నేటి సత్యం మే 28 ధాన్యం రైతుల ధైన్యం
“పంట కల్లం కాడికి తెచ్చి నెల ఐతాంది.ఒకని మీద ఒకడు షికాయితులు జేసుడు దప్ప ఎవని జిమ్మెదారేందో తెలుస్తలేదు.
అడిగేటోడు లేడు,పట్టించుకునేటోడు లేడు.ఆనలు వడవట్లే.ఇగో అగో అంటరు గని కాంటా ఏసేటోడు లేడు.మిల్లుకు పంపేటోడు లేడు.పైసలెప్పుడు రావాలె.ఎవుసం ఎట్ల జేయాలె” ఒక టీవీ ప్రతినిధి పలకరించినప్పుడు పేద రైతన్న ఏకరువు పెట్టిన ఆవేదన ఇది.
ఎండనక వాననక రాత్రనక పగలనకా చెమటోడ్చి కష్టపడి పండించిన పంట కళ్లముందే వర్షానికి కొట్టుకు పోతుంటే,రెండు చేతులు అడ్డుకట్ట చేసి మిగిల్చుకున్న పంట కూడా తడిసిపోయి పనికిరాకుండా పోతుంటే ఏ రైతు గుండె పగలకుండా ఉంటుంది.
ముఖ్యమంత్రి,మంత్రులు, యంత్రాంగం ఏం చేస్తున్నారో తెలియదు కానీ నెల రోజులుగా కల్లాల్లో ధాన్యరాశుల చుట్టూ దైన్యం ఆవహించింది.
కల్లాల పైనే రైతుల మరణాలు, మండుటెండల్లో కుప్పల పక్కనే కూర్చుని,అక్కడే రాత్రిళ్లు పడుకొని,కాంటాల కోసం బస్తాల కోసం లారీల కోసం రైతుల ఎదురు చూపులు.తేమ,తాలు గ్రేడింగ్ ఆంక్షలు,దళారీల మాయోపాయాలు ఇలా ఎన్నో గండాలు దాటుకుంటూ చివరికి ఓపిక నశించిన రైతుల రాస్తారోకోలు,ధర్నాలు,ఆందోళనలు ఇదీ నేటి తెలంగాణ ముఖచిత్రం.
వైరి పక్షాలు సరే !వామపక్షాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరాయి.ఇంకా నలభై లక్షల టన్నుల ధాన్యం కల్లాల్లోనే మగ్గుతున్నదని మొర పెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధాన్యం సేకరణలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం.మరోవైపు ముఖ్యమంత్రి, మంత్రులు ఈ సంక్షోభానికి కుంటి సాకులు వెతకడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లిన కూలీలు తిరిగి రాకపోవడం వల్ల కొరత ఏర్పడిందని ఒకరు,పశ్చిమాసియా సంక్షోభం వల్ల సంచుల కొరత ఏర్పడిందని ఇంకొకరు,వాహనాల యజమానులు రైస్ మిల్లర్ల మీద నెపం మోపి వేరొకరు,ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు.
దీన్నిబట్టి చూస్తే పాలకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ముంచుకొచ్చే దాకా మొద్దు నిద్ర పోయారన్నది స్పష్టమవుతున్నది.ఎనభై శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం అంటుంటే తొంభై లక్షల టన్నుల ధాన్య సేకరణలో కనీసం నలభై శాతం కూడా పూర్తి కాలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే 54 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని మరో 21 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ కొనసాగుతున్నదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
అది అనుకున్నట్లే పూర్తయినా ఇంకా పదిహేను లక్షల టన్నుల పంట మిగిలిపోతుంది.
భూమి మోయలేనంత పంట పండితే కేంద్రం కేవలం 52 లక్షల టన్నుల ధాన్యం కొను గోలుకు మాత్రమే అనుమతిచ్చిందని మొత్తం ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని బంతిని కేంద్రం వైపు విసిరి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది.
కేంద్రంలో సారధ్యం వహిస్తున్న బీజేపీ తప్పంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనని,కేంద్రం పెంచిన మద్దతు ధర రైతుకు అందకుండా కుట్ర చేస్తున్నదని ఎదురు దాడికి దిగి భరోసా యాత్ర మొదలు పెట్టింది.
ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధి నేతలు బాధ్యతలను విస్మరించి తమ రాజకీయ స్వార్థాలకు రైతును పావుగా వాడుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను అమలు పరుస్తామని,చివరి గింజ వరకు కొంటామని నాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా ప్రకటించారు.అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో తామే కొనుగోలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు.ప్రతి మండలానికి ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.
మక్క పంటకు పూర్వ వైభవం తెస్తామన్నారు.వరి ధాన్యం కొనుగోలులో తేమ శాతం నెపంతో తరుగు తీసే విధానం రద్దు చేస్తామన్నారు.రైతు కమిషన్ ఏర్పాటు చేశారు.ఏం లాభం? ఏ ఒక్కటీ రైతులకు సంతృప్తికరమైన రీతిలో అమలు కాలేదు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ వ్యవసాయ డిక్లరేషన్ అటకెక్కింది.140 లక్షల టన్నుల పంటలో తొలుత తొంభై లక్షలు కొంటామన్న రాష్ట్ర ప్రభుత్వం తుదకు సగమైనా కొనకుండా ఎగనామం పెట్టడమేమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
‘మద్దతు ధర పెంచాం మా పని అయిపోయింది’ అన్నట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.పండిన పంట ఎంతైనా కొంటామని మాత్రం హామీ ఇవ్వలేకపోతున్నారు.
అరవై ఏళ్ల క్రితం నెలకొల్పిన కేంద్రం ఆజమాయిషిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం కొనుగోలు, రవాణా,నిల్వ,సరఫరా,అమ్మకం చేపట్టాలి.ఇతరత్రా సహకారాన్ని రాష్ట్రాలకు అందించాలి.
కానీ అంచనాలకు మించి ఆహార నిల్వలు ఉన్నాయని ధాన్యాన్ని కొనకుండా చేతులెత్తేయడం కేంద్రం చేయాల్సిన పని కాదు.ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఆహార/ఆకలి సూచీ ప్రకారం మనదేశం 104 దేశాల కంటే వెనుకబడి ఉంది.
కేంద్రం అంటున్నట్లు ఆహార ధాన్యాల నిల్వలు పుష్కలమైతే క్షేత్రస్థాయిలో పేదలకు తీవ్రమైన ఆహార కొరత ఎందుకున్నట్లు? వరి వద్దనుకుంటే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ స్థాయిలో అందుకు తగిన కార్యాచరణకు ఉపక్రమించడం లేదు.
రైతు వేదికల ద్వారా గ్రామ గ్రామాన అవగాహన కల్పించడం లేదు.తూతూ మంత్రంగా చేసే కార్యక్రమాలు రైతు దాకా చేరడం లేదు.ఫలితంగా అనివార్యంగా రైతు వరి సాగును ఆశ్రయిస్తున్నాడు.
ప్రభుత్వాలకు ముందుచూపు ఉండాలి.దప్పికైనప్పుడే బావి తవ్వుతానంటే కాలయాపన జరిగి ప్రజలు నష్టపోతారు.కొనుగోళ్ల ప్రక్రియ ఏప్రిల్ నాటికే ముగింపు దశకు రావాలి.
మే నెలలో అకాల వర్షాలకు ఆస్కారం ఉంటుంది.
పౌరసరఫరాల శాఖకు ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? దిగుబడి ఎంత? కావలసిన సంచులు,సుతిలి దబ్బనాలు, టార్పాలిన్లు,లారీలు,ట్రాక్టర్లు, హమాలీల అవసరమెంత? మిల్లర్ల సాధక బాధకాలే మిటి? వంటి అంశాలలో ఒక స్పష్టమైన అంచనా లేక రైతులు నష్టపోయాక ఉపశమన చర్యలు చేపట్టడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే.ఒక రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పూర్తి బాధ్యత కేంద్రానిదే.
అలాగే కల్లాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి బస్తాల్లో నింపి రైస్ మిల్లర్లకు పంపి వచ్చిన బియ్యం నిల్వలను కేంద్రానికి అప్పగించడం రాష్ట్రం బాధ్యత.‘వన్ నేషన్ వన్ పాలసీ’ అంటూ ఘోషించే బీజేపీ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం పంజాబ్ హర్యానాలతో పోల్చుకుంటే తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందనే విమర్శలున్నాయి.మే నెలాఖరు కల్లా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనుగోలు ప్రక్రియ వేగం పెంచాలని ఆదేశించారు.వారెంతవరకు కృతకృత్యుల వుతారో? రైతులకు ఏ మేరకు న్యాయం జరుగుతుందో? చూడాలి.
డా. అయాచితం శ్రీధర్, 9849893238