గన్నేరువరం జూలై 16
గన్నేరువరం మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నిక: అధ్యక్షుడిగా జి. వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా పి. రాజేష్ ఏకగ్రీవ ఎన్నిక
గన్నేరువరం మండల పంచాయతీ కార్యదర్శుల యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్లుగా వ్యవహరించిన గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ ఏఈ మహేందర్ రెడ్డి ల పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు.మండలంలోని పంచాయతీ కార్యదర్శులందరి సమక్షంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో, గన్నేరువరం పంచాయతీ కార్యదర్శి జి. వెంకట్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గునుకులకొండాపూర్ పంచాయతీ కార్యదర్శి పి. రాజేష్ జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… మండలంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, అందరినీ కలుపుకొని యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ఎలక్షన్ అధికారులకు, మండలంలోని తోటి పంచాయతీ కార్యదర్శులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొన్నారు.