నేటి సత్యం శేరిలింగంపల్లి ఆగస్టు 7
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం..ప్రతి వార్డులో క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు, సమీక్షలు
పారిశుధ్యం, ఆహార భద్రత, ట్రాఫిక్, బాలల సంక్షేమం, మిస్సింగ్ చిల్డ్రన్పై ప్రత్యేక దృష్టి*
-అధికారులకు కార్యాచరణ ఆదేశాలు..సిఎంసి కమిషనర్ సృజన
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, ఆహార భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, బాలల సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎంసి కమిషనర్ సృజన సూచించారు. ఈ సందర్భంగా సిఎంసి కమిషనర్ మాట్లాడుతూ.. చేపట్టాల్సిన ముఖ్య చర్యలను అధికారులు వెల్లడించారు. నగరంలోని చికెన్, మటన్ దుకాణాలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీధి వ్యాపారులు ప్రజలకు, ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించకుండా నిర్దేశిత ప్రాంతాల్లోనే వ్యాపారం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఫుట్పాత్లు, రహదారులపై ఆక్రమణలను తొలగించి పాదచారులకు సౌకర్యవంతమైన మార్గాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. అలాగే పారిశుధ్య సిబ్బంది సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు పాదచారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. చిన్నారుల కోసం పార్కులు, ఆటస్థలాలు, బాలల సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తరించాలని నిర్ణయించారు. మిస్సింగ్ చిల్డ్రన్ కేసుల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పౌరుల హక్కులు, బాధ్యతలు, పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రోజు ఒక వార్డును సందర్శిస్తూ మొత్తం 50 వార్డులలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి వార్డు పర్యటన అనంతరం సంబంధిత అధికారుల నుంచి ఫీడ్బ్యాక్, పురోగతి నివేదికలు సేకరించి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి తనిఖీలలో గుర్తించిన లోపాలపై వెంటనే చర్యలు తీసుకొని, రెండోసారి పర్యటనకు వెళ్లే నాటికి సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ ప్రత్యేక కార్యాచరణ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.