు లేవు – అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి
యం. బాల నరసింహ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ఎస్సీ సబ్‌ప్లాన్ కింద నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యం. బాల నరసింహ విమర్శించారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) రాష్ట్ర సమితి సమావేశం మంగళవారం రోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయం హిమైత్ నగర్ లో తాళ్లపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి యం. బాల నరసింహ మాట్లాడుతూ.దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన, విద్య, ఉపాధి, గృహవసతి, భూమి వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులు, విడుదల, ఖర్చుల వివరాలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని, ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను గుర్తించి వాటిని దళితుల అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలోని పేద దళిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని యం. బాల నరసింహ డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా దళిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఏసురత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, బి అశోక్, టి రామకృష్ణ, కే వెంకటస్వామి, పొన్నగంటి లావణ్య, బి లక్ష్మీపతి, కే రాజరత్నం, ఆరుట్ల రాజ్ కుమార్, కనుకుంట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.