నేటి సత్యం సీఎం గారికి బహిరంగ లేఖ తేదీ: 13 ఏప్రిల్, 2026స్థలం: హైదరాబాద్
విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి..
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు..
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో (TSTRANSCO, TSGENCO, TGSPDCL, TGNPDCL) గత 25-30 సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమిస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 08, 2026 నుండి నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.
గత ప్రభుత్వం 2017లో కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి, ప్రమోషన్లు, సెలవులు ఇవ్వకుండా మోసం చేసింది. సంస్థలోని రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే ‘APSEB రూల్స్’ కాకుండా, ఆర్టిజన్ల కోసం ప్రత్యేకంగా 2020లో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చి వారిపై రుద్దడం అన్యాయం. త్రాగునీరు, లైటింగ్ వంటి కనీస సదుపాయాలు కూడా లేని సబ్ స్టేషన్లలో, తీవ్రమైన సిబ్బంది కొరతతో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు.
*ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చాలి:*
1. విద్యార్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులందరికీ (జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజనీర్ తదితర) కన్వర్షన్ చేయాలి.
2. సంస్థలో పనిచేస్తున్న అందరికీ ఎలాంటి వివక్ష లేకుండా ‘APSEB రూల్స్’ అమలు చేయాలి.
3. TGSPDCL తరహాలోనే TGNPDCL పరిధిలోని Un-Manned వర్కర్స్ ను, అలాగే 2016 నుండి చిన్న చిన్న అభ్యంతరాలతో పక్కనపెట్టిన కార్మికులను సంస్థలో విలీనం చేసుకోవాలి.
4. పీస్ రేట్ వర్కర్స్ (బిల్ రీడర్స్, బిల్ కలెక్టర్స్, హమాలీ తదితర) అందరికీ కనీస వేతన చట్టం అమలు చేయాలి.
5. కార్మికులందరికీ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఇచ్చే ‘PRC-2026’ ను అమలు చేయాలి.
నిరవధిక సమ్మె కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకముందే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరించడం ద్వారా 20 వేల కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
*నెల్లికంటి సత్యం*
*CPI శాసనమండలి సభ్యులు(MLC).*