రైస్ మిల్లర్ల మహాధర్నా
తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 (నేటి సత్యం ప్రతినిధి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైస్ మిల్లర్లు గురువారం మహాధర్నా నిర్వహించారు. తనిఖీల పేరుతో అధికారులు రైస్ మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
బిల్లింగ్ విషయంలో, ఐఎఫ్‌సీ, పీడీఎస్ బియ్యం విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని మిల్లర్లు తెలిపారు. అదేవిధంగా బియ్యం లోడింగ్, అన్‌లోడింగ్ వ్యవహారాల్లో కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం, అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
రైస్ మిల్లర్లకు మద్దతుగా ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. అలాగే లారీ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం రైస్ మిల్లర్లకు మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పప్పుల రాజేందర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ సంతోష్ గుప్తా, క్యాషియర్ సుదర్శన్, నాగులగామ వెంకన్న సెట్, తాడ్కోల్ ఎల్లారెడ్డి తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.