Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogదివ్యాంగులకు ఇంటర్ తరగతులు

దివ్యాంగులకు ఇంటర్ తరగతులు

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 28

దివ్యాంగులకు త్వరలో ఇంటర్ తరగతులు ప్రారంభం

శరీరానికి పరిమితులు ఉండొచ్చు… సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవు

హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగుల సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది

*దివ్యాంగులు జాలి కోరేవారు కాదు… అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు*

*హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకల్లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్*

“వైకల్యం విజయానికి అడ్డంకి కాదు… ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన అడ్డంకి. శరీరానికి పరిమితులు ఉండొచ్చు… కానీ సంకల్పానికి ఎలాంటి పరిమితులు ఉండవు” అని దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు.

ప్రపంచానికి పట్టుదల, ఆత్మవిశ్వాసం, అచంచల సంకల్పానికి ప్రతీకగా నిలిచిన హెలెన్ కెల్లర్ 146వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ… హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి శాశ్వత స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేవలం 19 నెలల వయసులో చూపు, వినికిడి రెండింటినీ కోల్పోయినా ఆమె తన సంకల్పబలంతో ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు.

తన గురువు ఆన్ సలివన్ మార్గదర్శకత్వంలో స్పర్శ ద్వారా విద్యను అభ్యసించి, దృష్టి-శ్రవణ వైకల్యం ఉన్న తొలి డిగ్రీధారిణిగా చరిత్ర సృష్టించడమే కాకుండా రచయిత్రిగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా కోట్లాది మంది దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.

“ఆమె చీకటిలో జీవించింది… కానీ ప్రపంచానికి వెలుగు చూపించింది. హెలెన్ కెల్లర్ ఒక వ్యక్తి కాదు… పట్టుదల అనే పదానికి ప్రత్యక్ష రూపం” అని మంత్రి పేర్కొన్నారు.

*సంక్షేమం నుంచి సాధికారత వైపు తెలంగాణ ప్రయాణం*

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దివ్యాంగులను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడం, స్కూటీలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు, సహాయక పరికరాల పంపిణీ, ఆన్‌లైన్ దరఖాస్తుల ద్వారా రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు 2,000 మంది లబ్ధిదారులకు పారదర్శకంగా సహాయం అందించామని వెల్లడించారు.

దివ్యాంగ ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీలు పొందేందుకు జీవో నెం.34 ద్వారా అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని పేర్కొన్నారు.

దివ్యాంగ విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రాధాన్యమిస్తూ కరీంనగర్, మహబూబ్‌నగర్, మిర్యాలగూడలో ప్రస్తుతం పదో తరగతి వరకు ఉన్న ప్రత్యేక పాఠశాలలను త్వరలో ఇంటర్మీడియట్ వరకు విస్తరించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ప్రత్యేక పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వేతనాల్లో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.

దివ్యాంగుల పెన్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.4,000 నుంచి రూ.6,000కు పెంచే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు వారి కోటా ప్రకారం ప్రాధాన్యతనిస్తూ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నామని తెలిపారు.

“*మీ సమస్యలు నా కుటుంబ సమస్యలే*”

దివ్యాంగుల కష్టాలు తనకు బాగా తెలుసని, తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.

“మీకు మంత్రిగా కాదు… మీ కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటాను. మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత” అని హామీ ఇచ్చారు.

గత పాలకులు దాదాపు పదేళ్లపాటు దివ్యాంగుల సమస్యలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం మాత్రం వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

త్వరలో జావేద్ అబిద్ విగ్రహం ఏర్పాటు చేస్తానని మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు.వికలాంగుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సంక్షేమం కోసం పాటుపడిన జావేద్ విగ్రహాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తానన్నారు.

*ప్రతిభకు ప్రోత్సాహం*

ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న ప్రతిభావంతులైన పలువురు దివ్యాంగ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర సహాయక పరికరాలు అందజేశారు.

*విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశం*

విద్యార్థులను ఉద్దేశించి మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…

“మీరు జాలి కోరే వారు కాదు… అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టించే ప్రతిభావంతులు.”

“మీ వైకల్యం మీ గుర్తింపు కాదు… మీ విజయం మీ అసలైన గుర్తింపు.”

“మీ లోపాన్ని ప్రపంచం గుర్తుంచుకోదు… మీరు సాధించిన విజయాన్ని మాత్రమే చరిత్ర గుర్తుంచుకుంటుంది.”

అని మంత్రి అడ్లురి ఉద్బోధించారు.

దేశంలో దృష్టిలోపాన్ని అధిగమించి సివిల్ సర్వీసుల్లో అత్యున్నత విజయాలు సాధించిన పలువురు యువతను ఉదాహరణగా పేర్కొంటూ, కుటుంబం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమేనని చెప్పారు.

“ఈ రోజు బెంచ్‌పై కూర్చున్న విద్యార్థే… రేపు జిల్లా కలెక్టర్ కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు మీలో నుంచే రావాలి. మీ పేరు ముందు ‘దివ్యాంగుడు’ కాదు… ‘విజేత’ అని సమాజం పిలిచే రోజు రావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.

“అవరోధాలను అవకాశాలుగా మార్చుకుందాం… పరిమితులను విజయాలుగా మలుచుకుందాం… ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం… తెలంగాణ అభివృద్ధి గాథలో మన విజయాలను స్వర్ణాక్షరాలతో లిఖిద్దాం” అని మంత్రి అడ్లురి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దివ్యంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, దివ్యాంగుల శాఖ సంచాలకురాలు శైలజ, కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ప్రభంజన్, వివిధ దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments