Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogమార్కాపురం జిల్లాలో పర్యటక అభివృద్ధి.

మార్కాపురం జిల్లాలో పర్యటక అభివృద్ధి.

నేటి సత్యం మార్కాపురం జూన్ 27

మార్కాపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధి

ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు వెలిగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనకు దోర్నాల మండలం గంటావానిపల్లె విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతిస్తూ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని గురించి విజ్ఞప్తి చేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కార్యాచరణను పాలసీలను అమలు చేస్తుంది.నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో చెప్పుకోదగిన పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.వాటిలో త్రిపురాంతకం,పాలంక ,గొడ్రాలికొండ, మార్కాపురం,వెలిగొండ,పృధులగిరి, భైరవకోన, మోక్షగుండం, గిద్దలూరు పాతాళ నాగేశ్వరాలయం వంటి పుణ్యక్షేత్రాలు-అలాగే కంభం చెరువు, దూపాడు -చందవరం బౌద్ధారామం,వేనూతల కాటమరాజు,వీరమేడపి, కనిగిరి దుర్గం వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

వీటిలో ముఖ్యంగా ‌శ్రీశైలక్షేత్రానికి తూర్పు ముఖద్వారంగా ఉన్న త్రిపురాంతక క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉంది.ఇది పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధమైంది.కొండ మీద త్రిపురాంతకేశ్వరస్వామి కొండ దిగువన త్రిపురసుందరీదేవి స్వయంభువుగా వెలసి ఉన్నారు.ఇక్కడ యాత్రికులకు సరైన వసతులు గానీ రవాణా సౌకర్యాలు గానీ లేవు.ఇక్కడనుండి యర్రగొండపాలెం వెళ్లి అక్కడున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, వృశ్చికాల మల్లేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకునే ఏర్పాట్లు ఉంటే యాత్రికులు పెరిగే అవకాశం ఉంటుంది.

త్రిపురాంతకం సమీపంలోనే గుంటూరు -కర్నూలు హైవేపైన బాలచంద్రుడు బొంగరాలాడిన పల్నాటి యుద్ధం సన్నద్ధం ప్రదేశం వీరమేడపి గ్రామం ఉంది.అదే మార్గంలో దూపాడు -చందవరం బౌద్ధారామం ఉంది.ఈ చారిత్రక ప్రదేశాలు చూసితీరవలసినవి.అదే జాతీయ రహదారిపై రాజంపల్లి సమీపంలో పురాతనమైన తిరుమలనాథస్వామి ఆలయం నెలకొని ఉంది.ఈ ఆలయం దర్శనంతో గొడ్రాలికి కూడా సంతానం కలుగుతుందని అందుకే దీనికి గొడ్రాలికొండగా పేరొచ్చిందని చెప్తారు.ఇక్కడే కేంద్రీయ విద్యాలయం కూడా ఏర్పాటు చేయబడింది.ఇది ప్రకృతి మనోహరమైన ప్రశాంత ప్రదేశం.

ఇక పెద్ద దోర్నాల మండల కేంద్రమే కాక శ్రీశైలక్షేత్రం వెళ్లే కూడలి ప్రదేశం.ఇది నల్లమల ద్వారం.అందుకే ద్వారమల దోర్నాల అయింది.ఇది అల్లసాని పెద్దన మహాకవి పూర్వీకుల జన్మస్థలం కూడ.దీని ప్రాధాన్యతను బట్టి దిగువ శ్రీశైలంగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉంది.

ఇంక జిల్లా కేంద్రం మార్కాపురం విషయానికొస్తే ఇది నాలుగు యుగాల చరిత్ర కల్గిన పవిత్ర ప్రదేశం .ఒకప్పటి గజారణ్య ప్రాంతం.ఇక్కడ మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించిన శివాలయం, విజయనగర రాజులు అభివృద్ధి పరచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాలు ఉన్నాయి.మరొక రకంగా ఇది శ్రీశైలక్షేత్రానికి దక్షిణ ద్వారంగా ఉంది.దీని సమీపంలోనే వెలిగొండ శ్రీవేంకటేశ్వర దేవాలయం, ఆధునిక దేవాలయం వెలిగొండ ప్రాజెక్టు ఉన్నాయి .నిజానికిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నడిబొడ్డుగా నిలుస్తుంది.

ఇక కంభం చెరువు ఆసియాలోనే రెండవ అతిపెద్ద తటాకంగా ప్రసిద్ధమైంది.శ్రీకృష్ణదేవరాయల దేవేరి వరద రాజమ్మ నిర్మించిన చెరువుగా చారిత్రక నేపథ్యం కలిగి ఉంది.ప్రపంచ ప్రఖ్యాత సంగీత త్రయంగా పేరొందిన వారిలో ఇద్దరి పూర్వీకులు ఇక్కడి వారే.ఒకరు శ్రీ శ్యామశాస్త్రి మరొకరు కాకర్ల త్యాగరాజస్వామి.వెలిగొండ కాకర్ల గ్యాపు ప్రక్కనే త్యాగరాజస్వామి వారి ఆలయం ఉంది.సంగీత ప్రియులు చూసితీరవలసిన ప్రదేశం ఇది.

ఉమ్మడి ప్రకాశం జిల్లా వరదాయిని గుండ్లకమ్మ నదీ జన్మస్థానం గుండ్లబ్రహ్మేశ్వరం గిద్దలూరు అటవీ ప్రాంతంలో ఉంది.ప్రకృతి రమణీయమైన ఈ ప్రాంత దర్శనం కట్టడి చేయబడింది.దీన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయవలసి ఉంది.అలాగే గిద్దలూరులోని పాతాళ నాగేశ్వరాలయం కూడా చూడదగిన శైవ క్షేత్రం.

రాచర్ల మండలంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవాలయం, చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోన రాతి గుహాలయాలు,తురిమెళ్ల కనక సురభేశ్వరాలయం తప్పక చూడవలసిన పుణ్య క్షేత్రాలు.

ఇంకా పల్లవ రాజులకాలం నాటి కనిగిరి దుర్గం మరో ముఖ్యమైన చారిత్రక ప్రదేశం.పూర్వం పృథులాపురిగా పేరొందిన పొదిలి సమీపంలోని పృథులగిరి క్షేత్రం,పొదిలి నిర్మమ మహేశ్వరాలయం పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధమైనవి.

ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కలుగజేసి ఆయా ప్రదేశాల్లో పర్యాటకులకు తగు వసతులు ఏర్పాటు చేస్తే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగి జిల్లాకు ఆర్ధిక వనరులతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

ఈ దిశగా సంబంధిత ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ నాయకులు,ప్రజలు ఆలోచించి ప్రయత్నిస్తే మార్కాపురం జిల్లాలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని ఆశిద్దాం.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments